
తిరుమలలో ఉభయదేవేరులతో మలయప్ప ఉత్సవమూర్తులు
గోవిందా.. నీ యాత్రికులు, ఆదాయం తగ్గిందేమిటి స్వామీ..
శ్రీవారి బ్రహ్మోత్సవ ఆదాయం రూ.25.12 కోట్లు. టీటీడీ చైర్మన్
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గత ఏడాదితో పోలిస్తే ఆదాయం తగ్గింది. శ్రీవారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య కూడా తగ్గింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు, తలనీలాలు సమర్పించిన యాత్రికుల సంఖ్య కూడా అలాగే ఉన్నట్లు టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అన్నప్రసాదాలు, లడ్డూ తయారీలో నాణ్యత పెరిగింది. నిత్యాన్నదానంలో కూడా చక్కటి ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదాయం, యాత్రికుల సంఖ్య తగ్గడం వెనుక కారణం ఏమిటి? అసాధారణ బందోబస్తు యాత్రికులను కట్టడి చేసిందా? అనే చర్యకు ఆస్కారం ఏర్పడింది.
సమన్వయంతో సఫలం
ఈ ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమష్టి కృషితో విజయవంతం చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. యాత్రికులకు సేవలు అందించడంలో ఎక్కడా రాజీ పడకుండా నిరంతరాయంగా అన్ని శాఖలు పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.
తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం చైర్మన్ బీఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు, పక్కన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, సీవిఎస్ఓ కేవి. మురళీకృష్ణ, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
చైర్మన్ బిఆర్. నాయుడు ఏమి చెప్పారంటే..
"2025 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిది రోజుల్లో శ్రీవారిని 5.80 లక్షల మంది యాత్రికులు దర్శిచుకున్నారు. వారి ద్వారా శ్రీవారి హుండీకి కానుకలు ద్వారా రూ.25.12 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది" అని నాయుడు చెప్పారు.
గత ఏడాదే మేలు..
2024 వార్షిక బ్రహ్మెత్సవాలతో పోలిస్తే ఆదాయంతో పాటు యాత్రికుల సంఖ్య కూడా తగ్గింది. అప్పటి ఈఓ జే. శ్యామలరావు వెల్లడించిన వివరాల మేరకు..
"గత ఏడాది తిరుమల వెంకన్నకు 26 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆరు లక్షల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. 30 లక్షల లడ్డూలు విక్రయించారు. బ్రహ్మత్సవంలో రోజూ ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచాం. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు" అని శ్యామలరావు వెల్లడించిన విషయం తెలిసిందే.
టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు చెప్పిన వివరాల ప్రకారం.
"ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 26 లక్షల మందికి పైగా యాత్రికులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తుల విక్రయించాం. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు 14,459 ట్రిప్పులు నడిపి 4.40లక్షల మంది, తిరుమల నుంచి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మంది భక్తులను చేరవేశాం" అని నాయుడు వివరించారు.
తిరుమల శ్రీవారికి సీఎం నారా చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సమయంలోనే 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు.
తిరుమలలో యాత్రికుల సౌకర్యం కోసం రూ.102 కోట్లతో నూతనంగా నిర్మించిన పీఏసీ-5 భవనాన్ని భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, సీఎంచంద్రబాబు ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో క్యూలైన్ల నిర్వహణ కోసం నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే పరికరాలను ప్రారంభించారు.
గరుడసేవ రోజు పటిష్ట ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన గరుడసేవ రోజు భక్తలందరికీ దర్శనం కల్పించామని టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు వివరించారు. "యాత్రికులతో గ్యాలరీలు, క్యూలో తనతో పాటు పాలక మండలి సభ్యులు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి ఉన్నతాధికారులు అందరం మాట్లాడాం, టిటిడి కల్పించిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు" అని నాయుడు వివరించారు. గరుడసేవ రోజు హోల్డింగ్ పాయింట్ల ద్వారా ఈసారి అదనంగా 30వేలు, రీఫిల్లింగ్ ద్వారా 15వేల మందికి దర్శనం కల్పించినట్లు ఆయన చెప్పారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
వాహనసేవల ముందు మునుపెన్నడూ లేనివిధంగా 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలలో, దాదాపు 6,976 మంది కళాకారులు ప్రదర్శనలు ఏర్పాటు చేయించిన విషయాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు గుర్తు చేశారు. గరుడసేవ రోజు 20 రాష్ట్రాల నుంచి 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చారని ఆయన చెప్పారు. బ్రహ్మోత్సవాలలో 60 టన్నులు పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించినట్లు తెలిపారు
ఆ సేవలు అభినందనీయం
బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవకులు విశేష సేవలు చేశారని చైర్మన్ బిఆర్. నాయుడు అభినందించారు. లక్షలాది మంది భక్తులకు 3500 మంది శ్రీవారి సేవకులు సేవ చేశారన్నార. 50 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్ సిబ్బందిని, 14 అంబులెన్సులు అందుబాటులో ఉంచామన్నారు. బ్రహ్మోత్సవాలకు 4వేల మంది పోలీసులు, 1800 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రత. గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు విధులు నిర్వహించడానికి టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సమన్వయంతో పనిచేశారని అభినందించారు. గరుడసేవ రోజు 2800 మంది పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గరుడసేవ రోజు అదనంగా 650 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, సదాశివ రావు, జానకీదేవి, జి.భానుప్రకాష్ రెడ్డి, శాంతారామ్, నరేష్ అధికారులు పాల్గొన్నారు.
Next Story