
శ్రీకాళహస్తి వద్ద అడవిలో చిక్కుకున్న యాత్రికులను తీసుకుని వస్తున్న రెస్క్యూ టీం.
Followup Story | శ్రీకాళహస్తి:అడవిలో 24 గంటల నరకయాతన నుంచి విముక్తి
22 మంది యాత్రికులను కాపాడిన పోలీస్, రెవెన్యూ యంత్రాంగం
దట్టమైన అడవిలో వాగు దాటలేక చిక్కుకుపోయిన శ్రీకాళహస్తికి చెందిన యాత్రికులను మంగళవారం రాత్రి సురక్షితంగా ఒడ్డుకు తీసుకుని వచ్చారు. పాపకు పుట్టువెంట్రుకలు తీయాలనే మొక్కు చెల్లించడానికి శ్రీకాళహస్తి NTR నగర్‌కు చెందిన చిలుకా గోపి కుటుంబానికి చెందిన 22 మంది దట్టమైన అడవిలోని బత్తినయ్య కొండకు సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు.
ఈ పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించాలనే బత్తినకోనకు వెళ్లిన యాత్రికులు
తుపాను కారణంగా వర్షాలు కురవడం వల్ల కొండకోనల నుంచి వాగులు వరదనీటితో పోలెత్తాయి. ఇదే సమయంలో స్వర్ణముఖీ నదీ ఉప్పొంగింది. ఈ విషయం గోపి కుటుంబానికి తెలియదు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ముసలిపేడు గిరిజన కాలనీ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీప్రాంతంలోని బత్తినయ్యకోనకు సోమవారం గోపీ కుటుంబీకులు, బంధువులు వెళ్లారు. అక్కడి గోపి మనవరాలికి పుట్టువెంట్రుకలు తీసే కార్యక్రమం పూర్తయ్యాక తన చిన్నకూతురుతో కలిసి గోపి సోమవారం రాత్రికే శ్రీకాళహస్తికి చేరుకున్నారు. తమ కుటుంబీకులు మంగళవారం మధ్యాహ్నానికి కూడా ఇంటికి చేరకపోవడంతో ఆయన మనసు కీడు శంకించినట్టు ఉంది. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నేత జనమాల గురవయ్య అధికారులకు సమాచారం అందివ్వడంతో పాటు మీడియాకు కూడా ఉప్పందించారు.
రంగంలోకి అధికారులు
బత్తనయ్యకోనలో శ్రీకాళహస్తి ప్రాంత యాత్రికులు చిక్కుబడి పోయిన సమాచారంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇదే సమయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కూడా స్పందించారు. రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్‌ఐలు ఇమామ్, వెంకటలక్ష్మి, సిబ్బంది రిస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి రంగంలోకి దిగారు. వారు అటవీప్రాంతంలోకి ప్రవేశించే సమయానికి పరిస్థితి దారుణంగా ఉండడం గమనించారు..
వాగు వద్ద బిక్కుబిక్కుమంటూ...
దట్టమైన అటవీప్రాంతంలోని బత్తినయ్య కోనకు వెళ్లిన 22 మంది శ్రీకాళహస్తి యాత్రికులు మంగళవారం తిరుగు ప్రయాణం అయ్యారు. కొంతదూరం నడిచి వచ్చే సరికి మార్గమధ్యలో వాగు వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. అదే సమయంలో జోరున వర్షం కురుస్తోంది. పిల్లా, పెద్దలు వర్షంలో తడుస్తే, గజగజలాడుతున్నారు. తిరిగి వెనక్కి వెళ్లలేని పరిస్థితి. వాగుదాటడం అంటే ప్రాణాలు ఫణంగా పెట్టడమే. ముసలిపేడు గిరిజన కాలనీకి చేరుకునేందుకు మరో మార్గం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.
సరిగ్గా అదే సమయంలో..
అడవిలో చిక్కుబడిపోయిన యాత్రికులను కాపాడాలని పోలీసు, రెవన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బంది సరిగ్గా అదే సమయంలో వాగువద్దకు చేరుకున్నారు. స్వర్ణముఖీ నది ఉప్పొంగడంతో వరదీనీరు అడవిలోనే వంకల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటితో పరవళ్లు తొక్కుతున్న వాగుకు ఇటు పక్క అధికారుల బృందం. అటుపక్క భయంతో బిక్కచచ్చిపోయిన యాత్రికులు కనిపించారు. వారికి దూరం నుంచి ధైర్యం చెప్పిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భరోసా ఇచ్చారు. జేసీబీ యంత్రంతో పాటు ట్రాక్టర్, తమ వెంట తీసుకుని వెళ్లిన మోకులు (తాళ్లు) తీసుకుని వెళ్లారు. క్షణం ఆలస్యం చేయకుండా పోలీస్, అగ్నిమాపక సిబ్బంది జేజీబీలో నీటిలోకి దించారు. బలమైన తాళ్లను ఓ చెట్టుకు కట్టారు. నీటిలో జేసీబీని నిలిపారు. తాడును ఒడ్డున ఉన్న అధికారులు మరో చెట్టుకు కట్టడం ద్వారా యాత్రికుల చేతికి పెద్ద కర్రలు ఊతంగా ఇచ్చి, ఒక్కొక్కరిని జాగ్రత్తగా ఇవతలి ఒడ్డుకు తీసుకుని రావడానికి సుమారు ఐదు గంటలకు పైగానే శ్రమించారని తెలిసింది.
అందరినీ రక్షించి...
శ్రీకాళహస్తి నుంచి వెళ్లిన 22 మంది యాత్రికులను భద్రంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు ట్రాక్టర్ ముసలిపేడు గిరిజన కాలనీకి చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తోపాటు గ్రామస్తులు కీలక పాత్ర పోషించారు. వారందరికీ ముసలిపేడు ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పునరావాసం కల్పించి, పర్యవేక్షణలో ఉంచారు. యాత్రికులందరికీ అల్పాహారం కూడా అధికారులే ఏర్పాటు చేశారు. దీంతో 24 గంటల ఉత్కంఠకు తెరపడింది.
"ప్రమాద పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హితవు పలికారు. అత్యవసరంగా సేవలు అందించడానికి తమ పోలీసులు సిద్ధంగా ఉంటారని కూడా ఆయన గుర్తు చేశారు.
"వాతావరణం అనుకూలించినప్పుడు ప్రయాణాలను కూడా మానుకోవడం మంచిది. ఈ తరహా పరిస్థితులతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు" అని ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు.
Next Story

