శ్రీకాళహస్తి: భూ రికార్డుల్లో భారీ కుంభకోణం?
x

శ్రీకాళహస్తి: భూ రికార్డుల్లో భారీ కుంభకోణం?

భూ వివరాల నమోదులో అవకతవకలపై ఏసీబీ రంగంలోకి దిగింది. ఉదయం నుంచి అధికారులను విచారణ చేస్తున్నారు. భూ బాధితులు భారీగా కార్యాలయం వద్దకు చేరుకున్నారు.


భూమి రికార్డుల తారుమారు చేయడం. ఒకరి పేరిట ఉన్న భూములు మరొకరు పేరిట నమోదు చేయడం. ఈ తరహా మ్యాజిక్ చేయడంలో రెవెన్యూ శాఖలో కొందరికి కొదవ లేదు. ఈ పరిస్థితుల్లో..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భూముల మాయ మరింత వేడి రగిల్చింది. ఓ బాధితుడి ఫిర్యాదుతో సోమవారం ఉదయం తిరుపతి అవినీతి నిరోధక శాఖ ( Anti-Corruption Bureau ACB) ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సర్వేయర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసీల్దార్, ఇతర సిబ్బందిని ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు. ఈ సమాచారం తెలియడంతో బాధిత రైతులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.

"వేరే వాళ్ల దగ్దర డబ్బు తీసుకుని, మాకు అన్యాయం చేశారు" అని వృద్ధ రైతు దంపతులు ఏసీబీ అధికారుల వద్ద కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా,
ఉమ్మడి జిల్లా మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధంతో గత ఏడాది సంచలనం రేగింది. ఆ దర్యాప్తు ఇంకా సా..గుతూనే ఉంది. ఇదిలావుంటే..
ఏసీబీ దాడితో కలకలం
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతిసోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించే విషయం తెలిసిందే. భూ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఉదయమే చేరుకున్నారు. పది గంటల తరువాత ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కార్యాలయం తలుపులు మూసేసి, తనీఖీలు ప్రారంభించారు. ఆ తరువాత కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి వద్ద వివిధ గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
"రెవెన్యూ అధికారుల వల్ల మా భూములు పోయాయి. మా దగ్గర పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయి. మా ఎరిక లేకుండానే వేరే వాళ్ల పేర్లు ఆన్ లైన్ లో నమోదు చేశారు" అని భూములు కోల్పోయిన బాధితులు ఏసీబీ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయంలోకి వస్తే,
దాడి సాగిన తీరు ఎలాగంటే..
శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజుల నుంచి డీకేటీ భూముల వివరాలు ఆన్ లైన్ చేస్తున్నారు. దీనికోసం లక్ష రూపాయలు డిమాండ్ చేశారని తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న చంద్రశేఖరరెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. వివరాలు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ఆయన నుంచి రూ.25 వేలు మొదటి విడతగా చెల్లించడానికి స్కెచ్ వేసి తహసీల్దార్ కార్యాలయంలోకి పంపించారు.

కాసేపటికి తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి, డీఎస్పీ ప్రశాంతి తమ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. అప్పటికే భూములు ఆన్ లైన్ చేయడానికి రూ.25 వేలు డిమాండ్ చేసిన సర్వేయర్ పురుషోత్తం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని సమాచారం అందింది. దీంతో సర్వేయర్ తోపాటు తహసీల్దార్ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. మిగతా ఏసీబీ అధికారులు రెవెన్యూ రికార్డులు పరిశీలించడంతో పాటు, భూముల వివరాలు ఆన్ లైన్ చేయడంలో జరిగిన అవకతవకలపై సునిశీతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఉదయం నుంచి ఇంకా జరుగుతూనే ఉన్నట్లు అక్కడి మీడియా ప్రతినిధుల నుంచి సమాచారం అందింది.
అన్యాయం చేస్తున్నారు. తల్లీ...
తహసీల్దార్ కార్యాలయం లోపల అదనపు ఎస్పీ విమలకుమారి పర్యవేక్షణలో విచారణ సాగిస్తూ ఉన్నారు. కాపేపటికి మధ్యలో డీఎస్పీ ప్రశాంతి కొంతసేపు కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చి, సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన రైతులతో మాట్లాడారు.
"మా రికార్డుల్లో లెక్కలు తారుమారు చేశారు. తీవ్రంగా అన్యాయం చేశారమ్మా" అని వృద్ధ దంపతులు డీఎస్పీ ప్రశాంతి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తిప్పుకుంటూనే ఉన్నారు...

పట్టాదారు పాసుపుస్తకాల్లో భూముల వివరాలు తారుమారు చేశారని శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు కన్నీటి పర్యంతమైంది. ఆమె ఇంకా ఏమన్నారంటే..
"మాకు తెలియకుండానే మా సర్వే నంబర్ వేరే వాళ్ల పేరుతో ఆన్ లైన్ చేశారు. ఈ విషయం మాకు చెప్పలేదు. ఎందుకు ఇలా చేశారని అడిగితే సమాధానం చెప్పడం లేదు. ఈ తప్పులు సరిచేయమని నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా. రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. తప్పిలే తహసీల్దార్ మాకు న్యాయం చేయడం లేదు" అని కలత చెందింది.
వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని...

శ్రీకాళహస్తీ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ వృద్ధ దంపతులది ఆవేదన మరో రకంగా ఉంది.
"వేరే వాళ్ల దగ్గర రెవెన్యూ వాళ్లు డబ్బు తీసుకుని మాకు అన్యాయం చేశారు" అని ఆరోపించారు. "మా భూములు వేరే రైతుల పేరిట లెక్కల్లో నమోదు చేశారు" అని ఏసీబీ డీఎస్పీ ప్రశాంతివద్ద ఆవేదన చెందారు.
"మీ దగ్గర రెవెన్యూ అధికారులు డబ్బు తీసుకున్నారా? అడిగారా?" అని ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి అడిగిన ప్రశ్నకు మరో రైతు వద్ద డబ్బు తీసుకుని మాకు అన్యాయం చేశారని ఆ వృద్ధ రైతు దంపతులు ఆరోపించారు. ఈ విషయంలో ఆర్డీఓతో మాట్లాడి, తగు చర్యలు తీసుకుంటామని ఆ దంపతులకు ఏసీబీ డీఎస్పీ ప్రశాంతి సముదాయించారు.
భారీగా వచ్చిన రైతులు
వాస్తవానికి సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి రైతులు, ప్రజలు రావడం సహజం. కానీ, రెవెన్యూ పట్టాపాసు పుస్తకాల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారనే సమచారం శ్రీకాళహస్తి ప్రాంతంలో విస్తృతంగా పాకింది. దీంతో రెవెన్యూ కార్యాలయంలో తమకు జరిగిన అన్యాయాన్ని ఏసీబీ అధికారులకు వివరించడానికి పెద్దసంఖ్యలో రైతులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుంది.ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉంది.
Read More
Next Story