
Srikalahasti సమీపంలోని బత్తినయ్యకోనకు వెళ్లే దట్టమైన అడవి
Breaking | శ్రీకాళహస్తి: అడవిలో చిక్కుకుపోయిన యాత్రికుల బృందం..
వాగులు దాటలేక 48 గంటలుగా నరకయాతన.
అధికారులు తుపాను నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అడవిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. బడ్డకు పుట్టువెంట్రుకలు తీయడానికి దట్టమైన అడవిలోని బత్తినయ్యకోనకు వెళ్లిన శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన 15 మంది యాత్రికులుచిక్కుకుపోయిచారు.
తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో అడవిలో వాగులు పోటెత్తాయి. దీంతో ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో యాత్రికులు సోమవారం నుంచి అష్టకష్టాలు పడుతున్నారని సమాచారం అందింది. ఈ విషయం తెలియడంతో తహసీల్దార్, పోలీసు అధికారులు అడవిబాట పట్టారు. అడవిలో చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఏర్పేడు సీఐ, తహసీల్దార్ భార్గవి, అటవీశాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది అడవిలోకి చేరుకున్నారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తాళ్ల సాయంతో వారిని ఇవతలి ఒడ్డుకు సురక్షితంగా తీసుకుని వచ్చే యత్నాలు ప్రారంభించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బత్తినయ్యకోన (భక్తవెంకటేశ్వరస్వామి ఆలయం)కు వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రీకాళహస్తి నుంచి మరోదారి ఏర్పేడు మండలం ముసలిపేడు నుంచి అడవిలోనే రెండు కిలోమీటర్ల వరకు వాహనంలో వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తరువాత ఏడు కిలోమీటర్లు కాలిబాటలోనే కొండపై ఉన్న బత్తినయ్యకోనకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. మార్గమధ్యలో వర్షాకాలం వాగులు, వంకలు వరదనీటితో పోటెత్తుతుంటాయి. ప్రస్తుతం బత్తినయ్యకోనకు (కొండపైకి ) వెళ్లే మార్గంలో వాగులోకి దిగే ఆస్కారం కూడా లేదని శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన జర్నలిస్టు శ్రీనివాసులు చెప్పారు
"బత్తినయ్యకోనకు వెళ్లాలని భావించే వారు శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొండమనాడు ప్రాంతాల్లోని బంధువులతో కలిసి జట్టుగా వెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీ" అని కూడా శ్రీనివాసులు తెలిపారు. ఆ విధంగానే తమ కుటుంబం ముక్కులు చెల్లించడానికి తుపాను వల్ల వర్షాలు కురుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లి, అడవిలో చిక్కకుపోయారని తెలిసింది.
మొక్కు చెల్లించాలని వెళ్లి..
కార్తీకసోమవారం కావడంతో శ్రీకాళహస్తి పట్టణం 23 వార్డు కొండమిట్ట ప్రాంతానికి చెందిన చిలుకా గోపి కుటుంబం బత్తినయ్య కోనకు వెళ్లింది. పెద్దకూతురు బిడ్డకు పుట్టువెంట్రుకలు తీయించే మొక్కు చెల్లించడానికి 15 మంది కుటుంబ సభ్యులు కోనకు వెళ్లారు. చిన్న కూతురు దివ్యతో కలిసి గోపి సోమవారం రాత్రి శ్రీకాళహస్తికి తిరిగి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికి కూడా పెద్దకూతురు, అల్లుడు, పుట్టువెంట్రుకలు తీయించిన మూడేళ్ల పాప తోపాటు మిగతా వారు ఇంటికి చేరలేదు. సోమవారం ఉదయం వెళ్లిన వారంతా రాత్రికి ఆ ఆలయం సమీపంలోనే నిద్ర చేసి, మంగళవారం ఉదయం బయలుదేరి రావాలని భావించారు. సోమవారం రాత్రి ఆలయం వద్ద యాత్రికుల బృందం నిద్ర చేశారని, తుపాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు వరదనీటితో పొంగుపొర్లుతున్న పరిస్థితుల్లో ఎటు వెళ్లాలనే దిక్కు తెలియని స్థితిలో 15 మంది యాత్రికుల బృందం అడవిలోని గుట్టపైనే చిక్కుకుపోయినట్లు సమాచారం అందింది. దీంతో సెల్ ఫోన్ కూడా పనిచేయని స్థితిలో చిలుకా గోపి సీపీఐ నేత జనమాల గురవయ్యకు ఈ విషయం తెలపడంతో యాత్రికులు అడవిలో చిక్కుకుపోయిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఎలా వెళ్లాలి..
"ఏర్పేడు మండలం ముసలిపేడు బత్తినయ్య కోన( భక్తవెంకటేశ్వర స్వామి ఆలయం) కు సోమవారం వెళ్లిన భక్తులు మంగళవారం తిరిగి రావడానికి వరద ప్రవాహం ఆటంకంగా మారింది. దీంతో వాళ్లు అక్కడే చిక్కుకుని పోయారు" అని సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. అడవిలో ఉన్న బత్తినయ్యకోన నుంచి మరోమార్గంలో రావడానికి దారులు తెలియని స్థితిలో యాత్రికులు చిక్కుకుపోయారని గురవయ్య తెలిపారు.
ఏర్పేడు మండలంలో దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న బత్తినయ్యకోనకు వెళ్లడానికి బత్తినయ్య గిరిజనకాలనీ వరకు దారి ఉంది. ఆ తరువాత అడవుల్లో కాలిబాటలే శరణ్యం. గిరిజనులకు మినహా ఈ అటవీప్రాంతంపై మిగతా వారికి అవగాహన లేదు. అడవిలో చిక్కుకుపోయిన 15 మంది యాత్రికుల బృందానిది కూడా అదే పరిస్థితి కావడం గమనించాలి. దట్టమైన అడవులు కావడం వల్ల సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని స్థితిలో వారి ఆచూకీ కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
అటవీప్రాంతంలోని బత్తినయ్యకోనకు వెళ్లిన యాత్రికులు మంగళవారం మధ్యాహ్నానికి తిరిగి రావాలి. ఈ పరిస్థితి కనిపించకపోవడంతో అడవిలో చిక్కుకుపోయారని వారి కుటుంబీకులుల ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాళహస్తి కొండమిట్ట ప్రాంతానికి చెందిన చిలుకా గోపి వేదనను సీపీఐ నేత జనమాల గురవయ్య అధికారులకు తెలియజేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఏర్పేడు మండల అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, ఇతర శాఖల అధికారులను వెంట తీసుకున్న తహసీల్దార్ భార్గవి అడవిలో గాలింపు చర్యలు సాగించడం ద్వారా ముసలిపేడు గిరిజన కాలనీకి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో వాగు వద్ద 15 మంది యాత్రికులను గుర్తించారు. వారిని సురక్షితంగా వాగుదాటించే యత్నాలు సాగిస్తున్నారని సమాచారం అందింది.
Next Story

