
కుప్పంలో సీఎం నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి (ఫైల్)
మహిళలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో 'కుప్పంపై ఫోకస్'
నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి నాలుగు రోజుల పర్యటన.
కుప్పంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఫోకస్ పెట్టారు. మహిళలను మరింత శక్తిమంతులుగా చేయాలనే లక్ష్యంగా ఎంచుకున్న ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగా మరోసారి ఆమె నాలుగు రోజుల పర్యటన కోసం బుధవారం కుప్పం పర్యటనకు రానున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆమె కుప్పంలో పర్యటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు కుప్పంలో విస్తృతంగా పర్యటించడానికి ఏర్పాట్లు జరిగాయి. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకునే రోడ్డు మార్గాన బుధవారం మధ్యాహ్నం కుప్పం రానున్నారు. కుప్పం పర్యటనకు వస్తున్న నారా భువనేశ్వరి శాంతిపురం మండలం కడపల్లి వద్ద నిర్మించుకున్న సొంత ఇంటిలోనే బస చేస్తారు. పగలు నాలుగు మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో మహిళలతో సమావేశం కానున్నారు.
నారా భువనేశ్వరి పర్యటన....
కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మండలాల పర్యటనకు సంబంధించి కార్యక్రమాలను ఖరారు చేశారు. బుధవారం కుప్పం చేరుకునే నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అలిఫ్ ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందిన మహిళ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుతారు. సాయంత్రం ఆరు గంటలకు గుడుపల్లె మండలం మల్లప్ప కొండ వద్ద ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీకదీపోత్సవంలో పాల్గొంటారు.
వినతుల స్వీకరించి...
శాంతిపురం మండలం కడపలే వద్ద నిర్మించుకున్న ఇంటిలోనే బుధవారం రాత్రి నారా భువనేశ్వరి బస చేస్తారు. గురువారం కూడా తన పర్యటనను సాగించనున్నారు. తన నివాసం వద్ద ఉదయం 9 గంటలకు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటారు. కుప్పంకు సమీపంలోని దళవాయికొత్తపల్లె చురువు వద్ద గురువారం ఉదయం వినతిపత్రాలు స్వీకరిస్తారు. 10.30 కృష్ణా జలాలకు హారతి సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1.30 గంటల వరకు పరమసముద్రం వద్ద ఉన్న కస్తూర్బా స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో కలిసి ఆమె మధ్యాహ్నం భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్ప మున్సిపాలిటీలోనే పూల మార్కెట్ సమీపంలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 3.45 గంటలకు సామగుట్ట పల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో విలువలబడి అనే కార్యక్రమంలో పాల్గొంటారు.
కడపల్లి వద్ద ఉన్న తన ఇంటి ఆవరణలో మహిళ నాయకురాలతో నారా భువనేశ్వరి సమావేశం అవుతారు. సాయంత్రం ఐదు గంటలకు ఇటీవల డీఎస్సీలో ఎంపికై కొత్తగా టీచర్లుగా ఉద్యోగాలు సాధించిన వారితో ఆమె ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించే విధంగా కార్యక్రమాలను ఖరారు చేశారు
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా భువనేశ్వరి మూడు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటించడం ద్వారా సామాజిక కార్యక్రమాలలో మహిళలతో మమేకం అవుతున్నారు. ఇక్కడ సమస్యలను కూడా గుర్తించి ప్రజాప్రతినిధుల ద్వారా దృష్టికి తీసుకుని వెళ్లడం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి మహిళతో సమావేశం కావడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
నిరాడంబర ఏర్పాట్లు
గ్రామాల్లో కూడా ఆర్భాటం లేకుండా చిన్నపాటి షామియానా టెంట్, కుర్చీలు ఏర్పాటు చేయించడం, మహిళలను పెద్ద సంఖ్యలో సమీకరించి వారితో మాటామంతి సాగిస్తున్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా కుట్టుమిషన్ల పంపిణీ, చేతివృత్తులకు భూతం ఇవ్వడానికి అవసరమైన సహకారం అందించడంలో నారా భువనేశ్వరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే. నాలుగు మండలాల్లో మహిళలతో ఆమె ముఖాముఖి మాట్లాడి, వారి కష్టాలు తెలుసుకుంటారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహిళలకు ఆసరా ఇవ్వడం తోపాటు గుర్తించిన సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి కూడా ఆమె ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెన్నంటి ఉంటూ, కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో సమస్యల పరిష్కారంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నారా భువనేశ్వరి పర్యటన, కార్యక్రమాల అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
Next Story

