కీలపట్ల కోనేటి రాయుడు... తిరుమల శ్రీవారి విశిష్టత ఏమిటంటే..
x
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని కోనేటిరాయుని ఆలయం. శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిగ్రహం

కీలపట్ల 'కోనేటి రాయుడు'... తిరుమల శ్రీవారి విశిష్టత ఏమిటంటే..

కీలపట్లలోని శ్రీకోనేటి రాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.


చారిత్రక వైష్ణవ ఆలయాలకు తిరుమల తోపాటు చిత్తూరు జిల్లా ప్రసిద్ధి. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి తర్వాత పలమనేరు సమీపంలోని కీలపట్ల కోనేటిరాయని వారి ఆలయం కూడా అత్యంత చారిత్రక నేపథ్యం ఉంది. టీటీడీ ఆధ్వర్యంలోనే ఏటా తిరుమల తరహాలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.


చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం గంగవరం మండలం కీల‌ప‌ట్లలోని శ్రీకోనేటిరాయ‌స్వామివారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘ‌నంగా నిర్వహించారు. ఈ ఏడాది మే నెల ఐదో తేదీ నుంచి కీలపట్ల గ్రామంలోని కోనేటిరాయుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మంగళవారం శాస్త్రంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు.


ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ ఎం. గ‌జేంద్ర‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చరిత్ర
లపట్ల శ్రీ కోనేటిరాయస్వామి దేవాలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ ఆలయంలో కోనేటి రాయుడు (శ్రీ వెంకటేశ్వర స్వామి) విగ్రహాన్ని భృగు మహర్షి ప్రతిష్టించి, పూజలు అందించారనీ చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత చోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్య పతుల ఏలుబడిలో విశేష పూజలు అందించారనేది కూడా ఓ కథనం. కాగా మహమ్మదీయుల దండయాత్రలకు భయపడి గ్రామస్తులు స్వామివారిని కోనేటిలో దాచి ఉంచారట. ఆ తర్వాత కాలంలో చంద్రగిరి సంస్థాన సామంతులు బోడికొండమ నాయుడు కు కలలో స్వామివారు కనిపించి, కోనేటి లో ఉన్న స్వామివారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించమని చెప్పినట్లు కూడా చారిత్రిక నేపథ్యం ఉంది. దీంతో కీలపట్లలోని ఆలయానికి ఆ విధంగా కోనేటి రాయస్వామిగా గుర్తింపు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య తన కీర్తనలలో శ్రీకోనేటిరాయుడి ఆలయం కీలపట్ల గ్రామంలో ఉన్నది అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఒకే పోలిక..

గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని కోనేటిరాయ స్వామి విగ్రహం తిరుమల శ్రీవారి మూలమూర్తిని పోలి ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లోని స్వామి వారి విగ్రహాలు ఒకే తరహాలో ఉండడమే ఇక్కడ ప్రత్యేకత.
కోనేటి రాయిని విగ్రహంపై కూడా కటి వరద హస్తాలు, శంకు చక్రాల తో పాటు విగ్రహం చాతిపై శ్రీదేవి భూదేవి ముద్రలతో విగ్రహాన్ని తిరుమల తరహాలోనే దర్శనమిస్తుంటారు.
తాళ్లపాక అన్న మయ్య అనేక కీర్తనలలో కోనేటి రాయని పేరును ప్రస్తావించారు. గతంలో ఈ ఆలయాన్ని పుంగనూరు జమీందారులు అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి సమీపము లేని ఉన్న మేలుమాయి గ్రామంలో కూడా పుంగనూరు జమిందార్ చలామణి చేసిన రాగి నాణేలు కూడా గతంలో దొరికాయి.
కోనేటి రాయని బ్రహ్మోత్సవాలకు చిత్తూరు జిల్లా వాసులో కాకుండా, పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలోనే వస్తూ ఉంటారు.
బ్రహ్మోత్సవాల వైభవం
శ్రీకోనేటిరాయ స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 4న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి. రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవలు
మే 5 : ఉదయం - ధ్వజారోహణం జరుగుతుంది. క‌ర్కాట‌క‌ లగ్నంలో మ‌ధ్యాహ్నం 12.05 నుంచి 12.20 గంట‌ల వ‌ర‌కు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
సాయంత్రం - పెద్ద శేష వాహనం
మే6 : ఉదయం - చిన్న శేష‌వాహ‌నం
సాయంత్రం - హంస వాహనం
మే6 : ఉదయం - సింహ వాహనం
సాయంత్రం - ముత్యపుపందిరి వాహనం
మే 8 : ఉదయం - కల్పవృక్ష వాహనం
సాయంత్రం - సర్వభూపాల వాహనం
మే 9 : ఉదయం - మోహినీ ఉత్సవం
సాయంత్రం - శ్రీవారి కల్యాణోత్సవం, గరుడ వాహనం
మే 10: ఉదయం - హనుమంత వాహనం
సాయంత్రం - వసంతోత్సవం, గజ వాహనం
మే 11: ఉదయం - సూర్యప్రభ వాహనం
సాయంత్రం - చంద్రప్రభ వాహనం
మే 12: ఉదయం - రథోత్సవం
సాయంత్రం - అశ్వవాహనం
మే 13: ఉదయం - చక్రస్నానం
సాయంత్రం - ధ్వజావరోహణం
9న కల్యాణోత్సవం
కీలపట్ల కోనేటిరాయుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. టీటీటీ వేదపండితులు, అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనడానికి దంపతులు రూ .500 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం తరువాత ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు తరువాత 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
Read More
Next Story