మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మళ్లీ షాక్  పుంగనూరులో ఏమి జరుగుతోంది?
x

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మళ్లీ షాక్ పుంగనూరులో ఏమి జరుగుతోంది?

పార్టీ శ్రేణుులు ఆత్మరక్షణలో పడ్డాయి. మమ్మలిని కాపాడే వరెవ్వరు? మా దారి మేము చూసుకుంటాం. అని వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ధోరణి అంటున్నాయి. నేతలు గడప దాటలేని స్థితిలో పుంగనూరులో ఏమి జరుగుతోంది?


రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడి నెల రోజులైంది. రోజుల వ్యవధిలోనే వైఎస్ఆర్ సీపీకి గుక్క తిప్పులేని పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో పెద్దన్నగా రాజకీయచక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజుల వ్యవధిలోనే ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. తాజాగా సొంత నియోజకవర్గంలోనే ఆయన ప్రధాన అనుచరులు పదవులు, పార్టీకీ రాజీనామా చేయడం ద్వారా ఊహించని షాక్ ఇచ్చారు. ఇంకొందరు కూడా అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.

ఎన్నికలకు నెల కిందటి వరకు అండగా ఉన్నామంటూ, సేవలు వాడుకున్న ప్రధాన నేతలు అధికారం కోల్పోయాక బయటకు రాలేని స్థితిలో ఉన్నారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు స్వీయరక్షణ కోసం తాపత్రయ పడుతున్నారు. గత్యంతరం లేని స్థితిలో పార్టీకి రాజీనామాల పర్వం పుంగనూరు నుంచే ప్రారంభమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో కూడా వ్యూహం ఉండవచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు.



పట్టంచుకునే నాథుడు లేరు...
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్, వైస్ ఎంపీపీలు రాశిప్రసాద్, ఈశ్వరితో పాటు పది మంది సర్పంచ్ లు, నలుగురు ఎంపీటీసీ సభ్యులు కూడా తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేయడానికి చిత్తూరు వెళ్లారు. జెడ్పీ సీఈఓ లేకపోవడంతో, జేసీ శ్రీనివాసులుకు రాజీనామా పత్రాలు సమర్పించినట్లు జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలావుండగా, కొన్ని రోజుల కిందట పుంగనూరు మున్సిపల్ చైర్మన్, 12 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరం జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ మాట్లాడారు. " కష్టాల్లో ఉన్నప్పడు పట్టించుకునే వారు లేకుండా పోయారు. పార్టీలో ఆదుకునే నాథుడే లేరు. పార్టీలో మాకు న్యాయం జరగలేదు. ఇక్కడ ఉన్నా, ప్రయోజనం ఏమిటి?" అన్నారు. "బాధలు భరించడానికి సిద్ధంగా లేము" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లాలో కింగ్ మేకర్
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కింగ్ మేకర్గా ఉంటున్నారు. పీలేరు నుంచి 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఏడు సార్లు విజయం సాధించారు. 2009 నుంచి వరుసగా పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1989లో పీలేరులో ఒకసారి చల్లా రామచంద్రారెడ్డి చేతిలో పెద్దిరెడ్డి ఓటమి చవిచూశారు.
2024 ఎన్నికల్లో పీలేరు మాజీ ఎమ్మెల్యే చల్ల రామచంద్రారెడ్డి కుమారుడు చల్లా బాబు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కూటమికి సవాల్ గా మారింది. ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,619 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పుంగనూరుపై చల్లా ఫోకస్
తాజా సార్వత్రిక ఎన్నికల వరకు వైఎస్ఆర్ సీపీ కుప్పంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి రావడంతో ఓటమి చెందిన టీడీపీ ఇన్ చార్జి చల్లా బాబు పుంగనూరుపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది. ఈ పాటికే పుంగనూరు మున్సిపల్ చైర్మన్ సహా, 17 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ చేయించడం ద్వారా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టారు. అంతేకాకుండా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు కూడా పదవులు, వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేయడానికి దారి తీసినట్లు కనిపిస్తోంది.


కదలలేని స్థితి..
ప్రస్తుతం రాజకీయ వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని ప్యాలెస్ కు మాత్రమే పరిమితం అయ్యారు. సొంత నియోజకవర్గం పుంగనూరు, గ్రామం సదుంకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. గత ఏడాది అంగళ్లు వద్ద టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడి, పుంగనూరుకు రాకుండా అడ్డుకున్న పరిస్థితుల నేపథ్యంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి దాదాపు 480 మంది పైవరకు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఏడాది జూన్ 15వ తేదీ భారీగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ శ్రేణులు "మాజీ మంత్రి పెద్దిరెడ్డి గో బ్యాక్" అంటూ నిరసనలకు దిగారు. దీంతో పోలీసుల సూచననలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత కూడా కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి వెళ్లాలని చేసిన ప్రయత్నాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వడం ద్వారా గృహ నిర్బంధం చేశారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో తమను ఆదుకునేది ఎవరు? అంటూ వైఎస్ఆర్ సీపీ స్ధానిక సంస్థల పదవులు, పార్టీకీ కూడా రాజీనామాలు చేసే దిశగా సాగుతున్నట్లు వాతావరణం చెప్పకనే చెబుతోంది. ఇదిలావుండగా,


అన్నా..తమ్మడిదీ అదే స్థితీ
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోపాటు ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన రెండోసారి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకానాథరెడ్డి 10,103 మెజారిటీతో కష్టంగా గెలిచారు. 2019లో ఆయన
46,938 భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన కూడా నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం అనుకూలించని స్థితిలో పర్యటనకు వెళ్లలేదు.
పరామర్శ కోసం నిరీక్షణ
తాజాగా రెండు రోజుల కిందట ములకలచెరువు మండలంలో ప్రధాన మద్దతుదారుడైన ఎంపీటీసీ సభ్యుడు పిన్నిపాటి రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ములకలచెరువు మండలానికి సన్నద్ధం అయ్యాడని తెలిసింది. ఆయన అన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని రోజుల ఆయా ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసు అధికారులే సూచన చేసినట్లు తెలిసింది. అంటే, వారు అధికారంలో ఉండగా, ఎస్కార్ట్, కాన్వాయ్ తో అనుసరించిన పోలీస్ యంత్రాంగం నిస్సహాయంగా మారడం అంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటనేది కూడా చర్చకు ఆస్కారం కల్పించింది. ఈ పరిణామాల వల్ల పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఎలాంటి భరోసా కల్పిస్తారనేది వేచిచూల్సిందే.
Read More
Next Story