SriSailam | 600 కి.మీ నడిచి శ్రీశైలానికి చేరుకుంటున్న శివభక్తులు
x

SriSailam | 600 కి.మీ నడిచి శ్రీశైలానికి చేరుకుంటున్న శివభక్తులు

ఉగాది ఉత్సవాలకు కర్నాటక, మహారాష్ట్ర నుంచి కొొండలు, గుట్టలు, అడవులు దాటి వస్తున్న శివభక్తులు


దట్టమైన నల్లమల అడవులు జనసంద్రం అయ్యాయి. మండుతున్న ఎండలు, రాళ్లురప్పలతో నిండిన దారులన్నీ శ్రీశైలం వైపే సాగుతున్నాయి. భ్రమరాంబికాదేవిని కన్నడ భక్తులు తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. చీర, సారెతో చీమలబారుల్లా మారిన జనం నడక సాగిస్తున్నారు.

శ్రీశైలంలో గురువారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో నడచి వెళ్లే యాత్రికులతో సందడిగా మారింది.
"అటవీ మార్గంలోనే కాకుండా, శ్రీశైలంలో విస్తృత ఏర్పాట్లు చేశాం" అని కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసులు చెప్పారు.
ఉగాది నాటికి శ్రీశైలానికి కనీసం అంటే ఆరు లక్షల మంది యాత్రికులు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని శ్రీశైలంలో సీనియర్ జర్నలిస్టు కేశవులు అభిప్రాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా నుంచి శ్రీశైలం 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెల్గాం జిల్లా హరుగేవి 630 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి నడకతోనే వెళ్లడానికి ఈ ప్రాంత యాత్రికులు ఆసక్తి చూపిస్తారు.
హరిగేవి ప్రాంతానికి చెందిన సునీల్ ఈశ్వర మోలే (35) శ్రీశైలం నుంచి భ్రమరాంబ అమ్మవారికి కావడితో సారె మోసుకుని వెళుతూ కనిపించారు.

సునీల్ ఈశ్వర మోలే, బెల్గాం జిల్లా

"నేను గత తొమ్మిదేళ్లుగా ఉగాది నాటికి చేరుకునే విధంగా మా ఊరికి నుంచి ప్రతి సంవత్సరం వెళుతున్నా. ఈసారి మా ఊరి నుంచి 70 మంది భక్తుల బృందంతో కలిసి హరిగేవి పట్టణం నుంచి ఈ నెల13వ తేదీ బయలుదేరాం. రోజుకు 50 కిలోమీటర్ల నడక సాగిస్తూ, శ్రీశైలం చేరుకున్నా. మార్గమధ్యలోని గ్రామాల్లో సేదదీరడం. గ్రామస్తులు మా బృందానికి ఇచ్చిన అతిథ్యం తీసుకున్నాం" అలా 13 రోజుల పాటు అలుపుసొలుపు లేని ప్రయాణం సాగించాం అని సునీల్ ఈశ్వర మోలే 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. మా గ్రామం నుంచి 31 సంవత్సరాలుగా యాత్రికులు కాలినడకనే వస్తున్నారు. ఇది జీవితంలో మరువలేని ఆధ్యాత్మిక పర్యటన అని ఆయన అభివర్ణించారు.

" శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు కన్నడిగుల ఆడబిడ్డ అని భావిస్తాం. అందుకే ఈ ఏడాది కూడా మా ఇంటి నుంచి భ్రమరికి కావడికి సారె కట్టుకుని వచ్చాను. దట్టమైన అడవుల్లో సాగే ప్రయాణం మరింత అనుభూతి కలిగించింది. భ్రమరాంబ సమేత మల్లయ్యను దర్శించుకుని, మొక్కు చెల్లించాం. ఇక్కడి నుంచి మా ఊరికి వాహనంలో తిరిగి వెళతాం" అని సునీల్ ఈశ్వర మోలా తన అనుభవాలను పంచుకున్నారు.
అలంకార దర్శనమే...
శ్రీశైలంలో గురువారం (ఈ నెల 27వ తేదీ) యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్య ఉగాది ఉత్సవాలు 31వ తేదీతో ముగుస్తాయి. "యాత్రికుల రద్దీ నేపథ్యంలో స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే ఉంటుంది" అని ఈఓ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మూడు క్యూల ద్వారా ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్ర దర్శనం ఉంటుంది అని ఆయన తెలిపారు. గురువారం నుంచి స్పరదర్శనం ఉండదని ఆయన తెలిపారు.
నల్లమల దారుల్లో...
నల్లమల అటవీప్రాంతంలో వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడా చెంచులు నివాసం ఉన్న గూడేలు మినహా, ఏమీ ఉండదు. అంతా దట్టమైన అటవీప్రాంతమే. పొద్దుగుంకితే కాదు. పట్టపగలే, చిరుతల సంచారం అధికంగా ఉంటుంది. కానీ, ఉగాది సమీపిస్తుందంటే, కన్నడ భక్తుల పాదయాత్రతో నల్లమల జనసంద్రంగా మారుతుంది.
నెత్తిన బరువు, కాళ్లకు చెప్పులు లేవు. భుజానికి బ్యాగులు ధరించిన వేలాది మంది యాత్రికులు శివనామ స్మరణతో సాగుతున్నారు. కాలిబాటల్లో డప్పుల దరువులు, మరో పక్క హోరెత్తుతున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పిల్లా పాపలతో అడవిబాట పట్టారు.

ఉగాది నాటికి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి దర్శించుకోవాలనే లక్ష్యం ముందు కన్నడ యాత్రికులు అలుపు, విరామం లేకుండా సాగుతున్న పాదయాత్రతో నల్లమల జనారణ్యంగా మారింది. ఏటా ఈ యాత్ర సాగించడం కర్ణాటక భక్తులకు అలవాటు. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకనే శ్రీశైలం శైవక్షేత్రానికి వారంతా కాలినడకన చేరుకుంటారు.
కర్ణాటక ప్రాంతం నుంచి నెల కిందటి నుంచే ఈ యాత్ర ప్రారంభమైంది. మొక్కుబడులు ఉన్న యాత్రికులు విభిన్న పద్ధతుల్లో పాదయాత్ర సాగిస్తుండడం కర్నూలు, ఆత్మకూరు మార్గాలన్నీ నడక భక్తులతో సందడిగా మారింది. నల్లమల అడవిలో నడక అంటే సాహసం కిందే లెక్క.

నల్లమల అటవీప్రాంతంలోని తుమ్మలబయలు సఫారీ నుంచి యాత్రికుల నడక ప్రారంభం అవుతుంది. ఏపీతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక భక్తలకు తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చే వారు జత అవుతారు.

ఉగాది నాటికి శ్రీశైలానికి దాదాపు 50 వేల మందికి పైగానే యాత్రికులు ఈ సాహస యాత్ర ద్వారా వస్తుంటారు అని ఆత్మకూరు ప్రాంతానికి చెందిన జర్నలిస్టు ఒకరు చెప్పారు. శ్రీశైలంలో కనీసం లక్ష మందికి వసతి కల్పించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తారని మరో సీనియర్ జర్నలిస్టు కేశవులు చెప్పారు.

ఇందులో ప్రత్యేకంగా కొందరు రెండు కాళ్లకు కర్రలు కట్టుకుని సాససోపేత నడక సాగిస్తుండడం ప్రధానంగా కనిపిస్తుంది. కర్ణాటక ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు చాలా మంది కర్రలే కాళ్లుగా చేసుకుని చెమటలు కారుతున్న లెక్కచేయకుండా నడవడం ద్వారా భక్తి చాటుకుంటున్నారు.
వసతులు లేని దారుల్లో...
అది భయానక అడవి. ఒకప్పుడు నక్సలైట్లకు రాజధాని లాంటి ప్రదేశం. ఇప్పుడు అంతలేదనుకోండి. ఆ వాసనల రుచి తెలిసిన గూడెం ప్రజలు యాత్రికులకు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. విషయంలోకి వస్తే, కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి దోర్నాలకు సమీపంలోని వెంకటాపురం గ్రామం నుంచి అడవిబాట పట్టే యాత్రికులు దాదాపు 40 కిలోమీటర్ల దూరం శ్రీశైలం వరకు సాగుతుంది. అటవీ మార్గమధ్యలోని పెద్దచెరువు, నాగలూరు, భీముని కొలను మీదుగా కైలాసపర్వతం మీదుగా భ్రమరాంబ సమేత మల్లికార్జునుని సన్నిధికి చేరుస్తుంది. మార్గమధ్యలో చెంచుగూడేలు మినహా నడకదారిలోని యాత్రికులకు కనిపించేది వన్యప్రాణాలు, చెట్ల నుంచి వీచే గాలి మాత్రమే పలకరిస్తుంది.

నల్లమల అటవీ ప్రాంతంలో నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు (ఎస్ఎస్టీఆర్ ) నాగులూరు వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం యాత్రికులకు కనువిందు చేస్తుంది. ఇదేమార్గంలో ముందుకు 9 కిలోమీటర్ల నడక తరువాత వీరభద్రస్వామి ఆలయం వద్ద కాసేపు సేదదీరడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత కొండఎక్కి దిగే సాహసయాత్ర సాగించాలి. ఈ ప్రదేశం కాస్త కాదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నా, యాత్రికుల సంకల్పం ముందు అదేం పెద్ద లెక్క కాదన్నట్లు సాగుతూ కనిపిస్తారు. ఈ ప్రదేశం చేరడానికి కనీసంగా అంటే ఐదు గంటల పాటు నడిచిన తరువాత మరో చెంచు గూడెం పెద్దచెరువు వద్దకు చేరకుని, అలసట తీర్చుకునేందుకు చాలా మంది ఇక్కడ సేదదీరుతూ కనిపించారు.
రాత్రి పెద్దచెరువు వద్ద విశ్రమించి, పొద్దునే మళ్లీ తెల్లవారుజాము నుంచే నడక ప్రారంభిస్తారు.
రెండ దశలో దాదాపు ఏడు కిలోమీటర్ల ప్రయాణంలో రెండు కొండలు ఎక్కి, దిగిన తరువాత కొండకోనల దాటుకుని, మఠం బావి వద్దకు చేరుకుంటారు. అప్పటికీ గమ్యం చేరుకోవడానికి ఇంకొన్ని గంటలపాటు నడకసాగించాల్సి ఉండడం వల్ల బావి వద్ద కాస్త సేదదీరేందుకు విరామం ప్రకటిస్తారు.
అదిగో శ్రీశైలం...

పాతాళగంగ వద్ద కొండ వద్ద పుణ్యస్నానాలు ఆరిస్తున్న యాత్రికులు

మఠం బావి నుంచి యాత్రికులు బయలు దేరతారు. దట్టమైన అడవిలో కొండలు, ప్రకృతి రమణీయత మధ్య గిరిజనులు జీవనం సాగించే భీమునిచెరువు వద్దకు చేరుకుని, వారితో కాసేపు పులకరింతలు ఉంటాయి. ఆ తరువాత కొన్ని కిలోమీటర్ల ప్రయాణం తరువాత కైలాసద్వారంగా పిలిచే ప్రదేశానికి చేరుకోవడంతో కొండ,కోనల మార్గం నుంచి డోర్నాల, శ్రీశైలం ప్రధాన రహదారికి చేరుకుంటారు. ఆ తరువాత సులువుగా ఎదురుగా, వెనుక వచ్చే వాహనాల నుంచి తప్పించుకుంటూ, శివహోం అంటే శివశివా అనే ప్రతి సమాధానం ఇస్తూ, శ్రీశైలం వద్దకు చేరుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంతటి సాహసోపేత యాత్రతో శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున సన్నిధికి చేరుకునే యాత్రికులకు..
ఆడపడుచు భ్రమరి కోసం సాహసయాత్ర

సాహసోపేతంగా కన్నడ భక్తులు సాగించే నడక వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
కర్ణాటక ప్రాంత యాత్రికులు భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. మండే ఎం డలను ఏమాత్రం లెక్క చేయకుండా, మల్లన్న సన్నిధికి చేరుకోవడానిక సాహసయాత్రం సాగించడం పెద్ద కష్టంగా భావించడం లేదు.
భ్రమరిని ఆడబిడ్డగా భావించే కన్నడిగులు పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక, వడిబియ్యం సమర్పించడానికి అమ్మవారికి ముడుపు కట్టుకుని కావడి, లేదా చిన్నపాటి పల్లకీలో ఉంచుకుని నెత్తిబరువు మీదే శ్రీశైలం చేరుకకుంటారు. దీంతో పాటు అమ్మవారి నుదిటిన ఉంచడానికి మిరియాల చూర్ణం కూడా ప్రత్యేకంగా తీసుకుని రావడంలో ఏమాత్రం అశ్రద్ద చేయరు. ఉగాది రోజు అమ్మవారికి సారె సమర్పించే యాత్రికులు తమ దీక్షను ముగించడమే కాదు. తన పుట్టింటి ఆడబిడ్డకు ఏలోటు లేకుండా, చేశామని సంతృప్తి పడతారు. అందరినీ చల్లగా చూడు తల్లి, నీ ఆశీర్వచనాలు అందరికీ అందాలి అని వేడుకుని, తిరుగు ప్రయాణం అవుతారు.
విస్తృత ఏర్పాట్లు

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జుని సన్నిధికి వచ్చే యాత్రికుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
"లక్షలాది వచ్చే యాత్రికులకు ఆరుబయట వసతి, షామియానాలు, మంచినీటి సదుపాయం" కల్పించడానికి అధికారులకు బాధ్యతలు వికేంద్రీకరించారు.
"కాలిబాట యాత్రికుల కోసం వెంకటాపురం, నాగ లూటి, దామెర్ల కుంట పెద్ద చెరువు, మఠం బావితో పాటు అటవీ మార్గంలో ఏర్పాట్లు చేశాం" అని ఈఓ ఎం. శ్రీనివాసులు చెప్పారు.
"అటవీ శాఖాధికారులను సమన్వయం చేసుకోవడం ద్వారా యాత్రికులకు నీరు, అత్యవసర మందులు, అల్పాహారం సదుపాయాలు కల్పించడానికి సిబ్బందిని నియమించాం" అని కూడా చెప్పారు.
శ్రీశైలంలో కూడా గతంలో ఎన్నడూ లేని విదంగా ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.
నంద్యాల జిల్లా వైద్య శాఖ సహకారంతో యాత్రికులకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి కైలాస ద్వారం, హఠకేశ్వరం, ఆలయ మహద్వారం తోపాటు శ్రీశైలంలోని అనేక ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
లక్షలాది మందికి బస
శ్రీశైలం ఆలయంతో పాటు చుట్టపక్కల ఖాళీ ప్రదేశాల్లో సామాన్య యాత్రికుల కోసం ఆరుబయటే విశాలమైన ఏర్పాట్లు చేశారు. ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేయించడం ద్వారా షామియానాలు ఏర్పాటు చేశారు. నేలపై పరదాలు కూడా పరిపించారు. సమీపంలోనే తాగునీరు, మరుగుొడ్ల సదుపాయాలు కూడా కల్పించారు. ఉగాది నాటికి శ్రీశైలం ప్రాంతం కేవలం యాత్రికుల సంఖ్య కనీసంగా అంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మందికి పైగానే శ్రీశైలంకు చేరుకుంటారని సీనియర్ జర్నలిస్టు కేశవులు తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనికి తగినట్లే దేవస్థానం ఏర్పాట్లు చేసిన, ఇబ్బందులు సర్వసాధారణంగా ఉంటాయని చెబుతున్నారు.
వాహనదారుల కోసం..

విశేష పర్వదినాలు ప్రధానంగా ఉగాది నాడు యాత్రికులతో పాటు సొంత వాహనాలు, ప్రైవేటు బస్సుల తోపాటు ఆర్టీసీ బస్సులు భారీగా శ్రీశైలం చేరుకుంటాయి. దీంతో డోర్నాల, శ్రీశైలం ఘాట్ రోడ్డులో అనేక సందర్భాల్లో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. గత ఏడాది శ్రీశైలంలో పార్కింగ్ కు స్థలం కొరత ఏర్పడిందనే కారణంగా డోర్నాల చెక్ పోస్టు వద్దే వాహనాలు నిలిపివేశారు. ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసులు చెబుతున్నారు.
"శ్రీశైలంలోని గణేష సదనం, హెలిపాడ్ ఏరియా, ఆర్టీసీ బస్టాండు వెనుక ప్రదేశం, మల్లమ్మ కన్నీరు ప్రదేశం, గురుసదన్ తోపాటు అనేక ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించాం" అని ఈఓ శ్రీనివాసులు వివరించారు.
కాలక్షేపం కోసం..
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల కోసం శ్రీశైలం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మొక్కుబడులు చెల్లించడానిక పాదయాత్రగా అత్యధికంగా వచ్చే కన్నడ యాత్రికుల కాలక్షేపానికి ప్రాధాన్యత ఇచ్చారు. కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
"శివదీక్ష శిబిరాలు, ఆలయ పుష్కరిణి, భ్రామరి కళావేదిక, యాంఫీ థియేటర్ సమీపంలో" కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుకు శ్రద్ధ తీసుకున్నట్లు ఈఓ శ్రీనివాసులు చెప్పారు.
పారిశుద్ధ్యంపై దృష్టి
వాహనాల్లో లక్షలాది మంది యాత్రికులు శ్రీశైలం చేరుకోనున్నారు. ఇప్పతికే వాహనాల్లో వచ్చిన వారితో పాటు నడకమార్గం యాత్రికులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది.
పారిశుద్ధ్యం సమస్య ఎదురుకాకుండా దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికోసం శ్రీశైలం క్షేత్రంలో ఆరు జోన్లుగా విభజించారు. అందులో 11 సెక్టార్లను ఎంపిక చేశారు. 67 ప్రదేశాల్లో పారిశుద్ధ్యం సమస్య ఎదురుకాకుండా, దేవస్థానం సిబ్బంది, అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు ఈఓ శ్రీనివాసులు వివరించారు.
" అంటురోగాలకు ఆస్కారం లేకుండా, వ్యర్థాలను తొలగించడానికి శ్రద్ధ తీసుకున్నాం. దీనికోసం దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రైవేటు సిబ్బందిని రంగంలోకి దించాం" అని ఈఓ శ్రీనివాసులు చెప్పారు. ఆయా ప్రదేశాల్లో చాలా చోట్ల తాత్కాలిక మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు.
Read More
Next Story