స్వపక్షమే.. తిరగబడుతోందే...!
x

స్వపక్షమే.. తిరగబడుతోందే...!

ఆయన వైఎస్ఆర్ సీపీలో నంబర్-2. రాయలసీమలో కింగ్ పిన్. చిత్తూరు జిల్లాలో కింగ్ మేకర్. ఆయనకూ వ్యతిరేక పవనాలు ఎందుకు వీస్తున్నాయి. గెలిచినా, ఆయన సొంత ఊరిలోకి వెళ్లలేక, ఎందుకు వెనుదిరిగారు?


రాయలసీమలో పార్టీలు వ్యక్తులకు ముసుగు మాత్రమే. కుటుంబాల మధ్యే రాజకీయాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఆ కోవలోనే చిత్తూరు జిల్లాలో సీఎం ఎన్. చంద్రబాబునాయుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢీ అంటే ఢీ అని అంటుంటారు.

2024 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద సవాల్ ఎదురైంది. గట్టిపోటీ వల్ల ఆయనతో పాటు సోదరుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా కుమారుడు ఎట్టకేలకు విజయం సాధించారు. అయినా, సొంత నియోజకవర్గం పుంగనూరుకు వెళ్లలేక పెద్దిరెడ్డి పర్యటన రద్దు చేసుకునే వరకు దారి తీసింది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ క్వారీ యజమానులు ఎదురుతిరిగారు. పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన వారంతా సీఐడీ విచారణకు డిమాండ్ చేయడం చర్చకు దారి తీసింది. ఇదిలావుంటే..


"నా పనితీరు బాగాలేదని టికెట్ నిరాకరించారు. దళితుల సెగ్మెంట్లలో మాత్రమే ఇలా చేస్తారా?" అని

2024 ఎన్నికల్లో టికెట్ దక్కని సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతటితో ఆగని ఆయన" అనిపెద్దిరెడ్డి వల్లే నాకు టికెట్ రాలేదని ఆదిమూలం నిప్పులు చెరిగారు. "నా సెగ్మెంట్లో ఇసుక, కంకర, మట్టితో పాటు సహజ వనరులన్నీకొల్లగొట్టారు" అంటూ, పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఎక్కుపెట్టిన ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించడం ద్వారా వైఎస్ఆర్ సీపీకి సవాల్గా మారారు.

వర్సిటీ నుంచి...

చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కింగ్ మేకర్గా ఉంటున్నారు. 46 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయనకు రాయలసీమలొ పరిస్థితులు ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. 1974లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే నీలం సంజీవరెడ్డి వర్గం తరఫున విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1978లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అదే ఏడాది నీలం సంజీవ రెడ్డి చొరవతో.. జనతా పార్టీ అభ్యర్థిగా పీలేరులో ఓడిపోయారు. 1989లో పీలేరులో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆ ఎన్నికల్లోనూ కీలకంగా..
పీలేరులో 1994లో ఓడిన పెద్దిరెడ్డి 1999, 2004ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రెండు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన 1995 నుంచి 9 ఏళ్ల పాటు ఆయన చిత్తూరు డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో పుంగనూరు నుంచి గెలిచిన పెద్దిరెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. రాజకీయ శత్రువుగా భావించే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక, 2012 చివర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ సీపీలో చేరారు.
కింగ్ మేకర్
చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి 2014 , 2019లో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పం మినహా మిగతా 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. తిరుపతి లోక్ సభ, కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన బాధ్యత తీసుకున్నారు. సీఎం వైఎస్. జగన్ క్యాబినెట్లో చివరి వరకు పెద్దిరెడ్డి కొనసాగారు. ప్రస్తుతం చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలు పర్యవేక్షించారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. 2014, 2019,2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా హ్యాట్రిక్ సాధించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


ఆధిపత్యానికి గండి
2024 ఎన్నికలు వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కూటమికి సవాల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,619 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 42,710 ఓట్లు, 2014లో 31,731 లభించడం గమనార్హం.
తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి 10,103 మెజారిటీతో కష్టంగా గెలిచారు. 2019లో ఆయన 46,938 భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్ధానం నుంచి మూడోసారి కష్టంగా 76,071 ఓట్ల మెజారీటీ విజయం సాధించారు. 2019లో 2,63,284 ఓట్లు సాధించడం గమనార్హం.
వీరు మినహా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 12 సీట్లు కోల్పోయారు. పీలేరు, మదనపల్లె, కుప్పం, పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, సత్యవేడు, పలమనేరు సెగ్మెంట్లలో తన విధేయులకే టికెట్లు ఇప్పింకున్నారు. వారిలో గంగాధరనెల్లూరు, సత్యవేడు, చిత్తూరు మినహా సిట్టింగ్ లను పోటీ చేయించినా, గట్టెక్కించలేకపోయారు. తిరుపతి, నగరి, చంద్రగిరి సెగ్మెంట్లలొ జోక్యం చేసుకోలేదు. వారంతా వైఎస్. జగన్ కోటరీ కావడమే కారణం అనేది రాజకీయ పరిశీలకుల మాట. అలాగే కడప జిల్లాలో (అన్నమయ్య జిల్లా) రైల్వే కోడూరు, రాయచోటి కూడా కోల్పోక తప్పలేదు.
ఇది నాయకుల తప్పిదం కాదని మదనపల్లెకు చెందిన సీనియర్ అన్నారు. "సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని భావించాం. కానీ, అధినేత నాయకులను, ఎమ్మెల్యేలను కలవకపోవడం ప్రధాన కారణం. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని పసిగట్టడంలో వైఫల్యం ఉంది" అని మదనపల్లెకు చెందిన ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
పుంగనూరులో తిరుగుబాటు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో బలమైన సామ్రాజ్యం నిర్మించుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి రెండు రోజుల క్రితం పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన ఖరారు చేసుకున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పెద్దిరెడ్డి వ్యతిరేకులు, టీడీపీ నేతలతో సహా భారీగా రోడ్లపైకి చేరారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ సమాచారం అందుకున్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడం మొదటిసారి కావడం గమనార్హం. ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం మరోమార్గంలో మదనపల్లెలో పర్యటించారు.
"ఇక్కడ పెద్దిరెడ్డి అరాచక రాజ్యాంగం అమలు చేశారు" అని
బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ పదేపదే ఆరోపించారు. తనపై జరిగిన దాడులు, పోలీస్ వేధింపులు, తనిఖీలతో ఇబ్బందికి గురి చేసిన వ్యవహారాలను ఆయన పలుసార్లు ఉదహరించారు. "శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్రగా కుప్పం వెళుతున్న వారిని కూడా వైఎస్ఆర్ సీపీ నేతలు చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారం పార్లమెంటు వరకు చేరింది" దీనికి ప్రతిగానే పుంగనూరులో టీడీపీ శ్రేణులు వ్యతిరేకగళం విప్పాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే..
పుంగనూరులో గెలిచిన పెద్దిరెడ్డి సొంత ఊరిలోకే వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన నిరసనాగ్రహానికి జడిసి, అటు వెళ్లలేక, తన ప్రోగ్రాం రద్దు చేసుకున్నారని బాహాటంగా చర్చించుకుంటున్నారు.
దీనిపై సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు పుత్తా యర్రంరెడ్డి స్పందించారు. "ఆయనకు గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఇది పాలపొంగు లాంటిదే" అన్నారు. "రాష్ట్రంలో ఎన్.టీ. రామారావు కాలం నుంచి కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం విభిన్న రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలం గడిచే కొద్ది, మార్పులు ఉంటాయి" అని యర్రంరెడ్డి విశ్లేషించారు.


"అనంత"లో తిరగబడిన క్వారీ యజమానులు
అనంతపురం జిల్లాలో క్వారీ యజమానులైన వైఎస్ఆర్ సీపీ నేతలే ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో అటవీ, గనుల శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. గనుల నుంచి రాయల్టీ వసూలు చేసే వ్యవహారంపై ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. రాయల్టీ వసూలు కాంట్రాక్టు తనకు సన్నిహితుడైన ప్రసాదరెడ్డి ఏర్పాటు చేసిన అమిగోస్ సంస్థకు అప్పగించారు.
"జిల్లాలో రూ. 1000 కోట్ల విలువైన ఖనిజ సంపద ఆ సంస్థ లూటీ చేసింది. మైనింగ్ లీజు వసూళ్లలో తమకు అన్యాయం చేశారు" అని వైఎస్ఆర్ సీపీ కాంట్రాక్టర్లు గొందిరెడ్డిపల్లెకు చెందిన చంద్రశేఖరరెడ్డి, కూడేరు రవి ఆరోపించారు. వారు ఇంకా ఏమన్నారంటే.. "జిల్లాలో మైనింగ్ మాఫియా పెద్దిరెడ్డే సాగించారు. క్వారీలకు అన్ని రకాల అనుమతులు ఉన్నా, అక్రమ కేసులు బనాయించి, మా నుంచి లాక్కున్నారు" అని కూడా తెలిపారు. జిల్లాలో 72 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, రూ. వేల కోట్లు లూటీ చేశారన్నారు. అమిగోస్ సంస్థలని జితేంద్ర, ప్రసాదరెడ్డి, మనోహర్, రాజశేఖరరెడ్డి మా రాయల్టీ పత్రాలు చించేసి, మాపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ అవినీతిపై సీఐడీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ తరహాలో ఇంటా,బయట స్వపక్షీయులు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. రానున్న కాలంలో ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story