సీమ టైగర్లు సైలెంట్... సింహపురిలో  సీన్ మరోలా ఉందే..
x

'సీమ' టైగర్లు సైలెంట్... సింహపురిలో సీన్ మరోలా ఉందే..

అధికారం కోల్పోయాక వైఎస్ఆర్ సీపీలో స్తబ్దత ఏర్పడింది. పార్టీ శ్రేణులు కూడా సందిగ్ధంలో ఉన్నాయి. సింహపురిలో మాత్రం వినిపిస్తున్న స్వరాల వెనుక ఆంతర్యం ఏమిటి?


రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత రాయలసీమలో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు స్తబ్దతగా మారాయి. సీమ పులుల ఉనికి లేదు. దీంతో ఆ పార్టీ క్యాడర్ కూడా ఆత్మరక్షణలో పడింది. మాజీ సీఎం వైఎస్. జగన్ సొంత జిల్లా కడపకు వచ్చినప్పుడు మాత్రం హడావిడి కనిపిస్తోంది. మినహా ప్రభుత్వ విధానాలపై స్పందించేందుకు కూడా సాహసించడం లేదు.



రాయలసీమ పులులకు భిన్నంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు స్పందిస్తున్నారు. పేరులోనే సింహం ఉన్న సింహపురి జిల్లా నేతలు పార్టీ క్యాడర్ కు స్థైర్యం నింపే పనిలో పడ్డారు. సింహపురిలో రెండు, మూడు కుటుంబాల ప్రతినిధులు రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పుతారు. అందులో ఆనం కుటుంబం తరువాత సర్వేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి పార్టీ కార్యాలయంలో కనిపిస్తున్నారు.

రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు, సింహపురి నుంచి వైఎస్ఆర్ సీపీలో మంత్రులుగా పనిచేసిన వారిలో కాకాణి గోవర్ధనరెడ్డి మినహా మిగతావారెవ్వరి స్వరం వినిపించని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే మాజీ మంత్రి కాకాణి సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. టీడీపీ సూపర్-6పైనే కాకుండా, తనపై సుదీర్ఘవిరామం తరువాత విజయం సాధించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఆ పరంపర సాగుతూనే ఉంది.
స్థానాలు పరిశీలిస్తే...
2019 ఎన్నికల్లో రాయలసీమలో మూడు స్థానాలు మినహా 48 సీట్లు వైఎస్ఆర్ సీపీ సాధించింది. కడప, నెల్లూరులో పదికి పది, కర్నూలులో 14కు 14 స్థానాలు వైఎస్ఆర్ సీపీ విజయం సాధించింది. అనంతపురంలో 14 సీట్లకు 12 చోట్ల విజయం సాధించింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో ఏడు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రులు ఆర్.కే. రోజా ఓటమి చెందగా, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. కడప జల్లా పులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్. జగన్ తోపాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా ఓడిపోకతప్పలేదు. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన వారెవ్వరిని ఓటర్లు మళ్లీ అసెంబ్లీలోకి వెళ్లడానికి అవకాశం కల్పించలేదు.
కనిపించరు.. వినిపించరు.


అధికారంలో ఉండగా, రాయలసీమ, నెల్లూరు ప్రాంత మాజీ మంత్రులు ఆర్.కే. రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ బూతులతో టీడీపీని చెడుగుడు ఆడారు.
తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత సీన్ మొత్తం మారిపోయింది. అధికారం కోల్పోయిన తరువాత వైఎస్ఆర్ సీపీ శ్రేణులు స్తబ్దతగా మారాయి. ఐదేళ్ల పాటు చక్రం తప్పిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచార సమయంలో చెప్పినట్లే అవినీతి, అక్రమాలపై విచారణలకు ఆదేశించింది. ఇదే పరిస్థితిలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ అంతర్లీనంగా పనిచేస్తోందని ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ ఆరోపిస్తోంది. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు ఆర్.కే. రోజా నగరికి దూరంగా ఉన్నారు. చెన్నైతో పాటు విదేశీ పర్యటనలకు ఆమె పరిమితమయ్యారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటే తిరుపతి లేదంటే హైదరాబాద్ అదీ కాదంటే తీర్థయాత్రలకు పరిమితమయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, కడప నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ డెప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఉనికి లేదు. అనంతపురం జిల్లాలో ఉషశ్రీ చరణ్ (కల్యాణదుర్గం, పెనుగొండ), కర్నూలులో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి (డోన్) వాయిస్ లేకుండా పోయింది. నెల్లూరు జిల్లాలో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ది కూడా అదే పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో గడచిని రెండు నెలల్లో మాజీ సీఎం, వైఎస్. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు వచ్చినప్పుడు కాస్త హడావిడి ఉంది. ఇటీవల ఆయన నెల్లూరు, కర్నూలు పర్యటనలు కూడా ఓదార్పు కోసం సాగాయి. ఆ యాత్రల తరువాత ఆయన బెంగళూరు , తాడేపల్లె మధ్య పర్యటనలకు పరిమితం అవుతున్నారు. యథావిధిగానే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ నేతలు మీడియా సమావేశాలకు పరిమితం అవుతున్నారు.

సింహపురి సీన్ వేరే లెవల్


సింహపురిలో మాత్రం వైఎస్ఆర్ సీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. అది కూడా రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే. ఈ జిల్లాలో అందరూ పెద్దరెడ్లే. వారి శైలి కూడా విభిన్నంగా ఉంటుంది. ఘర్షణలకు ఆస్కారం ఇవ్వరు. మాటల తూటాలు మాత్రమే పేలుతుంటాయి. అందులో ప్రధానంగా సర్వేపల్లి సెగ్మెంట్లో మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలు, హావభావాలు నవ్వులు పూయించడమే కాదు. ఎవరికి ఎవరూ తీసిపోని రీతిలో పరస్పరం అవినీతిని బట్టబయలు చేసుకుంటూ ఉంటారు.
"నియోజకవర్గంలో గనులు మొత్తం మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి దోచేశారు" అనేది టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన ఆరోపణ. "నియోజకవర్గంలో ఇసుకే కాదు. విలువైన క్వార్డ్జ్ నిలువలు కూడా కొల్లగొట్టాడు" అని నిందిస్తారు.
"అబ్బా వచ్చాడయ్యా.. సస్వరి
"నీ బతుకు ఎవరికి తెలియదు. నీ .. లోలత్వం ఎవరికి తెలియదు సామీ" అని మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి విమర్శలతో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై విరుచుకుపడతారు.
"మేము తలుచుకుంటే ఇలా ఉండదు" అని సోమిరెడ్డి హెచ్చరిస్తే..
అబ్బా..
"వచ్చాడయో పహిల్వాన్. గ్యార కాళ్లు వేసుకుని. ఉఫ్ మిని ఊదితే అడ్రస్ లేకుండా కొట్టుకుపోతాడు" అని మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి వ్యంగ్యాస్త్రాలతో సోమిరెడ్డి ఆహార్యంపై సెటైర్లు వేస్తారు.
" తలుచుకుంటే.. అంటున్నాడు. ఒక దెబ్బ పడితే చాలు కింద పడతాడు. అది కూడా కాల్ (పావు) దెబ్బ వేస్ట్ అవుతాది. ఈ మొగోడంట తలుచుకుంటే నాకేదో అవుతాదంట" ఊరుకోయ్యా సామీ నీ ఉత్తరకుమార ప్రగల్బాలు.. అనే మాటలతో కాకాణి చెడుగుడు ఆడడం.
ఇలా..
వారిద్దరు నియోజకవర్గంలోనే కాదు. జిల్లా మొత్తానికి మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోమన్ రెడ్డి తరచూ మాటలతో సెటైర్లతో టికెట్ లేని సినిమా చూపిస్తుంటారు.

ఇప్పుడు కూడా అంతే...
ఫలితాల తరువాత రాయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ పెద్దరెడ్లుగా ఉన్న నేతలు అడ్రస్ లేకున్నా, సింహపురిలో మాత్రం సీన్ మరో మాదిరిగా ఉంది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి మాత్రం క్యాడర్ మధ్య ఉంటున్నారు. పార్టీలో పట్టు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే తనదైన శైలి మాటలతో బహిరంగంగానే ఉన్నారు.

అనం స్టైలే వేరు..

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే వారిలో ఆనం కుటుబం కూడా ప్రధానమైనది. జనం నాడి పసిగట్టి మెలగడంలో ఆ కుటుంబం నుంచి వచ్చే వారు సిద్ధహస్తులు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పరిస్థితి గ్రహించిన ప్రస్తుత మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరారు. దీంతో ఆయన కుటుంబం నుంచి తీవ్ర ఆక్షేపణ విమర్శలు ఎదురయ్యాయి. నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆమె భర్త డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి కూడా విమర్శలు సంధించారు. అయినా, ఖాతరు చేయని రాంనారాయణరెడ్డి టీడీపీలో చేరడం, ఆత్మకూరు నుంచి విజయం సాధించడంతో పాటు ఏకంగా మంత్రి కూడా అయ్యారు.
రూరల్ పై కన్ను?


ఇటీవల నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెంలో ఉన్న తమ నివాసంలో చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆమె భర్త డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తరువాత నగరంలో కొత్త చర్చ ప్రారంభమైంది.
ఏపార్టీ అధికారంలో ఉన్నా, నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం రాజకీయంగా చక్రం తిప్పుతుంది. అదేకోవలో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నుంచి విజయం సాధించిన ఆనం అరుణమ్మ నెల్లూరు జెడ్పీ చైర్ పర్సన్గా ఉన్నారు. పార్టీ అధికారం కోల్పోయినా ఆమె సంహాసనానికి వచ్చిన ముప్పు ఏమి లేదనేది రాజకీయవర్గాల విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో అధికార టీడీపీ కూటమి నుంచి సవాళ్లు ఎదురవుతున్నా, కార్యకర్తలు, నాయకులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు.

"మాకు అండగా ఉంటాం. కాపాడుకుంటాం. బెదిరింపులకు భయపడవద్దు" అని ఆనం విజయకుమార్ రెడ్డి, అరుణమ్మ భరోసా ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్ సీపీలో తమ ప్రత్యేకత, గుర్తింపు కోసం ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న కాలానానికి పరిస్థితి చక్కదిద్దుకునే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై కన్ను వేశారా? అనే చర్చ కూడా ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులతో పాటు కీలక బాధ్యతలు నిర్వహించిన వారు కనిపించకున్నా, వైఎస్ఆర్ సీపీలో ఉన్న "ఆనం" కుటుంబీకులు తమ ప్రత్యేక శైలిలో చాటుకున్నారు.
మొత్తానికి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమ పెద్దరెడ్లు సైలంట్ గా ఉన్నారు. సింహపురిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి వెనుక వారి అస్థిత్వం కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తుపై ఆలోచనలతో బాటలు వేసుకోవడానికి యత్నిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కాలం ఎలాంటి మార్పులు తెస్తుందనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story