
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ ముఖద్వార గోపురం
'తిరుపతి' విసిరిన సవాల్ .. గోవిందా నీకు ఇదేనా భద్రత?
భద్రతా సిబ్బంది కనుగప్పి.. గోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకి వెళ్లిన వ్యక్తి.
కట్టుదిట్టమైన భద్రత ఉన్న తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయ గోపురంపైకి వెళ్లిన వ్యక్తిని భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారు. గోపురంపై బంగారు తాపడం చేసిన కలశాలు లాగడానికి విఫలయత్నం చేశాడు. సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ కేంద్రంలో గుర్తించలేకపోయారు.
"క్వార్టర్ బాటిల్ ఇస్తేనే కిందికి దిగుతా. లేదంటే కలశాలు లాక్కొని పోతా" అంటూ తిరుపతి అనే వ్యక్తి బీభత్సం చేసిన సంఘటన ఇది. ఆలస్యంగా గుర్తించిన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని కిందికి దించడానికి నానా యాతనపడ్డారు. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుపతి వెస్టు డివిజన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాలు ప్రధానంగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మహద్వారం సమీపంలోని గోడ ఎక్కి ఆలయ శిఖరంపైకి వెళుతున్నా, ఎందుకు గమనించలేకపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది.
టీటీడీ స్పందన ఇదీ...
"నిన్న రాత్రి (శుక్రవారం) నిజామాబాద్ కు చెందిన తిరుపతి అనే వ్యక్తి యాత్రికులతో కలిసి శ్రీగోవింద రాజస్వామి ఆలయం లోనికి ప్రవేశించాడు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడిమి గోపురంపైకి ఎక్కాడు. విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. పోలీస్ , ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఉన్మాది అయిన అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి ప్రకటన విడుదల చేశారు.
వైదిక ధర్మానికి టీటీడీ పాలక మండలి తూట్లు పొడుస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఆయన విడుల చేసిన ఓ వీడియాలోె ఏమన్నారంటే..
"శ్రీగోవిందరాజస్వామి ఆలయం తిరుపతి నగరానికి ఓ ఐకానిక్. రాజగోపురంపైకి తాగుబోతు ఎక్కుతున్నా కనిపించదా? ఇది అత్యంత దారుణ సంఘటన. తిరుమలలో కూడా వీవీఐపీలకు దర్శనాలు చేయించడంలో ఉన్న శ్రద్ధ, సనాతన ధర్మం కాపాడడంలో కనిపించడం లేదు" అని భూమన కరుణాకరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
తిరుమలలో ఘటనలు బయటి ప్రపంచానికి తెలియకుండా మీడియాను కూడా అదుపులో ఉంచుకున్నారని ఆయన జర్నలిస్టులకు కూడా చురకలు వేశారు.
టీటీడీ భద్రతా వ్యవస్థ
టీటీడీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉంది. ఐపీఎస్ అధికారి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం (TTD Chief Vigilance and Security Wing) అధిపతిగా ఉంటారు. ఆయన పర్యవేక్షణలోనే ఆర్ముడ్ రిజర్వు (Armed Reserve AR), ఏపీఎస్పీ (APSP) సిబ్బందికి తోడు ఎస్పీఎఫ్ (Special Protection Force SPF)) దళాలు కూడా ఉన్నాయి. వారికి తోడుగా మాజీ సైనికులు, యువకులను టీటీడీ విజిలెన్స్ విభాగంలో నియమించుకున్నారు. వారంతా కలిసి 1,500 మంది వరకు ఉన్నారు.
పెత్తనం అంతా వారికే..
టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది తిరుమలతో పాటు అనుబంధ ఆలయాల వద్ద కూడా భద్రతా విధుల్లో ఉంటున్నారు. విజిలెన్స్ విభాగంలో బాధ్యత కలిగిన కానిస్టేబుళ్ల, ఇతర అధికారుల స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్న సెక్యూరిటీ గార్డులే ఎక్కువగా విధుల్లో కనిపిస్తుంటారు. ఇదే సమస్యగా మారుతోందనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మాజీ సైనికులు ఉన్న ఆలయాల వద్ద మాత్రం నిబంధనలు అమలు చేయడంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. ఇది కొన్ని సమయాల్లో ఇబ్బంది కలిగించినా, భద్రత విధులు నిర్వహించడంలో తమ బాధ్యత నిర్వహిస్తున్నారు అనడంలో అతిశేయోక్తి కాదు. కానీ, తాత్కాలిక విధుల్లోకి తీసుకున్న సిబ్బంది పనితీరే చర్చకు వచ్చింది.
గోవిందుడి ఆలయం వద్ద...
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మహద్వారం సమీపంలోని గోడఎక్కి ఆలయ గాలిగోపురం వద్దకు వెళ్లిన విషయం కూడా పసిగట్టలేకపోయారు. దీంతో ఇక్కడ భద్రతా లోపం బయటపడిందనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీగోవిందరాజస్వామి ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల కిందటే ప్రాకారం గోడలు శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. రాత్రిళ్లు రెండో ద్వారం తలుపులు మూసి ఉంచుతారు. భద్రతా సిబ్బంది కూడా ఇక్కడే ఉంటారు. నిరంతరాయంగా సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది.
ఇంతటి భద్రత మధ్య...
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద భద్రతా సిబ్బంది కళ్లుగప్పిన ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది గమనించే లోపలే ఆలయం గోడదూకి, లోపలికి ప్రవేశించాడు. మహద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకి చేరకుకున్నాడు. అక్కడ అమర్చిన బంగారు తాపడం చేసిన కలశాలు పెకిలించడానికి యత్నించాడు. ఈ చర్య ద్వారా అగంతకులు సునాయాసంగా ఆలయంపైకి చేరుకోవచ్చని ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఆలస్యంగా మేల్కున్న టీటీడీ భద్రతా సిబ్బంది, ఆ వ్యక్తిని కిందికి దించడానికి సుమారు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చినట్లు తెలిసింది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంపైకి సునాయాసంగా వెళ్లిన వ్యక్తి ఓ విధంగా సాహసం చేశారనడంలో సందేహం లేదు. ఈ ఘటన టీటీడీ భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటున్నారు? సీసీ టీవీలు పరిశీలించే కమాండ్ కంట్రోల్ వ్యవస్థలో నిర్లక్ష్యం కూడా బయటపడింది.
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మగూడ సమీపంలోని పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతి (45) కూలీ పనుల కోసం తిరుపతికి చేరుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. తిరుపతిలో ఉంటున్న తిరుపతి భార్యతో కలిసి కూలీ పనులతో జీవినం సాగిస్తున్నారు. వారికి ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు, ఎనిమిదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం మత్తులో కుత్తడి తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకి ఎక్కినట్లు కనిపిస్తోంది.
మూడు గంటలు శ్రమించి..
శ్రీగోవిందరాజస్వామి ఆలయంపైకి గుర్తు తెలియని వ్యక్తి ఎక్కినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ గోపురంపై ఉన్న తిరుపతిని కిందికి దించడానికి పోలీసులు నానా యాతనపడ్డారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. టీటీడీ అధికారిక ప్రకటనలో "అతని మానసిక స్థితి సరిగా లేదు" అని ప్రస్తావించారు.
"ఆలయ గోపురం నుంచి కిందికి దిగుతా. క్వార్టర్ మందు సీసా ఇవ్వాలి" అని తిరుపతి షరతు పెట్టాడంటే, అతను మద్యం మత్తులో వెళ్లాడనేది అర్థం అవుతుంది. మూడు గంటల పాటు శ్రమించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది కుత్తడి తిరుపతిని కిందికి దించారు. ఆ తరువాత ఈస్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు
"నిందితుడిని విచారణ చేస్తున్నాం. పూర్తి వివరాలు మళ్లీ వెల్లడిస్తాం" అని డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు.
Next Story

