తిరుమలకు కొండంత భద్రత.. ఎందుకింత కలవరం..?
x

తిరుమలకు కొండంత భద్రత.. ఎందుకింత కలవరం..?

శ్రీవారి సన్నిధిలో మంగళవారం ఉదయం 1.30 గంటలకు తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు


తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30వ తేదీ వేకువజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ప్రొటోకాల్ వీఐపీలతో దర్శనాలు ప్రారంభం అవుతాయి. ఈసారి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది 1800 మంది, 2000 మంది పోలీసులతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన వల్ల తాజాగా భద్రతా చర్యల వెనుక అధికారుల్లో తెలియని కలవరం కనిపిస్తోంది.


శ్రీవారి ఆలయంలో యాత్రికులను వైకుంఠ ద్వార దర్శనాలకు ఆహ్వానం పలుకుతూనే ఆంక్షలు విధిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో వాహనాల తనిఖీకి చెక్ పోస్టులు కూడా సిద్ధం చేయడం, అలిపిరి వద్ద టోకెన్లు లేని వారిని వెనక్కి పంపించే విధంగా కూడా వ్యవహరించనున్నారు. ఇదిలావుంటే, శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి యాత్రికులకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు.

"తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు చెప్పారు. టోకెన్లు ఉన్న యాత్రికులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా టీటీడీతో సమన్వయం చేసుకుని పోలీసులు విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. తిరుమలలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు అంటే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి సన్నాహాలు పూర్తి చేశారు.
ఇదీ సంగతి..!
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఈ సంవత్సరం జనవరిలో తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. జనవరి 9వ తేదీ జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, 40 మంది గాయపడిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ పరిస్థితిని నివారించడానికి టిటిడి పాలక మండలి ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు స్వస్తి చెప్పి, ఆన్ లైన్ పద్దతిని అందుబాటులోకి తెచ్చింది. విషాధ ఘటన నేపథ్యంలో 2018 వరకు ఉన్న మాదిరే వైకుంఠ ద్వారాలు తెరవడం రెండు రోజులకే పరిమితం చేయాలని భావించారు. దీనిపై యాత్రికుల నుంచి నిరసన, వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో తర్జనభర్జన పడ్డారు. అంతిమంగా యాత్రికుల మనోభావాలు కాపాడుతూనే, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేని విధంగా ప్రత్యేక కైంటర్ల స్థానంలో సాంకేతిక ఆధారంగా ఆన్ లైన్ టోకెన్లు జారీ చేశారు.
అసాధారణ భద్రత వెనుక...
తిరుమలలో రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు రెండు రోజులు మాత్రమే తెరిచే వారు. 2018 నుంచి ఎక్కవ మంది యాత్రికులకు దర్శనాలు కల్పించాలని పది రోజుల పాటు ద్వారాలు తెరిచి ఉంచుతున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం వెనుక కుట్ర కోణం ఉందనే దిశగా దర్యాప్తు జరుగుతోంది. ఆ ఘటన తరువాత ప్రస్తుత తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్ బదిలీ అయ్యారు. టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, తిరుపతి క్రైం డీఎస్పీ రమణకుమార్ ను సీఎం నారా చంద్రబాబు సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీగా తొమ్మిది నెలల తరువాత మళ్లీ ఎల్. సుబ్బారాయుడును సీఎం నారా చంద్రబాబు నియమించారు.
ఈ పరిణామాలతో..
తిరుపతి, తిరుమల, టీటీడీ ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటలనకు ఆస్కారం ఏర్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయనేది పోలీసు, టీటీడీ అధికారులు కలవరం చెందుతున్నారు. దీంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఆ తరువాత తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సెక్యూరిటీ విభాగం సమన్వయంతో అసాధారణ భద్రతా చర్యలతో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు కూడా ఇదే రీతిలో ఏర్పాట్లు చేశారు.

"వైకుంఠ ఏకాదశి కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశాం. 2000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుంది" అని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు చెప్పారు. తిరుమల, తిరుపతి, జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
"వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి స్థానిక ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం" అని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.
యాత్రికులపై నిఘా..
తిరుమలలో ఈ ఏడాది జనవరిలో తొక్కిసలాట నేపథ్యంలో అధికారులు కలవరానికి గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల, తిరుపతిలో యాత్రికుల కదలికలపై కూడా నిఘా ఉంచినట్టు టిటిడి విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్ కేవీ. మురళీకృష్ణ తెలిపారు. టిటిడి విజిలెన్స్ సిబ్బంది 1800 మందితో పటిష్ట చర్యలు ఏర్పాటు చేశాం. 10 కట్–ఆఫ్ పాయింట్లలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. తిరుమలను జోన్లుగా విభజించి, ప్రతిజోన్‌కు ఇన్‌చార్జిని నియమించామని ఆయన చెప్పారు.

" తిరుమల, తిరుపతి నగరంలో భక్తుల కదలికలు, క్యూల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నాం" అని సీవీఎస్ఓ మురళీకృష్ణ తెలిపారు. పోలీసులు, టిటిడి అధికారులు సమన్వయంతో శాంతియుత దర్శనాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూలో యాత్రికులు సహనం, క్రమశిక్షణ పాటించాలి. తోపులాట, తొందరపాటు చర్యలు చేయవద్దు. పోలీస్, టిటిడి సిబ్బంది ఇచ్చే సూచనలు భక్తుల భద్రత కోసం మాత్రమే" అని సీవీఎస్ఓ మురళీకృష్ణ చెప్పారు. క్యూలో ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలు, భక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వసతి, సౌకర్యాలు అందించడానికి కూడా సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు.
సరిహద్దుల్లో చెక్ పోస్టులు
తిరుపతి జిల్లాకు సరిహద్దుల్లో మొదటిసారి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల నుంచి (అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు) వచ్చే భక్తులను బార్డర్ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీ చేసి, టోకెన్ లేకుండా వచ్చిన వారికి కలిగే అసౌకర్యాలను తెలియజేయాలని అధికారులను సీవీఎస్ఓ మురళీకృష్ణ ఆదేశించారు. సోషల్ మీడియా కంటెంట్ పై పర్యవేక్షణ ఉంటుదని, అపోహలు సృష్టించే వారిపైనే కాకుండా అసత్య ప్రచారాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు
టోకెన్లు ఉన్న వారి కోసం...
డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశికి తోడు 2026 జనవరి మొదటి తేదీ కూడా కలిసి రావడం వల్ల మూడు రోజుల కోసం ఈ డిప్ ద్వారా 1.76 లక్షల మందికి టోకెన్లు జారీ చేశారు.రోజుకు 60 వేల మందికి పైగా భక్తులకు దర్శనం కల్పించానికి 14 టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఈ నెల 30వ తేదీ (మంగళవారం) ఉదయం నుంచి టోకెన్లు ఉన్న యాత్రికులు తిరుమలలో నిర్దేశించిన ప్రదేశం నుంచే క్యూలోకి వెళ్లడానికి కార్యాచరణ అమలు చేస్తామని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టం చేశారు. యాత్రికుల టోకెన్ లో ఇచ్చిన సమయం ప్రకారం, ఆ ప్రదేశాల నుంచే క్యూలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు.
ఉదయం: టైం స్లాట్ యాత్రికులు కృష్ణతేజ సర్కిల్
మధ్యాహ్నం: స్లాట్ల భక్తులు ఏటీజీహెచ్
రాత్రి: స్లాట్ల భక్తులు శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్ లేని భక్తులకు ఈ మూడు రోజులు దర్శనాలు ఉండవు అని స్పష్టంగా ప్రకటించారు.
"తిరుమలలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. ఆయన ఏమంటరంటే..
1) టీటీడీ కేటాయించిన స్లాట్ సమయానికి మాత్రమే భక్తులు ప్రవేశ మార్గాల వద్దకు చేరుకోవాలి.
2) టోకెన్, ఆధార్/గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
3) సూచించిన ప్రవేశ మార్గాలనే అనుసరించాలి, మార్గం మార్పు చేయకూడదు.
4) పోలీస్, టీటీడీ సిబ్బంది ఇచ్చే ఆదేశాలు, సూచనలు పాటించాలి.
"తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే యాత్రికులు ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా చేరకుండా శాంతి భద్రతలకు సహకరించండి" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కోరారు.
సామాన్యుల కోసం..
తిరుమలలో శ్రీవారికి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతుంటాయి. దీంతో పది రోజులు కలిపితే 240 గంటల్లో యాత్రికుల దర్శనానికి 182 గంటలు అవకాశం ఉంటుంది. అందులో కూడా 164 గంటలు సామాన్య యాత్రికులనే శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించడానికి వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
టికెట్ల పునరుద్ధరణ : 2026 జనవరి రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు సాధారణ రోజుల మాదిరే రోజుకు రూ.300 టికెట్లు 1,500, శ్రీవాణి టికెట్లు 1,000 జారీ చేయనున్నారు. అంటే సాధారణ యాత్రికులతో పాటు ప్రత్యేక దర్శనాలు ఉంటాయనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టం అవుతోంది.
Read More
Next Story