సత్యవేడు:కళావిహీనంగా మారిన కళత్తూరు...
x
సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో కళత్తూరును ముంచెత్తిన చెరువునీరు

సత్యవేడు:కళావిహీనంగా మారిన కళత్తూరు...

చెరువుకట్ట తెగి, ఊహించని విపత్తు. దళితవాడలో భారీగా నష్టం.


చెరువుకట్ట తెగడం వల్ల పోటెత్తిన వరద నీటితో సత్యవేడు నియోజకవర్గంలోని కళత్తూరు దళితవాడ కళ విహీనంగా మారింది. దళితవాడ గుండె పగులింది. గ్రామాన్ని శ్మశాన నిశ్శబ్ధం ఆవహించింది.


చిత్తూరు జిల్లాపై మొంథా తుపాను ప్రభావం ఆలస్యంగా కనిపించింది. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో గురువారం తెగిన రాయలచెరువు కట్ట వల్ల కళత్తూరు దళితవాడలో పెను విషాదం నింపింది. గ్రామం అంధకారంలో చిక్కుకుంది. ఉదయం వరదనీటి ఉధృతి వీధుల్లో తొమ్మిది అడుగుల ఎత్తులో ప్రవహించడం వల్ల గ్రామస్తులు ప్రాణభయంతో మిద్దెలపైకి చేరారు. పోటెత్తిన వరదనీటితో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకున్నా, భారీగా ఆస్తినష్టం జరిగింది. ఇళ్లన్నీ జలమయం అయ్యాయి.


వరదనీటి ప్రవాహానికి 1,200 ఇళ్లు ఉన్న ఊరు వల్లకాడుగా మారింది. అదృవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు, కానీ పశువులు మృత్యువాత పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కళత్తూరు గ్రామంలో ఇళ్ల వద్ద పశువులు నీటి ఉధృతికి కొట్టకుని పోయాయి. ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీరియస్ అయ్యారు.
"అధికారులు సకాలంలో స్పందించి, గ్రామస్తులను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు. బాధ్యులపై చర్యలు తప్పవు. చెరువు కట్ట తెగిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వండి" అని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేవీబి. పురం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు భాగ్యరాజ్ ఏమంటారంటే..
"తెగిన రాయలచెరువుకు వర్షాల ప్రారంభానికి ముందే రూ. 20 లక్షలతో మరమ్మతులు చేశారనే సమాచారం ఉంది. పనులు ఎక్కడ చేశారనేది కూడా అధికారులు చెప్పడం లేదు" అని భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు.
సత్యవేడు నియోజకవర్గంలో తెగిన చెరువు కింద 1,200 ఎకరాల ఆయకట్టు ఉంది. అనధికారికంగా అది మరో 500 ఎకరాలు ఉండవచ్చనేది గ్రామస్తుల నుంచి తెలిసిన సమాచారం.
కళ విహీనంగా మారిన కళత్తూరు..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి బస్సుల బయలుదేరితే 25 కిలోమీటర్లు ప్రయాణించాక కేవీబీ. పురం మండల కేంద్రానికి చేరవచ్చు. ఇక్కడికి కిలోమీటర్ దూరంలోనే కళత్తూరు గ్రామం ఉంది. ఈ దళితవాడ పైభాగంలోని రోడ్డు దానికి ఎగువన పెద్దరాయలచెరువు ఉంది. గురువారం తెల్లవారుజామున చెరువుకట్ట తెగడంతో వరదనీరు పోటెత్తింది. ఆలస్యం గ్రహించే లోపు ఊరంతా నీటి పరవళ్లు, హోరుతో ముంచెత్తింది.
చెరువుకట్ట తెగిన నేపథ్యంలో ఉధృతంగా ప్రవహించిన వరదనీటి ధాటికి కళత్తూరు గ్రామం కళావిహానంగా మారింది. ఈ దళితవాడలో 1,800 గడపలు ఉన్నాయి. 20కి పైగానే వీధులు ఉన్నాయి. నీటి ఉధృతి వల్ల ప్రాణభయంతో గ్రామస్తులు మిద్దెలపైకి చేరారు. కళ్లముందే జీవనానికి ఆసరాగా ఉన్న పాడి ఆవులు, గేదెలు, వాహనాలు కొట్టుకుని పోతుండడం చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.
భారీ నష్టం...

వరదనీటి వల్ల కళతూరును గ్రామం శ్మశానవైరాగ్యం ఆవహించింది. మధ్యాహ్నానికి చెరువు గండికి అడ్డుగా కంకర, ఇసుక బస్తాలు వేయడం ద్వారా నీటిని అదుపు చేశారు. వరదప్రవాహం తగ్గిన తరువాత కళత్తూరు దళితవాటలోని ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. 160కి పైగానే ఇళ్లు ధ్వంసం కాగా, 39 పాకలు నేలమట్టం అయ్యాయని సమాచారం అందింది. దాదాపు 70కి పైగానే ఆవులు నీటిలో కొట్టకుని పోగా, ఇంకొన్ని ఇళ్లముందే మరణించి, పడిపోయాయి. దాదాపు 40కి పైగానే ద్విచక్ర వాహనాలు కొట్టుకుని పోగా, ఆరు ట్రాక్టర్ల వరకు బురదలో కూరుకును పోయాయి.
అంధకారంలో గ్రామం

సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలంలోని కళత్తూరు గ్రామం గురువారం రాత్రి అంధకారంలో ఉన్నట్లు ఆ ప్రాంతానికి చెందిన భాగ్యరాజ్ చెప్పారు. గ్రామంలోని వీధుల్లో ఉన్న 20 విద్యుత్ స్తంభాలు కొట్టుకొనిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం వల్ల విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. చివరికి సెల్ ఫోన్లలో కూడా బ్యాటరీ అయిపోవడం వల్ల బంధువులకు సమాచారం అందించే స్థితిలో లేరని తెలిసింది.
"కళత్తూరు గ్రామంలో మా పెద్దక్క, బామర్ది కుంటుంబాలు ఉన్నాయి. వరదనీరు పొటెత్తిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఫోన్ చేస్తే నో రిప్లై వస్తోంది" అని శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు హేమంత్ హరి వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల కళత్తూరు దళితవాడలో ప్రజల సెల్ ఫోన్లు కూడా పనిచేయని స్థితిలో ఉన్నారని హరి వివరించారు.
ఇలా ఎందుకు జరిగింది?
సత్యవేడు నియోజకవర్గంలోని పెద్ద రాయల చెరువు కట్ట తెగిన ఘటన పెను విషాదం మిగుల్చింది. ఊహించని విధంగా దళితులు తీవ్రంగా నష్టపోయారు. చెరువుకట్ట తెగడం వెనుక అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తే, చాలా విషయాలు బయటికి వచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ ఉదయం నుంచి జరుగుతోంది.
కేవిబీ. పురం మండలంలోని సదాపురం, రాయపేడు, పాతపాళెం, బంగారునత్తం, సరస్వతీపురం గ్రామాల సమీపంలోని చెరువులు కట్టకు గండి పడిన పెద్దరాయల చెరువుకు అనుసంధానంగా ఉన్నాయి. దీంతో రాయలచెరువు ఆయకట్టు 1,200 ఎకరాలు ఉందంటే, నిర్వహణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని గుర్తు చేస్తోంది. దీని నిర్లక్ష్యం వెనుక మతలబుపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాలు ప్రారంభానికి ముందు రూ. 20 లక్షలతో మరమ్మతులు చేయించినట్లు సమాచారం.

కలెక్టర్ సీరియస్
చెరువుకట్ట తెగి, దళితులను విషాదంలోకి నెట్టిన ఘటనపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. గ్రామాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ సుమిత్ కుమార్ సందర్శించారు. వరదనీటి వల్ల జరిగిన విధ్వంసాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట చిత్తూరు కలెక్టర్ తుషార్ డూడీ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తోపాటు నీటి పారుదల శాఖ అధికారులు కూడా ఉన్నారు.
"కళత్తూరు గ్రామంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు బాధితులకు అండగా ఉంటాం" అని కలెక్టర్ సుమిత్ కుమార్ భరోసా ఇచ్చారు. గ్రామంలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడారు. బాధితులను ఓదార్చిన కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చెరువు కట్ట తెగడం వెనుక నిర్వహణ లోపాలపై నీటిపారుదల శాఖాధికారులతో ఆయన వాకబు చేశారు.
"వరదనీరు ముంచెత్తకుండా గ్రామస్తులను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు?" అని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు.
"చెరువుకట్ట నిర్వహణ పరిస్థితి ఏమిటి? నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవు. రెండు రోజుల్లో ఈ ప్రమాదం జరగడం వెనుక సమగ్ర నివేదిక ఇవ్వండి" అని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
స్పందించిన తిరుపతి ఎంపీ..
సత్యవేడు నియోజకవర్గంలోని ఓలూరు రాయలచెరువు తెగిపోవడంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
కళత్తూరు దళితవాడలో తక్షణ సహాయక చర్యల కోసం ఎంపీలాడ్స్ నుంచి 20 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఓలూరు రాయల చెరువు తెగిపోవడంతో పరిసర గ్రామాలైన కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు నీటిమునిగాయి.ఈ ఘటనపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
"పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నాను. ఎంపీ వెంటనే స్పందించారు. తిరుపతి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, పరిస్థితి తెలుసుకున్నా" అని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఆర్డీవోతో కూడా మాట్లాడిన తరువాత తక్షణ సహాయక చర్యల కోసం ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేసినట్టు ఆయన వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ప
"గ్రామాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించండి. నీటిమునిగిన ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలతో అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి" అని ఎంపీ గురుమూర్తి కోరారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Read More
Next Story