
శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ..
కోటి రూపాయల చెక్కు అందించిన తెనాలి భక్తుడు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 11 ట్రస్టులు నిర్వహిస్తోంది. అందులో టీటీడీ ఎస్వీ నిత్యాన్నదాన ట్రస్టు కూడా ఒకటి. ఈ సంవత్సరం మిగతా ట్రస్టులతో పాటు అన్నదానం ట్రస్టుకు కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. తాజాగా శుక్రవారం ఓ యాత్రికులు కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మొత్తం నిత్యాన్నట్రస్టుకు వినియోగించాలని కోరారు.
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నసత్రం తోపాటు యాత్రికుల వసతి సముదాయాలు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయం వద్ద రోజుకు 2.50 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాలు, నిత్యాన్నదానం చేస్తోంది.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్. నాయుడు పాలక మండలి చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత 11 నెలలకే అంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలకు టీటీడీ ఎస్వీ నిత్యాన్నట్రస్టుకు 338.8 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి.
తిరుమలలో తెనాలికి చెందిన రామకృష్ణ కిలారి అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. దాత తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
Next Story

