శ్రీవారి ముడుపులు రైలులోనే నిలువు దోపిడీ
x

శ్రీవారి ముడుపులు రైలులోనే నిలువు దోపిడీ

గూడూరు స్టేషన్ వద్ద ట్రైన్ నంబర్ 07132లో దొంగల బీభత్సం.


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించాలని బయలుదేరిన యాత్రికులకు వేదన మిగిలింది. నర్సాపూర్ నుంచి బయలుదేరిన 07132 నంబర్ ఎక్స్ప్రెస్ రైలులో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు.

"శ్రీవారికి సమర్పించే ముడుపు మూట కూడా దోచుకున్నారు. ఈ సంఘటన కలిచి వేసింది" అని విజయవాడకు చెందిన ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ నుంచి తిరుపతికి వచ్చే రైల్వే మార్గంలో గూడూరు రైల్వే జంక్షన్ లోని ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కిన కొంతమంది దుండగులు ప్రయాణికుల నుంచి యథేచ్చగా దోచుకున్నారు. ఆ సమయంలో రైల్వే రక్షక దళం ( Railway Protection Force RPF ), జిఆర్పి ( Government Railway Police ) సిబ్బంది ఎక్కడున్నారు? ఏమి చేస్తున్నారనే ప్రశ్నలు తెరమీదకి వచ్చాయి.

కదిలే రైలు నుంచి..

గూడూరు రైల్వే స్టేషన్ వద్ద రైలు కదులుతుండగా కొందరి నుంచి బ్యాగులు లాక్కొని వెళ్లిపోవడం. ఇంకొందరరు ప్రయాణికుల నుంచి నగలు నగదు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దోపిడీ చేసినట్లు సమాచారం. వెంటనే రైలు ఆపేయడంతో గూడూరు రైల్వే స్టేషన్ లోనే ఫిర్యాదు చేసినట్లు బాధితుల్లో ప్రేమ్ కుమార్, వాడరేవు కుమారి, నరసమ్మ ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముక్కులు చెల్లించి, కొన్ని రోజులుగా కూడా పెట్టిన నగదును ముడుపు కట్టాం. ఆ సొమ్ము మొత్తం దొంగలు దోచుకుపోయారు అని ప్రేమ్ కుమార్ చెప్పారు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన నంబర్ కు కాల్ చేస్తే,

ప్రేమ్ కుమార్ ఏమంటున్నాడంటే..

"తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నాం సార్. ఇప్పుడే గదికి వచ్చాం. దొంగలనుంచి సొమ్ము రికవరీ అవుతుందా? ఆ ముడుపు వెంకటేశ్వర స్వామికి ఇచ్చే అవకాశం ఉంటుందా" అని అమాయకంగా ప్రశ్నించారు. గూడూరు రైల్వే స్టేషన్ వద్ద సోమవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల మధ్య. జరిగిన ఈ దోపిడీకి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట ఇది.
"నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో విజయవాడ నుంచి మేము ఆరుగురు కుటుంబ సభ్యులతో యస్ వన్ కోచ్ లో బయలుదేరాం. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా అక్క కుమారి హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకొని తలకింద పెట్టుకుని పడుకుని ఉన్నారు. పక్కనే బుడ్డోడు ఉంటే వాడిని లాగినట్లు అనిపించడంతో ఆమె కేకలు వేసింది. ట్రైన్ బయలుదేరగానే ఓ వ్యక్తి బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. ఇదే కంపార్ట్మెంట్లో వెనకవైపు డోర్ నుంచి మరో వ్యక్తి ఇంకొకరి నుంచి బ్యాగ్ లాక్కుని పరిగెత్తాడు. వారు పురుషుల, మహిళల అనేది కూడా తెలియడం లేదు. దీంతో మేము ప్రయాణిస్తున్న కంపార్ట్మెంట్లో అలజడి చెలరేగింది. వెంటనే రైలు ఆపారు. అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసాం" అని ప్రేమ్ కుమార్ కుటుంబీకులు చెప్పారు.

ఆగని దోపిడీలు

రైళ్లలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల మాదిరి ఎక్కి, దోపిడీలకు పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు వద్ద మంగళవారం జరిగిన సంఘటన సాక్ష్యం.
నర్సాపూర్ నుంచి బయలుదేరిన 07132 నంబర్ ఎక్స్ప్రెస్ రైలు తిరుపతి వరకు వస్తుంది. ఈ రైలులో వచ్చే వారంతా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చే యాత్రికులే ఉంటారు. అయితే, ఏసీ, రిజర్వ్డ్ బోగీలోకి వేరే ప్రయాణికులు ఎక్కకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. కానీ పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు గూడూరు రైల్వే స్టేషన్ కు ముందే రిజర్వుడ్ కంపార్ట్మెంట్ లోకి టికెట్ లేకుండానే వచ్చినట్లు చెబుతున్నారు. ప్రయాణికులు అందరూ నిద్రలో ఉండగా, S-1 భోగి తోపాటు ఇంకొన్ని కంపార్ట్మెంట్లో కూడా ఇదే తరహా చోరీలకు తెగబడినట్లు సమాచారం. ఇందులో ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న నగలు నగదు తో పాటు సెల్ఫోన్లు లాప్టాప్ లు కూడా లాక్కుని వెళ్లినట్లు చెబుతున్నారు.

సిగ్నల్స్ ట్యాంపరింగ్

ఇటీవల కాలంలో రైళ్లలోనే కాకుండా సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి రైలు బండ్లు ఆపడం ద్వారా దోపిడీలకు పాల్పడిన సంఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. దోపిడీ దొంగలు సాంకేతిక విషయాలను కూడా తెలుసుకొని, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా రెడ్ సిగ్నల్ పడేలా చేసి మార్గమధ్యంలో ఆపేసిన సంఘటనలు ఇటీవల. అనేకం జరిగాయి అందులో ప్రధానంగా రేణిగుంట నుంచి గుత్తికి వెళ్లే మార్గంలో తాడిపత్రి సమీపంలో కోమలి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఏడాది జూన్ 24వ తేదీ దోపిడీకి పాల్పడ్డారు. ఏప్రిల్ 30వ తేదీ గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోనే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి ఆరుగురు ప్రయాణికుల నుంచి దొంగలు బంగారు నగలను దోచుకున్నారు. గత నెలలో కూడా సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైళ్లను ఆపి చోరీలకు పాల్పడిన సంఘటనలు రైల్వే శాఖలో కలవరం రేకెత్తించింది. తాజాగా తిరుపతికి వస్తున్న నరసాపూర్ ఎక్స్ప్రెస్ లోకి వెళ్లిన దుండగులు ఎంత మేరకు నగలను దోపిడీ చేశారని విషయాలు ఇంకా తెలియలేదు.
ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు తిరుపతిలో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే డైరెక్టర్ కుప్పల సత్యనారాయణతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
తాజా సంఘటనపై బాధిత ప్రయాణికుడు ప్రేమ్ కుమార్ ఇంకా ఏమి చెప్పారంటే.. శ్రీవారికి సమర్పించాలనుకున్న ముడుపు మూట దొంగలు ఎత్తుకునిపోయారు. ఆయన అక్క కుమారి హ్యాండ్ బ్యాగ్ లాక్కుని పోయారు. అందులో రూ.2500 నగదు, ఇతర వస్తువులు ఉన్నట్లు చెప్పారు. మిగతా బోగీల్లో ఎవరి నుంచి ఎంత తీసుకుని పోయారనేది తెలియదని చెప్పారు.
గుడూరు రైల్వేష్టేషన్ లోనే ఈ సంఘటన జరగడం కలకలం రేపింది. రైలులో సరే. ప్లాట్ ఫాం జీఆర్పీ లేదా ఆర్పీఎఫ్ పోలీసులు ఏమయ్యారనేది తేలకుండా పోయింది.


Read More
Next Story