వారెవ్వా.. హథీరాంజీ మఠం అద్భుతం.. నిర్మాణ శైలే వేరు...
x
తిరుపతిలోని హథీరాంజీ బావాజీ మఠం

వారెవ్వా.. హథీరాంజీ మఠం అద్భుతం.. నిర్మాణ శైలే వేరు...

తిరిగి.. మద్రాస్ టెర్రస్ రూఫింగ్ టెక్నాలజీతోనే పునర్ నిర్మిస్తామన్న కలెక్టర్.


తిరుపతిలో 120 ఏళ్ల కిందట "మద్రాస్ టెర్రస్ రూఫింగ్ టెక్నాలజీ"తో శ్రీవారి భక్తుడు హథీరాంజీ బావాజీ మఠం నిర్మించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ణానం అందుబాటులో లేని రోజుల్లోనే పటిష్టమైన ఈ కట్టడం ఇప్పటికి పదిలంగా ఉంది. నిర్వహణలోపాల కారణంగా కొంతభాగం దెబ్బతినింది. దీనిపై వివాదాలు చెలరేగిన నేపథ్యంలో తిరుపతిలో పాతకాల జ్ణాపకాల్లో ఒకటిగా ఉన్న హథీరాంజీ మఠం భవనాల సముదాయంలో దెబ్బతిన్న కట్టడాలను మద్రాస్ టెర్రస్ రూఫింగ్ టెక్నాలజీతోనే పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు.

"హథీరాంజీ మఠంలోని విశాలమైన కట్టడంలో దెబ్బతిన్న చోట మాత్రమే యథాతధంగా పునర్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం" తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.

శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాంజీ బావాజీ మఠం తిరుపతిలో ఉంది. ఈస్టిండియా కంపెనీ నుంచి తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న వారిలో మహంతులదే ప్రథమ స్థానం. 1843 నుంచి 1932 వరకు హథీరాంజీ బావాజీ వారసులైన మహంతుల పాలనలోనే తిరుమల ఆలయ నిర్వహణ సాగింది. ఆ తరువాత టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది. తిరుపతితో పాటు తిరుమలలో అనేక కులాలకు మఠాలు ఉన్నాయి. కేవలం బంజారాలకు సంబంధించినదే హథీరాంజీ మఠం. ఈ కథ వేరు.
వివాదాల లోగిలి...
తిరుపతిలోని హథీరాంజీ మఠం చుట్టూ కొన్ని నెలలుగా వివాదాలు చుట్టుముట్టాయి. శ్రీగోవిందరాజస్వామి ఆలయ మాడవీధి నుంచి నగరంలో గుర్తింపు పొందిన గాంధీరోడ్డు వైపునకు వచ్చే మార్గంలో హథీరాంజీ మఠం కట్టడంలోని రాళ్లు దెబ్బతిన్నాయి. సంవత్సరాల కాలంగా నిర్వహణ లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది మఠం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మఠం కూలగొడతారనే వార్తల నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న బంజారా సంఘం నేతలు తిరుపతికి వచ్చి నిరసనకు దిగారు. ఈ పరిస్థితుల్లో మఠం భవనాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ పరిస్థితిలో..
కలెక్టర్ సమీక్ష

తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ శనివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ (ఇంచార్జి), నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, డిప్యూటి మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ నరసింహాచారి, హంథిరాంజీ మఠ౦ ఇంజినీర్, మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు, తిరుపతి తహసీల్దార్ సురేష్, రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, దుకాణాదారులు హాజరయ్యారు. సమావేశమయ్యారు.
"హథీరాంజీబావాజీ మఠం పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలి" అని నిర్ణయించారు. మఠాన్ని పాత తరహాలోనే పునర్నిర్మిస్తాం, మొత్తంగా కూల్చివేస్తారనే అపోహలు వద్దు. మఠంలో బంజారా భక్తులకు మొదటి ప్రధాన్యతతో వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తాం" అని కూడా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఇంకా ఏమి చెప్పారంటే..
హథీరాంజీ మఠం కట్టడంపై వస్తున్న అపోహల నేపథ్యంలో కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ అనేక విషయాలపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అధికారులు, మఠం కమిటీ సభ్యులకు అనేక విషయాలు స్పష్టంగా వివరించారు.
"జిల్లా స్థాయి కమిటీ సూచనల మేరకు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా సూచనలు, సలహాలను కూడా తీసుకున్నాం. హాథిరాంజీ మఠం మొత్తంగా కూల్చివేస్తారని అపోహలు ఉన్నాయి. ఇందులో వాస్తవం లేదన్నారు.
భవనాలు ఎక్కడ దెబ్బతిన్నాయంటే..

తిరుపతి నగరంలోని హథీరాంజీ మఠం గాంధీ రోడ్డు వైపున భాగం మాత్రమే ధ్వంసం అయిందని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ చెప్పారు.
"హథీరాంజీ మఠాన్ని 10 జోన్లుగా విభజిస్తే అందులో ఉత్తరం వైపున ఉన్న రోడ్డు మొదటి అంతస్తు భాగం పూర్తిగా ధ్వంసమైందని తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రసన్న కుమార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ డైరెక్టర్ ఆర్.ఎన్,ఎస్ మూర్తి (విజయవాడ) నిర్ధారించారు. అందులో ఉత్తరం వైపు ఉన్న రోడ్డు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు పూర్తిగా ధ్వంసమయ్యాయని, కారిడార్ కూడా ధ్వంసమైంది. పైకప్పు కూడా చాల వరకు పాడయింది. అవి పునర్ణిర్మాణం చేయవచ్చని నివేదిక ఇచ్చారు. అని కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు.
హథీరాంజీ బావాజీ ఎలా నిర్మించారు..
సాంకేతిక వ్యవస్థ అందుబాటులో లేని రోజుల్లోనే హథీరాంజీ బావాజీ మద్రాస్ టెర్రస్ రూఫింగ్ టెక్నాలజీతో నిర్మించారని విషయం నిపుణులు నిర్ధారించారు. ఇప్పుడు కూడా పునర్నిర్మాణం చేయడానికి అవకాశం ఉన్నదనే విషయంలో ఐఐటి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ నిపుణులు నిర్ధారించిన విషయం తెరమీదకు వచ్చింది. ఈ టెక్నాలజీలో కేవలం సున్నపు మోర్టారు, చెక్క, ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో సిమెంటు, కాంక్రీటు మరేవి లేవు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం దీనిని రెయిన్ ఫారెస్ట్ సిమెంట్ కాంక్రీట్ అని పిలుస్తారు.
సాంకేతిక నిపుణులు అందించిన నివేదికల ఆధారంగా ఈ విషయాలను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వివరించారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"హథీరాంజీ మఠాన్ని త్వరితగతిన పునర్ణిర్మాణం చేసి బంజారా భక్తులకు వసతి సౌకర్యం, వ్యాపారస్తులకు కూడా వారి సౌకార్యార్థం దుకాణాలను అందుబాటులోనికి తీసుకొస్తాం. హంథిరాంజీ మఠ౦ అధికారులు, సాంకేతిక నిపుణుల సమన్వయంతో పునర్నిర్మించడానికి ప్రతిపాదనలను సిద్దం చేయండి" అని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.
Read More
Next Story