
తిరుమల శ్రీవారి హుండీ (ఫైల్) మాట్లాడుతున్న టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి
Theft case in Parakamani | ఇదేందయ్యా ఇది.. నేను యాడ చూడలేదబ్బా..
సిఐడిలో ఆ ఇద్దరినీ తప్పించండి. ముగ్గరు టీటీడీ బోర్డు సభ్యలపై బిజెపి నేత ఆసక్తికర వ్యాఖ్య..
తిరుమల పరకామణి (హుండీా కానుకల లెక్కింపు కేంద్రం)లో జరిగిన చోరీపై ఏపీ సిఐడి డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యనార్ సారధ్యంలో ఏర్పాటైన బృందంలో ఉన్న ఓ సిఐ, ఎస్సైని తప్పించాలని భానుప్రకాష్ రెడ్డి బుధవారం మీడియా వద్ద డిమాండ్ చేశారు.
"పరకామణి చోరీ ఘటన తర్వాత ఆ సీఐ, ఎస్సై వైసిపి నేతలకు సహకారం అందించారు. దర్యాప్తు బృందంలో వారిద్దరూ ఉంటే, వాస్తవాలు పక్కదారి పట్టే అవకాశం ఉంది" అని బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. దర్యాప్తు బృందం నుంచి వారిద్దరనీ తప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వారిద్దరిపై చాలా మంది నుంచి అభ్యంతరాలు తమకు అందాయని ఆయన తెలిపారు.
"చోరీ జరిగిన వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ లో సీసీ కెమెరాల పుటేజీ కూడా లేకుండా చేశారు. మాకు ఉన్న మార్గాల్లో శ్రీవారి భక్తులు వీడియో అందించారు. ఆ ఆధారం బయటపెట్టాం. దీనిని కొందరు టీటీడీ అధికారులు సిబ్బందిని బెదిరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. గౌరవంగా ఉద్యోగాలు చేసుకోండి. లేదంటే ఎక్కడికి బదిలీ అవుతారో తెలియదు" అని భానుప్రకాష్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు. వైసీపీకి కోవర్టులుగా కాకుండా, శ్రీవారి సేవకులుగా విధులు నిర్వహించండి అని ఆయన సూచించారు.
నిబంధనలకు పాతర
తిరుమలలో పరకామణి లో జరిగిన చోరీ వ్యవహారం తర్వాత ఆనాటి పాలకమండలి అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించిందని ఆధారాలతో సహా బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
"2013లో పరకామణిలో చోరీ జరిగింది. విజిలెన్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా నోట్ల లెక్కింపు వివరాలు నమోదు చేస్తున్న ఉద్యోగి రవికుమార్ ను పట్టుకున్నారు. ఆయన నుంచి 920 అమెరికన్ డాలర్లు కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు" అనే విషయాన్ని భాను ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు.
"ఈ కేసులో నిందితుడుగా ఉన్న రవికుమార్ తో ఫిర్యాదుదారుడు అయిన టిటిడి ఏవీఎస్ఓ రాజీ కుదుర్చుకోవడం అనేది మొదటి తప్పు" అని బిజెపి లీగల్ సెల్ అడ్వకేట్ అజయ్ కుమార్ నిబంధనలను ప్రస్తావించారు. ఇద్దరు వ్యక్తులు కుటుంబ సభ్యుల మధ్య గొడవ లేదా ఇతరత్రా ఏదన్నా కేసులు ఉంటే రెండు పక్షాలు రాజీ కావడం ద్వారా లోక్ అదాలత్ లో రాజీకి అవకాశం ఉంటుందని విజయకుమార్ గుర్తు చేశారు.
"పరకామణి అనేది టీటీడీకి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ భద్రతా వ్యవహారాల పర్యవేక్షణతో పాటు కేసు నమోదు చేసింది కూడా టిటిడి ఏవీఎస్ఓ. ఈయన ప్రభుత్వ ఉద్యోగి. నిందితుడితో ఎలా రాజీ కుదుర్చుకుంటారు" అని అడ్వకేట్ అజయ్ కుమార్ ప్రస్తావించారు. ఇదే అంశాన్ని ఏపీ హైకోర్టు ఆర్టికల్ 226 ఆధారంగా విస్తృత అధికారాన్ని ఉపయోగించి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిటిషన్ అనుమతించిందని ఆయన వివరించారు.
అదొక విడ్డూరమైన తీర్మానం..
పరకామణిలో శ్రీవారి చోరీ చేసిన నిందితులు రవికుమార్ పై 2013 లో టీటీడీ పాలకమండలి అత్యంత అనురాగం ప్రదర్శించి నిబంధనలకు అడ్డంగా పాత్ర వేసిందని బిజెపి నేత, టిటిడి బోర్డు సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి ఆధారాలు బయటపెట్టారు.
శ్రీవేంకటేశ్వరస్వామి వారికి స్థిరాస్తులు సమర్పించాలంటే హిందూ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆస్తులు కానుకగా సమర్పించే వ్యక్తులు మొదట టిటిడికి సమాచారం ఇవ్వాలి. ఈ ధార్మిక సంస్థలోనే ఉన్న ప్రాపర్టీ సెల్ ఆస్తులను పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రకటన కూడా చేయాల్సి ఉంటుంది.
తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్న రవికుమార్ ఆయన భార్య టిటిడి కి ఏడు గిఫ్ట్ డీడ్స్ ( Gift Deeds ) ఇవ్వడానికి అంగీకారం తెలియజేస్తూ 2023 మే 19వ తేదీ టిటిడికి ఓ లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ ఆస్తి విలువ 14,43,22,000 రూపాయలు అని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ ఆస్తులు విరాళంగా తీసుకోవడానికి టిటిడి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారధ్యంలోని పాలకమండలి 2023 జూన్ నెల 18వ తేదీ జరిగిన బోర్డు మీటింగ్లో తీర్మానం చేశారు.
వైవీ. సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు మీటింగ్ Courtesy: TTD (File photo)
"ఆస్తుల స్వాధీనానికి సంబంధించి పత్రిక ప్రకటన జారీ చేసే సమయం లేదు" అని తీర్మానంలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన తప్పుబట్టారు.
అంతకుముందే స్వాధీనం..
టీటీడీకి ఆస్తులు స్వాధీనం చేసే వ్యక్తి సచీలుడా, నిందితుడా అనేది ఇక్కడ పాయింట్ కాదు. లేఖ ఇచ్చిన తర్వాత ఆస్తుల పరిశీలన అనేది కూడా పక్కన ఉంచవచ్చు. రవికుమార్ అనే వ్యక్తి 2023 జూన్ 19వ తేదీ లేఖ ఇస్తే, అంతకు ఒకరోజు కిందటే అంటే 18వ తేదీ స్వాధీనం చేసుకున్నట్లు టిటిడి ప్రాపర్టీ సెల్ లేఖ జారీ చేసింది.
"ఇది గోప్యంగా ఉంచి నెలరోజుల తర్వాత బోర్డు మీటింగ్ కూడా నిర్వహించడం, తీర్మానం చేయడం అనేది విడ్డూరంగా ఉంది. ఇది నేను ఎక్కడా.. చూడలేదు. ఎప్పుడు వినలేదు" అని టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించడం తోపాటు అందుకు సంబంధించిన టిటిడి తీర్మానం డాక్యుమెంట్ కూడా విడుదల చేశారు.
"చోరీ కేసులో నిందారోపణలు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి ఆస్తులు స్వాధీనం చేసుకోవడంలో టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, మిగతా సభ్యులది కూడా సమష్టి నిర్ణయం. ప్రస్తుత పరిణామాలకు వారందరూ బాధ్యులే" అని భాను ప్రకాష్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానం గా చెప్పారు.
ప్రస్తుత బోర్డు సభ్యుల్లో..
పరకామణి చోరీలో నిందితుడు రవికుమార్ కు వైసిపి నేతలు మద్దతుగా ఎందుకు నిలిచారు? వారికి ఎంత ముట్టింది? ఒక ఉద్యోగికి 14 కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు కూడా భాను ప్రకాష్ రెడ్డి సంధించారు.
ప్రస్తుతం బీఆర్. నాయుడు సారధ్యంలోని టీటీడీ పాలక మండలి
వైసీపీ పాలకమండలిలో సభ్యులుగా ఉన్న వారిలో గత ఎన్నికల తర్వాత టిడిపిలో చేరిన వారిలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు. వారిలో ముగ్గురు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు సారధ్యంలోని పాలకమండలి లో కూడా సభ్యులుగా ఉన్నారు. పరకామణిలో చోరీకి సంబంధించిన వ్యవహారంలో భాను ప్రకాష్ రెడ్డి మినహా వైసీపీ ప్రభుత్వంలో కూడా పనిచేసిన ముగ్గురు సభ్యులు ఎక్కడ ఎప్పుడు నోరు మెదపడం లేదు. ఈ విషయంపై సంధించిన ప్రశ్నకు భాను ప్రకాష్ రెడ్డి సమాధానమిది..
"పాలకమండలిలో తీసుకునే నిర్ణయానికి సహా సభ్యులందరూ బాధ్యులే. వైసిపి ప్రభుత్వంలో, ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వంలో.బోర్డు సభ్యులుగా ఉన్నవారికి కూడా బాధ్యత ఉంది" అని భాను ప్రకాష్ స్పష్టం చేశారు.
తిరుమలలో ఏపీ సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కు అన్ని ఆధారాలు అందించాలని కూడా భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు.
"సిఐడి చేపట్టే దర్యాప్తు తర్వాత రోజుల వ్యవధిలోనే ఊహించని పేర్లు, నాయకులు తెరపైకి వస్తారు" అని భానుప్రకాష్ జోస్యం చెప్పారు. విధినిర్వహణలో సిన్సియర్గా వ్యవహరించే. Cid DG రవిశంకర్ అయ్యన్నార్ సారధ్యంలోని బృందం ఎలాంటి సంచలనాలు బయటపెడుతుందనేది వేచి చూడాలి.
Next Story