తిరుమల : తెలంగాణ సిఫారసు లేఖల పంచాయతీ సమసిందబ్బా.!
x

తిరుమల : తెలంగాణ సిఫారసు లేఖల పంచాయతీ సమసిందబ్బా.!

శ్రీవారి దర్శనంలో తెలంగాణ సిఫారసు లేఖల వివాదానికి తెరదించారు. టీటీడీ బోర్డుపై కూడా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తీపికబురు అందించారు.


తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు దేవాదాయ శాఖ యంత్రాంగం నుంచి కూడా దర్శనానికి సిఫారసు లేఖలు జారీ చేస్తుంటారు. తెలంగాణ నుంచి అందిన లేఖలను ఇటీవల టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీకి దారి తీసింది. అయితే,

ఏపీ కార్మిక శాఖ మంత్రి ఈ వివాదానికి సున్నితంగా తెరదించారు. "తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు జారీ చేసే సిఫారసు లేఖలకు ప్రాధాన్యత ఉంటుంది" అని చెప్పడం ద్వారా వాతావరణాన్ని ప్రశాంతం చేశారు. భావోద్వేగాల సమస్య తలెత్తకుండా, సామరస్యంగా పరిష్కరించారు. అదే సమయంలో, మరో తీపి కబురు కూడా ఆయన అందించారు. "ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆయన చెప్పిన మాటలు మరింత ఆశలు రేకెత్తించాయి. ఆ మాటల ప్రకారం "టీటీడీ పాలకమండలి ఏర్పాటు ఇంకో రెండు నెలలు ఉండకపోవచ్చు" అనే విషయం కూడా స్పష్టమవుతోంది.
ప్రోటోకాల్ ప్రకారం..
ఆంధ్రప్రదేశ్లోని ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు జారీచేసే సిఫారసు లేఖలకు ప్రొటోకాల్ ప్రకారం టీటీడీ తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్లు మంజూరు చేస్తుంది. ఇదే పద్ధతి ఉమ్మడి రాష్ట్రంలోనూ, విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా వర్తింప చేస్తున్నారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు తిరుమలకు వస్తే బసతోపాటు శ్రీవారి దర్శన టికెట్లు కూడా కేటాయిస్తారు. రుసుం చెల్లించే టికెట్లు కొనుగోలు చేయాలి. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే,
ఇటీవల కొత్త పంచాయతీ..
తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలను తిరుమలలో ఇటీవల అనుమతించలేదు. దీంతో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జనపల్లి అనిరుథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలలోనే ఆయన టీటీడీ అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు.. "తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ అధికారులు వివక్ష చూపిస్తున్నారు. మేము కూడా మా రాష్ట్రంలో ఇలా అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది" అని కూడా హెచ్చరికగా వ్యాఖ్యానించారు. అంతటితో వదలకుండా, హైదరాబాదులో జరిగిన ఓ సమావేశంలో కూడా దీనిపై ఆయన నిప్పులు చెరిగారు.
"తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకోకుండా అవమానిస్తే, ఏపీ వాళ్లు హైదరాబాద్లో ఎలా ఉంటారు? వాళ్లు వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తాం" అని ఎమ్మెల్యే జనపల్లి అనిరుథ్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. "ఏపీ నాయకులను తెలంగాణలోకి అడుగు కూడా పెట్టినిచ్చేది లేదని, మేము అడ్డం తిరిగితే ఎలా ఉంటుందో ఆలోచించాలి" అని తీవ్రస్థాయిలో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలమురి వెంకట్ కూడా టీటీడీ అధికారుల తీరుపై మండిపడ్డారు. పరిస్థితి చక్కబడుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంచాయతీ తీసుకువెళ్లాలని కూడా భావించారు.

"చిన్నపాటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకొని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడితే సరిపోయేది" కానీ ఈ సమస్యను తీవ్రస్థాయి వ్యాఖ్యలతో ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి వివాదాస్పదం చేశారు. వాస్తవానికి టీటీడీ అధికారులు కూడా ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు జారీ చేసిన లేఖలను కూడా తిరస్కరించాల్సిన అవసరం ఏమిటనేది ప్రభుత్వమే వివరణ కోరి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. "సున్నితమైన విషయాన్ని టీటీడీ అధికారులు ఎందుకు జఠిలం చేశారనేది వారే చెప్పాలి" కానీ ఇంతవరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించడానికి దారి తీసిన పరిస్థితి ఏమిటి? ఏమి జరిగింది అనే విషయాన్ని ఇంతవరకు టీటీడీ పౌర సంబంధాల విభాగం అధికారుల నుంచి ఎలాంటి వివరణ వెలువడ లేదు. దీనిపై 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది మినహా, సమాధానం లభించలేదు. అయితే,
సున్నితంగా పరిష్కారం

టీటీడీ అధికారుల నిర్వాకం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలతో కూడిన ఈ సమస్యను ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సున్నితంగా పరిష్కరించారు. దీంతో, "తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఉంటుంది" అని చెప్పడం ద్వారా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమస్యను జఠిలం కాకుండా పరిష్కరించినట్లు కనిపిస్తుంది.
తెలంగాణలోని యాదగిరిగుట్ట (Yaadagiri Gutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ఆలయ మర్యాదలతో అక్కడి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి దర్శనం కల్పించడం తోపాటు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (executive officer) భాస్కరరావు తీర్థప్రసాదాలు కూడా అందించారు. ఆ తర్వాత మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు.
"తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం" అని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. "టీటీడీ పాలకమండలి ఏర్పడగానే, తెలంగాణ లేఖలకు గతంలో మాదిరే ప్రాధాన్యత ఉంటుంది" అని కూడా మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. ఆయన మాటల నేపథ్యంలో, తిరుమల సిఫారసు లేఖలపై తెలంగాణ-ఆంధ్ర ప్రభుత్వాలు ప్రధానంగా ప్రజల మధ్య భావోద్వేగాలతో కూడిన సమస్య టీ కప్పులో తుఫానుల తేలిపోయింది.
తీపి కబురే.. అయినా నిరాశే
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలంగాణలో "టీటీడీ (TTD) పాలక మండలి ఏర్పాటుపై" కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో దశ నామినేటెడ్ పోస్టుల కోసం ఏపీలో నిరీక్షిస్తున్న ఔత్సాహిక నేతల్లో మంత్రి సుభాష్ ఆశలు రేకెత్తించేవిగా ఉన్నాయి. అదే సందర్భంలో, నిరాశ కూడా కలిగించినట్లు కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి నాలుగు నెలలు కావస్తోంది. నెల క్రితం మొదటి విడతలో కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. టీడీపీ కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కుదరకపోవడం, నామినేటెడ్ చైర్మన్ పోస్టులకు ప్రధానంగా టీటీడీ చైర్మన్, పాలకమండలి సభ్యుల పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పిన విధంగా అయితే టీటీడీ పాలకమండలి కూర్పు, ఏర్పాటు ప్రక్రియ మరో రెండు నెలల వరకు సాగదీసే అంశంగానే కనిపిస్తోంది. అంతవరకు టీటీడీ (TTD ) పరిపాలన వ్యవహారాలు, నిర్ణయాలు అధికారుల సారథ్యంలోనే జరిగే విధంగానే కనిపిస్తుంది. సీఎం ఎన్. చంద్రబాబు చేసే విధాన నిర్ణయ ప్రకటన ఎప్పుడే అనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story