జిల్లాల పునర్విభజన ఓటు మాటే..! ఇప్పట్లో సాధ్యం కాదన్న మంత్రి
జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల హామీ నెరవేరేలా లేదు. మంత్రి ప్రకటన ఆ తుట్టి కదిపింది.
అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజనను చక్కదిద్దదానికి చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు. దీనికి సమయం పడుతుందనే విషయంలో సందేహం లేదు. కాగా, రెవెన్యూ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆందోళనలకు తుట్టి కలిపినట్లే కనిపిస్తోంది. ఆయన మాటలను పరిశీలిస్తే..
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పట్లో జరిగ దనే విషయం స్పష్టమైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. దీంతో మదనపల్లి, రాజంపేట ప్రాంతాల్లో "జిల్లాల సాధన సమితి" ద్వారా నిరసనలకు దిగుతామని ఆ పట్టణాల నాయకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత "పెట్టుబడులు, నిధుల సమీకరణ, పరిపాలన వ్యవస్థను గాడిన పెట్టడం. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చడంపై" దృష్టి కేంద్రీకరించింది. ఇదిలా ఉంటే,
2024 : ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ఎన్. చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. అందులో జిల్లాల పునర్విభజన ప్రక్రియ కూడా ప్రధానమైంది. అప్పుడు మదనపల్లెలో ఆయన ఏమన్నారంటే..
"గత ప్రభుత్వంలో జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారు. ఆ పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటాం" సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు విస్పష్టంగా ప్రకటించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం..
2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం అంటూ 26 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. 1979 జూన్ తరువాత ఈ ప్రక్రియ జరిగింది. ఇందులో రెవెన్యూ డివిజన్ కేంద్రాలను కాకుండా కొన్ని నియోజకవర్గాల కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేశారు. "ఈ వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్. జగన్ రాజకీయ పక్షపాతం చూపించారు" అని టీడీపీ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా, పార్టీ విభేదాలను పక్కన ఉంచిన వైసీపీ, అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ శ్రేణులు నాయకులు చాలాచోట్ల నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. "జిల్లా సాధన సమితి" పేరిట వైసీపీ నేతలు అఖిలపక్షంతో మమేకమై ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆ కోవలో..
బ్రిటిషర్ల కాలంలోనే పరపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కేంద్రాలు..
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి, ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ, ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటుకు అనుకూలత ఉంది. వీటిని పరిగణలోకి తీసుకోని నాటి వైసీపీ ప్రభుత్వం పక్కనే ఉన్న నియోజకవర్గ కేంద్రాలను జిల్లాలుగా ఏర్పాటు చేసింది.
రాజకీయ వివక్ష.. మరో కారణం..
వందల ఏళ్ల కిందట దూరదృష్టితో ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సబ్ కలెక్టర్లుగా ఐఏఎస్ అధికారుల్ని నియమించేవారు. అందులో కడప జిల్లా రాజంపేట, చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం జిల్లా పెనుగొండ, ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయాలకు ఆ హోదా ఉంది. రాయలసీమలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వైసిపి పాలనలో ఎలా జరిగింది అంటే..
ఓ ఉదాహరణ
కడప జిల్లా రాజంపేట రెవెన్యూ డివిజన్ పార్లమెంటు స్థానంగా కూడా ఉంది. దీని పరిధి ఈ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి తోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి కూడా పురాతన సబ్ కలెక్టర్ కార్యాలయం ఉంది.
వీటిని కాదని ఈ రెండు కేంద్రాలకు మధ్యన ఉన్న మంచినీటికి అలమటించే రాయచోటిని అన్నమయ్య పేరిట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీని వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఎదుర్కొన్నారు. మదనపల్లి సబ్-కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దగ్ధమైన ఘటన నేపథ్యంలో వారి ప్రయోజనాలు ఏమిటనేది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
దీనికి వైసీపీ నేతలు, మాజీ సీఎం వైఎస్. జగన్ ఇచ్చిన విశ్లేషణ ఏమిటంటే "వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. అందుకే రాయచోటి జిల్లా కేంద్రం చేశాం" అని పలికారు. కాగా,
అనంతపురం జిల్లా పెనుగొండక రెవెన్యూ డివిజన్ కు ఆ సూత్రం వర్తించలేదు. దీనిస్ధానంలో హిందూపురానికి చరిత్రలో పేరు ఉంది. ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. "అందువల్లే జిల్లా కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపించింది"అనే ఆరోపణలు కూడా వినిపించాయి. అనంతపురం జిల్లాలో పెనుగొండ లేదా హిందూపురంను కాదని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేశారు. రాయచోటి సూత్రం ఇక్కడ మాత్రం అమలు కాలేదు. ఈ పరిస్థితుల్లో..
జిల్లాల విభజన సమీక్షిస్తాం.. ఇది బాబు మాట
"వైసీపీ పాలనలో జిల్లాల విభజన వ్యవహారంలో శాస్త్రీయత లోపించింది" అని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అనేక సభల్లో విమర్శలు గుప్పించారు. పాత రెవిన్యూ డివిజనల్ కేంద్రాలను జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన గత ఎన్నికల ప్రచార సభల్లో ఘంటాపదంగా చెప్పారు. అందులో చిత్తూరు జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురం, అనంతపురం జిల్లా పెనుగొండ స్థానానికి బదులు హిందూపురం జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయడానికి అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల తర్వాత కూడా జిల్లాల పునర్విభజన వ్యవహారంపై దృష్టి సారించే పరిస్థితి లేదు. దీనికి ఇంకొంతకాలం సమయం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో ఆదివారం టీడీపీ కూటమి నేతలు, ఎమ్మెల్యేల సమన్వయ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. "రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ఆలోచన ప్రస్తుతానికి లేదు" అని ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలదనే విషయం స్పష్టమవుతోంది.
ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒకటైన జిల్లాల పునర్విభజన వ్యవహారంపై మళ్లీ ఆందోళనలు పురుడు పోసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై
"మదనపల్లి జిల్లా సాధన సమితి" కన్వీనర్ గా తీవ్రస్థాయిలో ఆందోళన సాగించిన పీటీఎం శివప్రసాద్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం "చంద్రబాబు ఇచ్చిన హామీపై నమ్మకం ఉంది. కొంతకాలం తర్వాత అయినా మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారనే నమ్ముతున్నాం" అని శివ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
"రెవెన్యూ శాఖ మంత్రి చేసిన ప్రకటన మమ్మల్ని, మదనపల్లి ప్రాంత నాయకులను నిరాశకు గురి చేసింది" అని చెప్పారు. "మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు అనేక అంశాల్లో చరిత్రపుటల్లో చెరగని స్థానం ఉంది" అని ఆయన గుర్తు చేశారు.
"ఈ ప్రాంత ఔన్నత్యం పరిరక్షించుకోవడం మా బాధ్యత. ఇందుకోసం సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి మళ్లీ ఆందోళనలు సాగిస్తాం" అని పీటీఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. దీనికోసం వారం రోజుల్లో మళ్లీ "మదనపల్లి సాధన సమితి"కి పునరుజ్జీవం పోయడానికి అఖిలపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, జిల్లాల పునర్విభజన అంశంపై సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో అనేది వేచి చూడాల్సిందే.
చమక్కు : "మదనపల్లి జిల్లా సాధన సమితి"లో ప్రతిపక్షంలో ఉండగా, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా చురుగ్గా పాల్గొన్నారు. మిగతా వారితో పాటు షాజహాన్ బాషాపై కూడా పోలీసులు అప్పట్లో కేసులు కూడా నమోదు చేశారు.
Next Story