హార్స్లీ హిల్స్‌లో పునుగుపిల్లి
x

హార్స్లీ హిల్స్‌లో పునుగుపిల్లి

వేగంగా అంతరిస్తున్న జాతుల్లో పునుగుపిల్లి ఒకటి. శేషాచలం అడవుల్లో కనిపించే పునుగుపిల్లి మైదాన ప్రాంతంలోకి వచ్చింది. దీనిని హార్స్లీ హిల్స్ లో సంరక్షిస్తున్నారు.


తిరుమల శ్రీవారి కైంకర్యాల్లో పునుగుపిల్లికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతరిస్తున్న వన్యప్రాణి జాతుల్లో పునుగుపిల్లి కూడా ఒకటి. శేషాచలం అటవీ సానువుల్లో మాత్రమే సంచరించే ఈ పునుగుపిల్లి జనారాణ్యంలోకి వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే అటవీశాఖ సిబ్బంది దానిని పట్టుకున్నారు. సురక్షితంగా తీసుకువెళ్లి, శీతల ప్రదేశమైన హార్స్లీ హిల్స్‌లో ఎన్‌క్లోజర్‌లో సంరక్షిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శేషాచలం అడవులు నెలవు

తిరుమల గిరులు విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లో అత్యంత అరుదైన వన్య ప్రాణులు కూడా సంచరిస్తుంటాయి. అందులో పునుగుపిల్లి కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. "ఈ పునుగుపిల్లి తిరుమల శ్రీవారి కైంకర్యాలకు తన జీవితాన్ని అంకితం చేసిన జీవి" అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పునుగుపిల్లి నుంచి వెలువడే తైలంతో తిరుమల శ్రీవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. దీనినే పునుగుగిన్నె సేవ అని ప్రస్తావిస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పునుగుపిల్లిని సంరక్షించడంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అనుకోని విధంగా..

జనారణ్యంలోకి.. హార్స్లీ హిల్స్‌కు తరలింపు

అంతరిస్తున్న జాతుల్లో ఒకటిగా ఉన్న పునుగుపిల్లి అనూహ్యంగా జనావాసాల్లోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతాల్లోకి రావడం విశేషం.. చిత్తూరు జిల్లా మదనపల్లి అటవీ రేంజ్ పరిధిలో ఉన్న కలికిరి వద్ద ఓ మాజీ సిపాయి నివాసం సమీపంలో చెట్టుపై పునుగు పిల్లి కనిపించడం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల నుంచి ఈ విషయం తెలిసిన వెంటనే కలికిరి అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ( ఎఫ్ బి ఓ) గిరిధర్ అక్కడికి వెళ్లి పునుగుపిల్లిని ఓ బోనులో ఉంచి భద్రంగా స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్నట్లు ఆ పునుగుపిల్లి తీరు కనిపించిందని ఎఫ్‌బీఓ గిరిధర్.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.

"మైదాన ప్రాంతం. అది కూడా బోదగడ్డితో నిండిన ఈ ప్రాంతంలో ఈ పునుగుపిల్లి కనిపించడం ఆశ్చర్యం కలిగించింది" అని గిరిధర్ చెప్పారు. "ఈ పునుగుపిల్లి అత్యంత సున్నితమైనది. పసిబిడ్డ కంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయం శిక్షణలో తెలుసుకున్నా. ఆ విషయం గుర్తుకు రావడంతోనే ఏసీ కారు అద్దెకు తీసుకొని, చల్లటి ప్రదేశమైన హార్స్లీ హిల్స్‌కు తరలించాం" అని గిరిధర్ వివరించారు. ప్రస్తుతం హార్సిలీహిల్స్‌లో మిగతా జంతువులు పక్కనే ప్రత్యేకంగా ఎంక్లోజర్‌లో వదిలి కాపాడుతున్నట్లు ఆయన వివరించారు. "తిరుమల వెంకటేశ్వర స్వామి వారిసేవలో ప్రత్యేక స్థానం పొందిన పునుగుపిల్లిని స్పర్శించడం మధురానందం కలిగించింది" అని గిరిధర్ వ్యాఖ్యానించారు.

శేషాచలం అటవీ ప్రాంతంలో కాకుండా మదనపల్లి ప్రాంతంలో ఈ అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షం కావడంపై మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. " కలికిరి సమీపంలో ఓ నివాసం వద్ద పునుగుపిల్లి కనిపించింది. అనే సమాచారం తెలిసిన వెంటనే, మా ఎఫ్‌బి‌ఓ గిరిధర్‌ను అప్రమత్తం చేశాం" అని చెప్పారు. ఈ పునుగుపిల్లి దొరికిన సమాచారం అన్నమయ్య జిల్లా (కడప) రాజంపేట ఇన్చార్జి డిఎఫ్‌ఓ నాగమల్లేశ్వరికి తెలియజేశాం. ప్రస్తుతం ఈ పునుగుపిల్లి మదనపల్లెకు సమీపంలో ఉన్న హార్సిలీ హిల్స్‌లోని సంరక్షణ కేంద్రంలో ఉంచి, కాపాడుతున్నాం" అని ఎఫ్‌ఆర్‌ఓ మధుసూదనరెడ్డి వివరించారు. ఈ పునుగుపిల్లి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, పశువైద్యాధికారుల సూచనలు తీసుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జాతీయ జంతు ప్రదర్శనశాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

పునుగుగిన్నె సేవ

పునుగుపిల్లి తైలం సేకరించడానికి అడవిలో గాలించడం కష్టమవుతుందనే భావనతో.. తిరుమల శ్రీవారిసేవకు వినియోగం అయ్యే రెండు పునుగుపిల్లులను టీటీడీ అధికారులు తిరుపతి గో సంరక్షణశాలలో కాపాడేవారు. శేషాచలం అడవుల్లో స్వేచ్ఛగా సంచరించాల్సిన పునుగు పిల్లలను బంధించడంపై 2008లో అప్పటి తిరుపతి ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు రెడ్డి అభ్యంతరం తెలిపారు. అప్పట్లో కేసు కూడా నమోదైనట్లు సమాచారం. దీంతో తిరుపతి గో సంరక్షణ శాలలోని ఆ రెండు పునుగు పిల్లలను, తిరుపతి జంతు ప్రదర్శనశాలలకు తరలించి, ప్రత్యేక ఎంక్లోజర్లలో ఉంచి సంరక్షిస్తున్నారు.

Read More
Next Story