సీమ రక్తాక్షరిపై శాంతి సంతకం
x

సీమ రక్తాక్షరిపై శాంతి సంతకం

గత ఎన్నికల హింసాత్మక చరిత్రను 2024 ఎన్నికలు తిరగరాశాయి. రాయలసీమ జిల్లాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఒక్కచోట కూడా రీపోలింగ్ లేకపోవడమే ఇందుకు నిదర్శనం.


ముఠాకక్షలతో పదేళ్ల క్రితం వరకు రగిలిన రాయలసీమలో 2024 సార్వత్రిక ఎన్నికలు కొత్త సంతకం చేయించాయి. గత చరిత్రను పరిశీలిస్తే, రీపోలింగ్‌కు ఆస్కారం లేని రీతిలోఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కొత్తతరం అభ్యర్థులను తెరమీదకు తీసుకురావడం. వర్గ పోరాటాల నేపథ్యం కలిగిన వారు తక్కువగా ఉండటం. ఎలక్షన్ కమిషన్ పటిష్టమైన చర్యలు తీసుకోవడం వంటి కారణాలతో, కొన్ని సంఘటనలు మినహా గతంతో పోలిస్తే రక్తచరిత్రను చెరిపే దిశగా అన్ని వర్గాలు సంయమనం పాటించినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రజల్లో చైతన్యం పెరగడం, ముఠా నేతల వెంట వెళ్లేవారు లేకపోవడం. వంటి కారణాలు కూడా వర్గ పోరాటాలకు ఎప్పుడో చరమగీతం పాడేరని మాట లేకపోలేదు.

దీనిపై స్పందించిన సిపిఎం చిత్తూరు జిల్లా నాయకుడు మురళి మాట్లాడుతూ.. " ప్రజల్లో రాజకీయ చైతన్య పెరిగింది. వారి పిల్లల్లో అక్షరజ్ఞానం మరింత ఎక్కువైంది. వ్యక్తిగత జీవితం, ఉద్యోగాలు, ఊర్లో వ్యవసాయ పనులకు అంకితమైన పరిస్థితులు" మంచి మార్పు తీసుకువచ్చిందని" అన్నారు. ‘‘ఎన్నికలు కూడా వస్తువుగా మారిపోయింది. ధనస్వామ్యం పెరగడం సమాజానికి మంచిది కాదు. కులం ప్రామాణిక రాజకీయాలు పెరగడం వాంఛనీయం కాదు’’ అని గంగారం మురళి వ్యాఖ్యానించారు.

తెరపైకి కొత్త వారు

2024 సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి అధికారం నిలుపుకోవాలని వైఎస్ఆర్సిపి తహతలాడింది. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి కూటమి ఉవ్విళ్లూరుతోంది. దీంతో రెండు పార్టీల నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నుంచి, టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు కూటమి ద్వారా అభ్యర్థులను రంగంలోకి దించారు. గతానికి భిన్నంగా రెండు పార్టీలు కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించడం ప్రస్తావించదగిన విషయం. వీరి వెనక పాత కాపులైన సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఓటర్ల ఆకట్టుకోవడం పోలింగ్ శాతం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కొన్ని బూతుల వద్ద స్వల్ప సంఘటనలు జరగడం మినహాయించి తీవ్రమైన ఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు, స్థానిక పోలీసులు పారా మిలిటరీ దళాలను ఏర్పాటు చేయడం కూడా ఒక కారణమైంది.

కొన్ని చోట్ల హింస

అది ఎన్నిక అయినా సరే ముఠా కక్షలతో నిండి ఉన్న రాయలసీమలో వర్గపోరాటాలు ఎక్కువగా ఉండేవి. ఇద్దరు ఆధిపత్యం కోసం సామాన్యులు బలయ్యేవారు. రాయలసీమ జిల్లాల్లోని కడప అనంతపురం జిల్లాలో ఎక్కువగా హింస ప్రజ్వరిల్లేది. 2024 ఎన్నికల్లో ఆ పరిస్థితికి భిన్నంగా ఎన్నికల వాతావరణం కనిపించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి స్వప్రాంతమైన టి. సదుం మండలం ఎర్రతివారిపల్లెలో ముగ్గురు టిడిపి ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు శాఖ వారందరిని పీలేరులో ఉండగా గుర్తించి మళ్లీ తీసుకువెళ్లి పోలింగ్ బూత్‌లో వదిలారు.

అంటే ప్రశాంత పోలింగ్‌ కోసం ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడటంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. టిడిపి ఏజెంట్లను దుర్భాషలాడుతూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూకుడుగా వ్యవహరించడంతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాటా మాటా పెరిగి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దన్ కూడా రంగంలోకి పరిస్థితి అదుపు చేశారు ఈ దాడిలో ఒక పోలీసు ఇక్కడ గాయపడ్డారు. ఆ జిల్లా పోలీసులు తీసుకున్న పగడ్బందీ చర్యల వల్ల రక్తపాతం లేకుండా నివారించగలిగారు. అనంతపురం అర్బన్, హిందూపురం సెగ్మెంట్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కూడా దాడులు జరిగాయి. కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డి స్వప్రాంతమైన కోగటం గ్రామంలో పరస్పర దాడులకు దిగిన అప్రమత్తమైన భద్రత సిబ్బంది అధికార, విపక్ష పార్టీల మద్దతుదారులను నియంత్రించగలిగారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో పేట మండలంలో వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహించిన టిడిపి కూటమి మద్దతుదారులు కొన్ని ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మరో యంత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల అధికారులు పోలింగ్ యథావిగా నిర్వహించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్పందిస్తూ.. " వివి ప్లాట్‌లోని చిట్కాలు ఏమాత్రం ధ్వంసం కాలేదు" అని ప్రకటించడం గమనార్హం.

నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్లో "చిల్లకూరు ఎస్సై అంజిరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు" అని టిడిపి కూటమి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఆరోపించారు. ఈ సంఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సునీల్ కుమార్ తెలిపారు. తమ ఏ దేశంలో వైఎస్ఆర్సిపి నేతలకు అప్పగించడంపై నిలదీసినందుకు ఎస్సై ఈ చర్యకు పాల్పడాలని ఆయన. ఈ వ్యవహారంలో జరిగిన తోపులాటలో పోలీసులు లాఠీచార్జికి దిగారు.

ముఠా నేతలు లేకపోవడం వల్లే...

రాయలసీమలో కుటుంబాల వారసత్వంగా అందుకున్న ముఠాకక్షలతో ఉన్న నాయకులు పోటీలో లేకపోవడం ఈ ప్రశాంతతకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సంఘటనలు మినహా రాయలసీమలో ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా మారింది. ఈ అంశాలపై నెల్లూరు జిల్లా బిజెపి సీనియర్ నాయకుడు, కిరణం భాస్కర్ ఫెడరల్ ప్రజలతో మాట్లాడారు.

" సమాజ మారింది. పరిస్థితులు మారాయి. 2024 ఎన్నికలు ఓటర్ల చైతన్యానికి ప్రతిరూపం" అని చెప్పడంలో సందేహం లేదని కారణం భాస్కర్ వ్యాఖ్యానించారు. "ఫ్యాక్షన్ కు ఎవరు సిద్ధంగా లేరు. వారి వెంట వెళ్లేవారు లేకపోవడం కూడా ప్రధాన కారణమైంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం మీద గత 15 ఏళ్లు అంతకుముందు పరిస్థితులతో పోలిస్తే, రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల వర్గ పోరాటాలు లేకుండా పోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని ఆయన అన్నారు.

Read More
Next Story