పుట్టపర్తి : విశ్వప్రశాంతి వేడుకలకు 22న రానున్న రాష్ట్రపతి
x

పుట్టపర్తి : విశ్వప్రశాంతి వేడుకలకు 22న రానున్న రాష్ట్రపతి

సత్యసాయి రథోత్సవం పేరు మార్చామంటున్న సెంట్రల్ ట్రస్టీ రత్నాకర్.


పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రశాంతి నిలయానికి యాత్రికుల తాకిడి పెరిగింది. ఈ నెల 19వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ, 22వ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ. రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. వారి రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రుల కమిటీ కూడా ప్రత్యేకంగా సమీక్షించింది.

సత్యసాయి జయంతి రోజు రథోత్సవం పేరు మార్చామని పుట్టపర్తిలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ( Sri Sathya Sai Central Trust SSSCT) మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే. రత్నాకర్ సోమవారం మీడియాకు చెప్పారు.

శతజయంతి వేడుకల కోసం ప్రశాంతి నిలయాన్ని సందర్శించడానికి వస్తున్న యాత్రికులకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రత్నాకర్ తెలిపారు. ఈ నెల 16వ తేదీకి దాదాపు 40 వేల మంది భక్తులు మహా ప్రసాదంలో పాల్గొన్నారు. ప్రధాన వేడుక అయిన సత్యసాయి జయంతి 23వ తేదీ నిర్వహించడానికి భారీగా సన్నాహాలు చేశామని ఆయన వివరించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో స్వచ్ఛంద సేవకులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
రథోత్సవం పేరు మార్పు..
భగవాన్ సత్యాసాయికి జన్మనిచ్చిన పుట్టపర్తి పట్టణం ప్రధానంగా ప్రశాంతి నిలయం ఓ కర్మభూమి లాంటిదని సత్యాసాయి ట్రస్టు ప్రతినిధులు అభివర్ణించారు. గతంలో సత్యసాయి జయంతి రోజు నిర్వహించే రథోత్సవం పేరు మార్చినట్లు సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ చెప్పారు. "గతంలో శ్రీవేణుగోపాల స్వామి రథోత్సవం అని పిలుచేవాళ్లు. ఈ సంవత్సరం నుంచి శ్రీసత్యసాయి రథోత్సవంగా జరుపుకుంటారు. ఇది నవంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది" అని సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ వెల్లడించారు.
19న ప్రధాని, 22న రాష్ట్రపతి రాక
పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న హాజరు కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉపరాష్ట్రపతి సిపి. రాధాకృష్ణన్ 22వ తేదీ పుట్టపర్తికి రానున్నారు.
"ఉపరాష్ట్రపతి సిపి. రాధాకృష్ణన్ నవంబర్ 22న జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నవంబర్ 23న జరిగే సత్యసాయి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు" అని సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్య వెల్లడించారు. దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రానున్నారని ఆయన తెలిపారు.
పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే యాత్రికుల కోసం 45 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ రైళ్లకు అదనంగా వీటిని ఏర్పాటు చేశారు.
"సత్యసాయి వందో జయంతి రోజు ఆయన గౌరవార్థం 100 రూపాయల స్మారక నాణెం తోపాటు తపాలా బిళ్ల విడుదల చేస్తారు" అని సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే. రత్నాకర్ వెల్లడించారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో సత్యసాయి భక్తులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
సమన్వయంతో పనిచేద్దాం...

సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాక నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం అధికారులను కోరింది.
పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, రాష్ట్ర నోడల్ అధికారులు ఎంటి.కృష్ణబాబు, జి. వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు తదితరులతో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.
సత్యసాయి పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీసత్య సాయిబాబా శతజయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన విస్తృత ఏర్పాట్లను వివరించారు.
Read More
Next Story