
చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ఢీకొన్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు
ఆగని ప్రమాద ఘంటికలు.. ఎదురుగా ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సులు
పుంగనూరు వద్ద ప్రమాదం. 20 మందికి గాయాలు
రహదారులపై ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఒకపక్క స్వల్పంగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ జాతీయ రహదారిపై అదేమీ బ్లాక్ స్పాట్ కాదు. రాత్రి సమయం అంతకంటే కాదు. పట్టపగలే రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగానే గాయపడ్డారు.
ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు సమీపంలో వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన తర్వాత జరుగుతున్న ప్రమాదాల వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లా పలమనేరు డిపో చెందిన రెండు ఆర్టీసీ అద్దె బస్సులు పుంగనూరు సమీపంలోని గూడూరు పల్లె వద్ద ప్రమాదానికి గురయ్యాయి. అందులో ఒక బస్సు పలమనేరు నుంచి మదనపల్లెకు బయలుదేరింది. ఇంకో బస్సు మదనపల్లి నుంచి పలమనేరు కు ప్రయాణికులతో వస్తుంది.
పుంగనూరు మార్గంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం వర్షం స్వల్పంగానే కురుస్తోంది. మంచుతెరలు కూడా అడ్డు లేవు. ట్రాఫిక్ కూడా అంతగా లేని పరిస్థితుల్లో ఈ రెండు అద్దె బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం అందింది. ఘటనపై ఫోన్ కాల్ అందుకున్న 108 వాహన సిబ్బంది బాధితులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా సంఘటన ప్రదేశాన్ని సందర్శించారు. పుంగనూరు వద్ద రెండు ఆర్టీసీ అద్దె బస్సులు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లు కూడా స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది.
"ఆ రెండు బస్సులు తమ డిపోకు సంబంధించినవి కావు" అని మదనపల్లి డిపో మేనేజర్ అమర్నాథ్ చెప్పారు.
"తుఫాను కారణంగా ట్రాఫిక్ తక్కువ ఉంది. అందువల్ల కొన్ని సర్వీసులు తగ్గించాము. మినహా ఏ మార్గంలోనూ బస్సులు రద్దు చేయలేదు" అని డిపో మేనేజర్ అమర్నాథ్ తెలిపారు. తంబళ్లపల్లె సమీపంలోని పెద్దేరు నది వద్ద వరద నీటి ఉధృతి వల్ల రాకపోకలు ఆగాయని ఆయన వివరించారు.
Next Story

