Assembly Committee | సేద్యానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి
x
తిరుపతి: అధికారులతో భేటీ అయిన శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్, సభ్యులు

Assembly Committee | సేద్యానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి

అభివృద్ధి పనుల కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు గుర్తించాలని శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సూచనలు చేసింది.


రాష్ట్రంలో వినియోగదారులకు ప్రధానంగా వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాల్లో నష్టపోయే వారికి త్వరగా పరిహారం చెల్లించాలని కూడా ఆయన ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు.

చైర్మన్ కూన రవికుమార్ సారధ్యంలోని పదిమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ తిరుపతిలోని పద్మావతి అతిధి గృహంలో మంగళవారం ఏపీ ట్రాన్స్కో, తిరుపతి స్మార్ట్ సిటీ, పర్యాటకశాఖ, టీటీడీ అధికారులతో భేటీ అయింది.

ఏపీ ఎస్పీడీసీఎల్ (Andhra Pradesh Southern Power distribution company limited), ఆంధ్రప్రదేశ్ (పర్యాటక శాఖ (AP tourism), తిరుపతి నగరపాలక సంస్థలోని స్మార్ట్ సిటీ‌ (Tirupati Smart City) అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
2022 - 23, 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ సారధ్యంలోని కమిటీ సమీక్షించింది.
"విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలను అందించాలి" కూన రవికుమార్ సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆయన ట్రాన్స్కో అధికారులకు సూచన చేశారు. రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో స్తంభాలు మార్చే అవకాశం లేకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని గుర్తు చేశారు.
ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
"ఏపీఎస్పీడీఎస్ ఎల్ పరిధిలో ఓవర్ లోడ్ ఉన్న ఫీడర్లను గుర్తించండి. ఆ సమస్యను అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటూ, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయండి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో జాప్యం జరగడానికి ఆస్కారం ఉండకూడదు. రైతుల కోరిన వెంటనే కనెక్షన్లు ఇవ్వండి" అని కూన రవికుమార్ స్పష్టమైన సూచనలు చేశారు. విద్యుత్ వల్ల ప్రమాదాల్లో మనుషులు, పశువుల మరణంతో నష్టం జరిగితే ఆ కుటుంబాలకు వెనువెంటనే పరిహారం చెల్లించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి అని రవికుమార్ ఆదేశించారు.
సూర్యఘర్ విస్తృతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్య ఘర్ అనే కేంద్ర ప్రభుత్వ పథకానికి విస్తృత ప్రాచుర్యం కల్పించాలని కూన రవికుమార్ ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ పథకంలో సోలార్ ఎనర్జీకి మరింత ప్రధాన ఇస్తూ ఈ ప్రాజెక్టును సఫలం చేయడానికి శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
తిరుపతి స్మార్ట్ సిటీపై సమీక్షించిన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ తిరుపతి నగరపాల సంస్థ అధికారులకు ప్రత్యేక సూచనలు చేసింది.
"పురోగతిలో ఉన్న 14 ప్రాజెక్టులకు నిధులు సమీకరణ కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను గుర్తించాలి" అని సూచించారు. పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణ కూడా సజావుగా సాగే విధంగా శ్రద్ధ తీసుకోవాలని కమిటీ చైర్మన్ కూన రవికుమార్ నగర పాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్యకు సూచించారు.
ఆధ్యాత్మికంగా, పర్యాటక రంగ అభివృద్ధికి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఉన్న ప్రత్యేకతను కమిటీ గుర్తు చేసింది. ఈ జిల్లాలకు కొత్తగా రాబోయే ప్రాజెక్టులపై కూడా సమీక్షించారు. పర్యాటకులను మరింతగా ఆకుట్టుకుని, ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా ప్రణాళికలు ఉండాలని కమిటీ చైర్మన్ సూచన చేశారు.
టీటీడీ (Tirumala Tirupati devasthanam) కి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ప్రత్యేకంగా గుర్తు చేసింది. దెబ్బతిన్న టిటిడి కళ్యాణ మండపాలను కూడా గుర్తించి వాటికి మరమ్మతులు చేయించాలని కూడా ప్రత్యేకంగా సూచన చేశారు.
యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయాలు, చేస్తున్న ఏర్పాట్లపై టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదన పీఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి జెఈఓ వీరబ్రహ్మం వివరించారు. అంతకుముందు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లాలో మూడు విభాగాలకు సంబంధించిన పురోగతిని కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కే సంతోష రావు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి ఇతర అధికారులు ఈ సమీక్షలో కమిటీకి వివరాలు అందించారు.
Read More
Next Story