శ్రీవారిసేవకు ప్రొఫెషనల్ మెరుగులు
x
తిరుమల ఆలయం వద్ద శ్రీవారి సేవకులు (ఫైల్)

శ్రీవారిసేవకు ప్రొఫెషనల్ మెరుగులు

24వ తేదీ నుంచి మొదటి బ్యాచ్ కు శిక్షణ ప్రారంభిస్తామంటున్న ఈఓ శ్యామలరావు.


టీటీడీలో స్వచ్ఛంద సేవలు అందిస్తున్న "శ్రీవారిసేవ" ప్రొఫెషనల్ మెరుగులు దిద్దనున్నది. దీనికోసం అహ్మదాబాద్ ఐఐఎం నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా విభాగం పాఠ్యాంశాలు మాడ్యూల్స్ సిద్ధం చేసింది. ఆ మేరకు మొదటి బ్యాచ్ శిక్షణ ఈ నెల 24వ తేదీ ప్రారంభించాలని ముహూర్తంగా నిర్ణయించారు.

శ్రీవారి సేవకులకు అధునాతన శిక్షణ ఇచ్చే అంశంపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శుక్రవారం సాయంత్రం ఈఓ జే. శ్యామలరావు సమీక్షించారు. ఈ సమావేశానికి టీటీడీ అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ప్రణాళికా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఐఐఎం అహ్మదాబాద్ ప్రొఫెసర్లు విశ్వనాథ్, రామ్ మోహన్ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. ప్రొఫెషనల్ సేవకులుగా తీర్చిదిద్దడానికి తయారు చేసిన ప్రణాళికను వారు ఈ సమావేశంలో వివరించారు.

శిక్షణ మాడ్యూల్ ఇదీ..
రాష్ట్ర ప్రణాళికా విభాగానికి చెందిన నలుగురు సభ్యుల పరిశోధన బృందం, గ్రూప్ సూపర్‌వైజర్లు, సేవక్ ట్రైనర్ల కోసం తయారు చేసిన శిక్షణ మాడ్యూల్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆధ్యాత్మిక సేవా మూలాలు, శ్రీవారిసేవ తత్వశాస్త్రం, పరిణామం, సేవా ఆవశ్యకతలు - పాత్రలు, స్థానాలు, ప్రోటోకాల్‌, ప్రత్యేక సందర్భాలలో సేవ చేయడం, ప్రభావవంతమైన సేవ కోసం కార్యాచరణ, ఆచరణాత్మక నైపుణ్యాలు, ప్రేరణాత్మక నాయకత్వం, మార్గదర్శకత్వం, సాఫ్ట్ స్కిల్స్ - ఆదర్శ సేవక్ లక్షణాలు, ప్రాథమిక బహుభాషా నైపుణ్యాలపై పరిశోధన బృందం సభ్యలు వివరించారు.
దరఖాస్తులు స్వీకరణ
అంతకుముందు ఈ సమావేశంలో ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ,
"శ్రీవారిసేవ శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ టీటీడీ ఈ నెల మూడో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది" అని ఈఓ శ్యామలరావు తెలిపారు. శ్రీవారిసేవలో నాణ్యతను పెంచాలని సీఎం ఎన్. చంద్రబాబు సూచనల మేరకు సంస్కరణలు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రూప్ సూపర్‌వైజర్లు, సేవక్ ట్రైనర్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్ సైట్ కూడా ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాధారణ వలంటీర్లకు టీటీడీ ద్వారా శిక్షణ తీసుకున్న సేవకులు, సూపర్ వైజర్లు వారి ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. దీనికోసం దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన నిపుణులను కోరారు.
మొదటి బ్యాచ్ శిక్షణ
డిగ్రీ అర్హతగా దరఖాస్తులు సమర్పించే సేవకులను ఎంపిక చేసి సుక్షణకు ఎంపిక చేస్తామని ఈఓ శ్యామలరావు తెలిపారు. మొదటి బ్యాచ్ శిక్షణ ఈ నెల 24న ప్రారంభం అవుతుందని తెలిపారు. మధ్యాహ్నం సెషన్లలో సైద్ధాంతిక శిక్షణ, వివిధ సేవా కేంద్రాలకు ఫీల్డ్ సందర్శన చేయిస్తామన్నారు. తిరుమలలో ఆ ప్రాంతాలను సందర్శించడం వల్ల శ్రీవారి సేవకుల సేవా కార్యకలాపాలను బాగా అర్థం చేసుకోవడానికి ఉంటుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టిటిడి చీఫ్ పిఆర్‌ఓ డాక్టర్ టి. రవి, డిఎఫ్‌ఓ జిఎం ఐటి ఇంచార్జ్ ఫణికుమార్ నాయుడు, ఆల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్, స్వేతా డైరెక్టర్ ఇంచార్జ్ రాజగోపాల్ పాల్గొన్నారు.
Read More
Next Story