రుయాలో చస్తే... అయినోళ్లకూ చావే..!
x

రుయాలో చస్తే... అయినోళ్లకూ చావే..!

ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేటు అంబులెన్స్ తీరు దారుణంగా ఉంటుంది. వారి ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. సిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఇందుకు భిన్నమైన వాతావరణం.


"అక్కడ వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఇక్కడ అయినోళ్ల అంతరాత్మలు రోధిస్తున్నాయి" ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తే మృతదేహాలను తీసుకువెళ్లడం ఉన్నోళ్ళ చావుకు వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్స్‌ల డ్రైవర్ల తీరు కన్నీరు పెట్టిస్తోంది.

తిరుపతి ఆధ్యాత్మిక నగరం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి రోజూ 70 వేల నుంచి 90 వేల మంది వచ్చి వెళుతుంటారు. యాత్రికుల సేవలో ఆటోలు, టాక్సీలు, జీపుల ద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ రోగులను, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచే మృతదేహాలను అంబులెన్స్‌ల ద్వారా తరలించే విభిన్నమైన వృత్తిలో కూడా అధిక సంఖ్యలోనే ప్రజలు ఉన్నారంటే అభినందించక తప్పదు. కానీ, కొన్ని సంఘటనల్లో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.

రాయలసీమకు తలమానికం

చిత్తూరు జిల్లా తిరుపతిలోని పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( స్విమ్స్), ఈ ఆవరణకు సరిహద్దులోనే శ్రీవెంకటేశ్వర రామ్ నారాయణ రుయా (ఎస్విఆర్ఆర్) ఆసుపత్రి ఉంది. 1500 పడకలతో 1968లో ఏర్పాటుచేసిన ఈ ఆసుపత్రికి చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. 27 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, 25 ఐసీయూలు, పది రకాల స్పెషాలిటీ వైద్య సేవలతో రోగులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తోంది రుయా ఆసుపత్రి.

క్రిటికల్ కేసులను 120 కిలోమీటర్ల దూరంలోని చెన్నైలోని వేలూరు సిఎంసి ఆసుపత్రికి రెఫర్ చేస్తూ ఉంటారు. లేదంటే సంబంధిత రోగులను ఆ ప్రాంతాలకు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తారు. వారిని తరలించడానికి లేదా, ఆరోగ్యం క్షీణించి మరణిస్తే మృతదేహాలను వారి స్వప్రాంతాలకు తరలించడానికి ఆ ఆసుపత్రుల ఆవరణలో ఉండే ప్రైవేట్ అంబులెన్స్‌లే దిక్కు. అలాంటి సమయాల్లో ఆ అంబులెన్స్‌ల డ్రైవర్ల తీరు బాధితులను తీవ్రంగా వేధిస్తోంది.




ప్రైవేటు సరిహద్దు

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉండే అంబులెన్స్ ఆపరేటర్లపై నియంత్రణ ఉంది. రుయా ఆసుపత్రి వద్ద ఆ పరిస్థితి లేదు. ఇదే పేద రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఉదాహరణకు రుయా ఆసుపత్రిలో రోగి మరణిస్తే, ప్రైవేటు వాహనం లేదా సొంత వాహనంలో మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించడం లేదు. అంతేకాదు, సమీపంలోని స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉండే అంబులెన్స్‌ను అనుమతించరు. దీంతో మరణించిన వ్యక్తుల సంబంధీకులు నరకయాతన అనుభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఇదో సాక్ష్యం..

"ఆయన పేరు హెచ్. గోపీనాథ్. డిప్యూటీ కలెక్టర్. డ్యూటీ నిమిత్తం కడప జిల్లాకు వెళ్లిన ఆయన అధికారిక వాహనంలో తిరుపతికి వస్తున్నారు. మామండూరు అడవి ప్రాంతంలో ప్రమాదానికి గురై మరణించారు. ఆయన మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శవపంచనామా పూర్తయింది. గోపీనాథ్ మృతదేహాన్ని అనంతపురం జిల్లా హిందూపురం తరలించడానికి వాహనం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులని తెలిసి కూడా, రుయా ఆసుపత్రిలోని ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకున్నారు. మా వాహనంలోనే తీసుకుని వెళ్లాలి అని పట్టుబట్టారు. అప్పటి తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి కూడా వారికి నచ్చజెప్పడానికి విఫల యత్నం చేశారు. మరో సంఘటనలో కూడా బాధితులకు ఇదే అనుభవం ఎదురయింది.

"కడప జిల్లా రైల్వే కోడూరు తాలూకా చిట్వేలి మండలానికి సమీపంలోని ఓ బాలుడి రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. తాము ఏర్పాటు చేసుకున్న వాహనంలో తీసుకెళ్లడానికి ఆ పేదలు ప్రయత్నించారు. అప్పుడు కూడా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకున్నారు. బాలుడి కుటుంబం కన్నీటి పర్యంతం అవుతున్నా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు కనికరించలేదు. గత్యంతరం లేక.. 70 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై బాలుడి మృతదేహాన్ని తీసుకువెళ్లారు"

10 కిలోమీటర్లకు రూ.3 వేలు

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఒక వ్యక్తి మరణించాడు. మృతదేహాన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంటకు తీసుకువెళ్లాలి. అక్కడి అంబులెన్స్ డ్రైవర్లు కు.3వేలు డిమాండ్ చేశారు. భరించలేని మృతుడి సంబంధికులు ప్రైవేటు వాహనం తీసుకువచ్చారు. ఆగ్రహించిన రుయా ఆసుపత్రి ఆవరణలోని అంబులెన్స్ డ్రైవర్లు ఆ వాహనం డ్రైవర్‌ను కొట్టినంత పని చేశారు. స్థానికులు కూడా తిరగబడ్డారు. వ్యవహారం పోలీసుల వద్దకు వెళ్ళింది. అప్పటికి గాని పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పటివరకు వెలుగు చూసిన ఘటనల్లో ఇవి మచ్చుకు మాత్రమే. వెలుగులోనికి రానివి చాలా ఉన్నాయి.

రంగంలోకి పోలీసులు

ఈ ఘటనల నేపథ్యంలో అప్పటి తిరుపతి ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి రంగంలోకి దిగారు. రుయా ఆసుపత్రి వద్ద రోడ్డుపైనే ఫాలో అన్ చేయించిన అంబులెన్స్ డ్రైవర్లకు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. "చనిపోయిన వ్యక్తుల కుటుంబీకులను వేధించిన, మృతదేహాలు తీసుకుని వెళ్లకుండా అడ్డగించిన. చర్యలు తీవ్రంగా ఉంటాయి" అని చేసిన హెచ్చరికలు కొద్దిరోజులు పనిచేశాయి. ఎస్పీ రమేష్ రెడ్డి ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రుయా ఆసుపత్రి వద్ద ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. రుయా ఆసుపత్రి అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోతున్నట్టు తెలుస్తోంది.




స్విమ్స్ ఆవరణలో మరో రకం

టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించే స్విమ్స్ ఆస్పత్రిలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉంది. ఇదే ఆవరణలో బర్డ్స్ ఆసుపత్రి కూడా దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది. కృత్రిమ కాళ్ల తయారీ, వైకల్యంతో బాధపడే వారికి సేవలు అందించడంలో మేటిగా ఉండడమే కాకుండా, దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కీళ్లు, ఎముకల వైద్య నిపుణులు స్వచ్ఛందంగా సేవలందించడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆస్పత్రుల ఆవరణలోని ప్రైవేట్ అంబులెన్స్‌ల సర్వీసులు స్విమ్స్ యంత్రాంగం నియంత్రణలో ఉన్నాయి. ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీస్ సొసైటీగా ఏర్పడ్డారు. ఇందులో గొప్ప ఏమిటి అనుకుంటున్నారా?

రవాణా చార్జీ ఫిక్స్

స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో 17 అంబులెన్స్లు ఉన్నాయి. దూరాన్ని రామాణికంగా తీసుకొని చార్జీలు కూడా నిర్ణయించి, ఆసుపత్రి ఆవరణలో పెద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న అంబులెన్స్‌లలో ఓమిని వ్యాన్లు 14, వెంటిలేటర్‌తో పాటు సహాయకుడు వెంట రావడానికి వీలైన మూడు పెద్ద అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి సమీప ప్రాంతాలు, కడప, తమిళనాడులోని చెన్నై, వేలూరు సిఎంసి, అనంతపురం, కర్నూలు ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి ఆరోగ్యం క్షమించిన వారిని లేదా మరణించిన వారి మృతదేహాలను తీసుకొని వెళుతుంటారు.

సొసైటీ ఏర్పాటుకు ఒప్పందం

రిమ్స్ ఆస్పత్రి టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ సొసైటీ ఏర్పడడం వెనక ఆసుపత్రి యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఆస్పత్రిలో వాహనాలు నిలుపుకునేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రకారం "ఎవరైనా చనిపోతే ఉచితంగా ఆ మృతదేహాన్ని వారి స్వప్రాంతానికి చేర్చాలి" అది అగ్రిమెంట్. "ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పొందుతున్న రోగి మరణిస్తే, 100 కిలోమీటర్ల దూరంలోని వారి ఊర్లకు తరలించడానికి" ఇక్కడి అంబులెన్స్ డ్రైవర్లు వారి వాహనాలతో సిద్ధంగా ఉంటారని స్విమ్స్ సెక్యూరిటీ విజిలెన్స్ సేఫ్టీ ఆఫీసర్, ఇంచార్జ్ ట్రాన్స్పోర్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్ డి. ఇలంగోరెడ్డి.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.

స్విమ్స్ ఆస్పత్రి నుంచి అత్యవసర కేసులు, మృతదేహాలు తరలించడానికి చార్జీలు నిర్ణయించారు. ఈ అంశంపై పాలిటెక్నిక్ డిప్లమో చదివి కూడా అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలందిస్తున్న టి ప్రసాద్ ఏమంటున్నారంటే.. "ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. తర్వాత ఆటో నడిపా. నచ్చలేదు. ఇక్కడ పేదలకు అందించే సేవలో ఆత్మ సంతృప్తి ఉంది. మృతదేహాలను సంబంధిత ఊర్లకు తీసుకెళ్లినప్పుడు కూడా, మేము పీడించం. వెయ్యి లేదా రెండు వేల తక్కువ ఉన్నా. మారు మాట్లాడకుండా వచ్చేస్తాం. అందువల్లే మాపై ఆరోపణలు, విమర్శలు లేవు" అని ప్రసాద్ అన్నారు.




ఓ సంఘటన చూసి మాకే కన్నీళ్లు వచ్చాయి. మా ఓనర్ కూడా వాహనం తీసుకుని వచ్చేయమని చెప్పాడంటూ కిషోర్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. "కర్నూలు జిల్లా కొడవలూరుకు చెందిన బాలిక స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అంబులెన్స్‌కు రెండు వేలు పెట్టి డీజిల్ పోయించారు. ఆమె మృతదేహాన్ని వాళ్ళ ఊరికి తీసుకునీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక, అక్కడ చందాలు చేస్తున్నారు. నాకు అద్దే చెల్లించలేదు. ఎక్కువ ఆలస్యం కావడంతో మా ఓనర్ ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాను. వెంటనే మా ఓనర్ చెప్పింది ఒకటే, వాళ్ల దగ్గర ఇంకా ఒక పైసా తీసుకోవద్దు. వెంటనే వచ్చేయమన్నారు" అని కిషోర్ వివరించారు. ఇలా ఎన్నోసార్లు ముందుగానే మాట్లాడుకున్న అద్దె కూడా తీసుకోకుండా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని తన అనుభవాన్ని పంచుకున్నారు.

తిరుపతిలో దర్జాగా బతకడానికి ఆటో నడపవచ్చు. యాత్రికులను తిరుమలకు తరలించవచ్చు. తద్వారా మంచి ఆదాయం పొందడానికి మార్గాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, " శవాల కోసం ఎందుకు నిరీక్షిస్తున్నారు"? అన్న ఫెడరల్ ప్రతినిధి ప్రశ్నకు డ్రైవర్ రవికుమార్ చాలా నింపాదిగా స్పందించారు. "మీరు చెప్పింది నిజమే సార్. వేధించి, పీడించి సంపాదించే సొమ్ముతో సంతృప్తి ఉండదు. ఇక్కడ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గానే 15 ఏండ్లుగా సేవలు అందిస్తున్నా. ఇది మాకు నిజమైన తృప్తిని ఇస్తుంది" అని రవికుమార్ వ్యాఖ్యానించారు.

ఇప్పుడున్న వాహనాల్లో సీరియల్ ప్రకారం రోగులను లేదా మృతదేహాలను తరలిస్తుంటారు. యజమానులు, డ్రైవర్ల మధ్య సమన్వయం ఉంది. " అందుకే మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు" అని మరో డ్రైవర్ రాజా చెప్పారు. ఒక విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు. స్విమ్స్ ఆవరణలోని అంబులెన్స్‌లు పక్కనే ఉన్న రుయా ఆసుపత్రిలోకి అనుమతించరు’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు. మేము కూడా అక్కడికి వెళ్లే సాహసం చేయమని వారంతా ముక్తకంఠంతో చెప్పారు.

దీనివల్ల రుయా ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేట్ అంబులెన్స్‌ల యజమానుల పెత్తనం ఎక్కువగా ఉందనే విషయం స్పష్టమైనది. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్.. పోలీసు అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటే మినహా ఇక్కడ కూడా పేద రోగులకు వేదన నుంచి విముక్తి లభిస్తుంది అనడంలో సందేహం లేదు.

Read More
Next Story