శ్రీవారి దర్శనంతో పాటు సామాన్యులకు మధురమైన సేవలు అందిస్తాం..
x

శ్రీవారి దర్శనంతో పాటు సామాన్యులకు మధురమైన సేవలు అందిస్తాం..

ఫెడరల్ ప్రతినిధితో ముఖాముఖిలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్


శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేయడం ద్వారా సామాన్య యాత్రికులకు మంచి దర్శనం కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామని, వీఐపీ బ్రేక్ దర్శనానికి స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేశాం. బ్రహ్మెత్సవాల్లో గరుడసేవ మినహా రోజూ 25 వేల వంతున 1.16 లక్షల SSD టోకెన్లు తిరుపతిలో జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లోని యాత్రికుల కోసం సూక్ష్మ, క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేశామని ఈయన ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ నెల 23వ తేదీ రాత్రి అంకురార్పణ తరువాత 24వ తేదీ రాత్రి పెదశేషవాహనంతో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప పల్లకీపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీస్ శాఖతో టీటీడీని సమన్వయం చేయడం ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఈఓ సింఘాల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రహ్మెత్సవాల్లో యాత్రికులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు కొరత లేకుండా ఎనిమిది లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుమలలో యాత్రికులకు 3,500 గదులు ఆఫ్ లైన్ లోనే అందుబాటులో ఉంటాయన్నారు.
60 మెట్రిక్ టన్నుల పువ్వులతో అలంకరణ
తిరుమల ఆలయం, సంపంగి ప్రాకారం, ఆలయ పరిసరాలను అలంకరించడానికి 60 మెట్రిక్ టన్నుల పువ్వులు వినియోగిస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
"పువ్వుల కోసం 3.50 కోట్ల రూపాయలు, సివిల్ ఇంజినీరింగ్ పనులకు 9.50 కోట్లు, విద్యుద్దీపాలంకరణకు 5.50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం" అని సింఘాల్ వెల్లడించారు.
తిరుమల మాడవీధుల్లో వాహనసేవలు చూసేందుకు నిరీక్షించే యాత్రికుల నుంచి అభిప్రాయాలు సేకరించడానిిక ప్రత్యేకంగా శ్రీవారి సేవకులను నియమించనున్నట్లు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వారి అభిప్రాయాల మేరకు తిరుమలలో మరిన్ని మార్పులు తీసుకుని రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు.
" గరుడసేవ రోజు యాత్రికులు 14 రకాల వంటకాలు సిద్ధం చేస్తాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది" అని సింఘాల్ వెల్లడించారు. తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమారు 4000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు కూడా దృష్టి సారించామన్నారు.
"తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయించాం" అని వివరించారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"తిరుమలలో యాత్రికుల రద్దీని 300 వందల సీసీ కమెరాల ద్వారా పర్యవేక్షించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికోసం రద్దీ నియంత్రణకు ఆరువేల మంది పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రంగంలో ఉంటారు. గరుడోత్సవం రోజు అదనంగా 1,300 మంది పోలీసులు విధుల్లో ఉండే విధంగా కార్యచరణ సిద్ధం చేశాం" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
గతంతో పోలిస్తే, వాహన సేవలకు ముందు ఈ ఏడాది 28 రాష్ట్రాల నుంచి 298 బృందాల ప్రదర్శనలు ఉంటాయన్నారు. గరుడసేవ రోజు 20 రాష్ట్రాల నుంచి 37 బృందాలు సంప్రదాయ, ఆధ్యాత్మిక కళారూపాల ప్రదర్శనలకు అవకాశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు.
Read More
Next Story