
'సీమ'లో మైలురాయిలా నిలిచిన ప్రధాని పర్యటన..
కర్నూలు అభిమానానికి మురిసిన ప్రధాని మోదీ
కర్నూలు నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ నగరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ర్యాలీ ఓ మైలురాయిలా నిలిచింది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో ఐదోసారి పర్యటన గురువారం సాగించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టిడిపి కూటమి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని రోజులకు ముందు నుంచే తీవ్ర స్థాయిలో కసరత్తు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కర్నూలులోని నాలుగు రోజుల నుంచి మోహరించింది.
"రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమీకరించడం, ఎన్డీఏ కూటమి ఐక్యతను చాటే విధంగా కార్యక్రమాలు అమలు చేశారు.
నన్నూరు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కరతాళ ధ్వనులు మిన్నంటుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వేదిక పైకి చేరుకున్నారు.
కర్నూలులో మోది మొదటిసారి
టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాయలసీమలో అది కూడా కర్నూలు నగరానికి మొదటిసారి వచ్చారు. ఈ పర్యటన ప్రధాని మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్. మాధవ్ సారథ్యంలోని పార్టీ శ్రేణులు, అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
అభివాదంతో
కర్నూలు నగరంలో ఒకరోజు పర్యటన కోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ నన్నూరు వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో టాప్ లేని వాహనంపై నిలబడి రోడ్ షో నిర్వహించారు. ప్రధాని ఎడమ చేతి వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కుడి చేతి వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ స్వాగతం పలుకుతున్న వారందరికీ అభివాదం చేస్తూ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
చిరు దరహాసం..
రోడ్ షో నిర్వహించే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు చేతులు పైకెత్తి అభివాదం చేస్తుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విక్టరీ సింబల్ చూపిస్తూ జనాన్ని పలకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సహజ శైలిలో ముకుళిత హస్తాలతో దండం పెడుతూ ఆనందంతో అభివాదం చేశారు. నన్నూరు సభా వేదిక మొత్తం లక్షలాదిమంది ప్రధాని సభ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దాదాపు మూడు లక్షల మంది హాజరైనట్టు కూటమి నాయకులు ప్రకటించారు.
తనను ఆహ్వానిస్తూ జాతీయ జెండాలు ప్రదర్శిస్తున్న ప్రజానీకాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ పరవశించారు. చిరునవ్వుతో వారందరికీ అభివాదం చేస్తూ సాగించిన ఆయన పర్యటన కూటమి నేతలకు సంతృప్తి కలిగించింది.
Next Story