
తమిళనాడులోని వేలూరు శ్రీపురం వద్ద ఉన్న బంగారు గుడి. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్మును స్వాగతిస్తున్న కలెక్టర్, ఎస్పీ (ఫైల్)
17న రాష్ట్రపతి ముర్ము తిరుపతి పర్యటన
వేలూరు బంగారుగుడి సందర్శనపై అధికారుల సమీక్ష
తిరుపతి జిల్లా పర్యటనకు ఈ నెల 17వ తేదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా 16వ తేదీ నుంచి రెండు రోజులు పర్యటించనున్నారు. వారి పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లపై సోమవారం సమీక్షించింది.
రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఉదయం ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ (ఎ.ఎస్.ఎల్) అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడుతో కలిసి తిరుపతి జల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ అధికారులతో సమీక్షించారు. భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్ పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం లేకుండా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.
రాష్ట్రపతి పర్యటన ఇలా..
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 17వ తేదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, అధికారులు ఆమెకు స్వాగతం పలుకుతారు. ఆ తరువాత ఇక్కడి నుంచి హెలికాప్టర్ లో వేలూరుకు బయలుదేరి తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా శ్రీపురం వద్ద ఉన్న శ్రీలక్మ్షీ నారాయణి (మహాలక్ష్మి అమ్మవారు బంగారు గుడి), అక్కడి నారాయణి పీఠం సందర్శించనున్నారు. శ్రీపురంలోని స్వర్ణ దేవాలయం దర్శనం తరువాత తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు వెళతారు.
ఏర్పాట్లపై సమీక్ష
రాష్ట్రపతి ద్రౌపదీముర్మును స్వాగతించడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ 16వ తేదీ తిరుపతికి చేరుకుంటారు. ఆయన రెండు రోజులు ఉంటారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. వారి పర్యటనల నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రాయంలో కల్పించాల్సిన సదుపాయాలు, వసతులపై ఆయన అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.
"గవర్నర్, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు. సేఫ్ రూమ్, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, అవసరమైన రక్తం గ్రూపులు, మందులు అందుబాటులో ఉంచండి" అని కలెక్టర్ సూచించారు. అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజిన్‌లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖులకు అందించే ఆహారాన్ని నిబంధనల మేరకు పరీక్షించాలని ఆదేశించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. కాన్వాయ్ వాహనాలు మంచి కండీషన్‌లో ఉండేలా ముందుగానే పరిశీలించాలని తెలిపారు.
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.
ప్రముఖులకు భోజనం, తగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రోటోకాల్ అంశాలు, కేటాయించిన విధుల్లో అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎస్ఓను సూచించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ, పోలీస్ శాఖ తరపున బందోబస్తు కట్టుదిట్టంగా ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాస రావు, నాగభూషణ రావు, వెంకటరాముడు, శ్రీకాళహస్తి ఆర్‌డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్‌ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, ఐబీ అధికారి శిరీషా, డీఎస్పీలు రామకృష్ణాచారి, చంద్రశేఖర్, భక్తవత్సలం, రామకృష్ణ, చిరంజీవి, ప్రసాద్, రాంబాబు, అంకారావు, వెంకటనారాయణ, డీఎఫ్‌ఓ రమణయ్య తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Next Story

