
శ్రీవారి దర్శనంలో క్షేత్ర సంప్రదాయం ఆచరించిన రాష్ట్రపతి
తిరుమల ఓ దృశ్య కావ్యం అనేది ద్రౌపదీ ముర్ము మదిలో మాట..!
శ్రీవారిని దర్శనం తరువాత ఆలయం వెలుపల రాష్ట్రపతి ద్రౌపదీముర్ము యాత్రికుల వద్దకు వెళ్లి, పిల్లలకు చాక్లెట్లు పంచిన దృశ్యం ప్రత్యేకంగా కనిపించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము క్షేత్ర సంప్రదాయాన్ని పాటించారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడానికి ముందే ఆమె శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఇలా చేయడం వల్ల తిరుమల యాత్ర సంపూర్ణం అవుతుందనే చారిత్రక స్కంద పురాణం నేపథ్య కథనాన్ని ఆమె అనుసరించారు. శ్రీవారి దర్శనానికి సరిగ్గా పది గంటలకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము 45 నిమిషాలు ఆలయంలో దర్శనం, రంగనాయకుల మండపంలో గడిపారు.
శ్రీవారి ఆలయం చెంత..
తిరుమల వరాహస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము టిటిడి ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి ముర్ము శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.
శ్రీవారి దర్శనం తరువాత రంగనాయకుల మండపంలో రాష్ట్రపతి ముర్ముకు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈఓమ శ్రీవారి చిత్ర పటాన్ని తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, జీ. భానుప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆసక్తికరంగా సాగిన పర్యటన
తిరుమలలో గురువారం రాత్రి పద్మావతీ అతిథిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం విభిన్నంగా కనిపించిన వాతావరణాన్ని రాష్ట్రపతి ముర్ము ఆస్వాదించారు. శీతాకాలం ప్రారంభానికి ముందు అల్పపీడనం వల్ల వాతావరణంలోని మార్పులు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం నుంచి కమ్ముకున్న మంచుతెరలు వీడలేదు. ఓ పక్క తుంపర్లుగా వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో శ్రీవారి క్షేత్రంలో సామాన్య యాత్రికుల సంచారం, వాతావరణాన్ని మరోసారి ద్రౌపదీ ముర్ము ఆసక్తికరంగా పరిశీలించారు. వాహనంలో ప్రయాణించే సమయంలో రాత్రి కనిపించిన వాతావరణం, పగటి పూట ఎలాంటి మార్పులు ఉంటున్నాయనేది ఆమె ఆసక్తికరంగా చూస్తూ సాగారు.
తిరుమలలో గురువారం రాత్రి...
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దర్శనం తరువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సాయంత్రం ఐదు గంటలకు తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పి ఎల్ సుబ్బారాయుడు ఘన స్వాగతం పలికారు. తిరుమల పద్మావతి అతిథి గృహాల సముదాయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురువారం రాత్రి బస చేశారు.
తిరుమల క్షేత్ర సంప్రదాయం...
తిరుమల లో శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు యాత్రికులు మొదట శ్రీలక్ష్మి వరాహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలనేది స్కంద పురాణం చెబుతున్న కథనం. వరాహక్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుంటే తిరుమల యాత్ర పరిపూర్ణం అవుతుందనేది పురాణాలు చెబుతున్న మాట. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి ఉత్తర మాడవీధిలో తూర్పు ముఖంగా శ్రీవరాహస్వామి ఆలయం ఉంది.
తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి ఉండడానికి స్థలం ఇవ్వడానికి వరాహస్వామి అనుగ్రహించారు. దీంతో వరాహస్వామి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఆ మేరకు తామ్రపత్రం (రాగి రేకు)పై శ్రీవెంకటేశ్వరస్వామి రాసి ఇచ్చారు. బ్రహ్మలిపిలో ఉండే ఆ శాసనం (రాగి రేకు) ఇప్పటికీ వరాహస్వామి ఆలయం గర్భగుడిలో ఉంది.
దృశ్యాలను ఆస్వాదిస్తూ...
తిరుమలలో గురువారం తెల్లవారింది. మంచుతెరలు వీడలేదు. చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. తుంపర్లుగా వర్షం కురుస్తోంది. పద్మావతి అతిథి గృహంలో బస చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీవారి దర్శనానికి సిద్ధమయ్యారు. పద్మావతీ వీవీఐపీ అతిథి గృహాల సముదాయం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శంఖుమిట్ట సర్కిల్, లేపాక్షి సర్కిల్ మీదుగా రాంబగీచ అతిథి గృహాల సముదాయం సమీపంలోని వాహన మండపం వద్దకు కాన్వాయ్ చేరుకుంది. ఈ మార్గంలో రెండు పక్కలా తిరుమలలో వాతావరణం, పరిసరాలు గమనిస్తూ సాగారు. రోడ్డుకు రెండు పక్కలా ఉన్న భవనాలు, యాత్రికుల వాహనాలు, యాత్రికుల సంచారాన్ని ఆమె ఆసక్తికరంగా గమనించారు. రోడ్డుకు దూరంగా నిలబడిన యాత్రికులు రాష్ట్రపతిని చూస్తూ, అభివాదం చేయడం కనిపించింది. పద్మావతీ అతిథి గృహం నుంచి మార్గమధ్యలో, శ్రీవారి ఆలయం, మాడవీధులన్నీ భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
తిరుమలలో గురువారం రాత్రి బస చేసినప్పుడు ఉన్నవాతావరణం, శుక్రవారం ఉదయం తిరుమల ఆలయానికి వెళ్లే సమయంలో ఉదయం కనిపించిన వాతావరణంలో తేడాలు, వ్యత్యాసం, ప్రకృతి రమణీయతను ఆసక్తికరంగా గమనిస్తూ, కొండపై వాతావరణాన్ని ఆస్వాదించారు.
వాహనంలో ప్రయాణిస్తూ...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన కాన్వాయ్ తిరుమల రాంబగీచా అతిథి గృహాల సముదాయం సమూహంలోని వాహన మండపం వద్దకు చేరుకుంది. దూరంగా నిలబడి చూస్తున్న యాత్రికులకు ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ వాహనం నుంచి కిందికి దిగారు. అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో కూర్చున్నారు. భద్రతా సిబ్బంది కళ్లలో ఒత్తులు వేసుకుని పరిసరాలను సునిశితంగా గమనిస్తూ ఉండగా, రాష్ట్రపతి ముర్ము కూర్చొన్న బ్యాటరీ వాహనం శ్రీవారి ఆలయానికి సమీపంలోని మాడవీధిలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి కుడిపక్కకు తిరిగి, భూ వరాహక్షేత్రం సమీపానికి చేరుకుంది. ఆలయం వద్ద టీటీడీ అధికారులతో పాటు పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అధికారులు స్వాగతించారు.
శ్రీవారి పుష్కరిణికి నమస్కారం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వరాహస్వామి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తరువాత వరాహ క్షేత్రం ప్రాధాన్యతను వివరించారు.
"శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవడం ప్రధానం. ఆ తరువాత శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల తిరుమల యాత్ర పరిపూర్ణం అవుతుంది" అని పండితులు, టీటీడీ అధికారులు రాష్ట్రపతి ముర్ముకు చారిత్రక నేపథ్య కథనాన్ని వివరించారని తెలుస్తోంది. వరాహస్వామి వారికి పూజలు అందించిన తరువాత శ్రీవారి ఆలయం సమీపం వరకు బ్యాటరీ వాహనంలో తిరిగి బయలుదేరారు.
వాహనం దిగి...
శ్రీవారి వాహనమండపానికి ఎదురుగా వాహనం దిగిన ఆమె రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమక్షంలో ప్రధాన అర్చకుడి తోపాటు వేద పండితులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
ధ్వజస్తంభానికి మొక్కి...
శ్రీవారి ఆలయ మహద్వారం నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును టీటీడీ పాలక మండలి చైర్మన్, సభ్యుల్లో కొందరు, అధికారులు ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. ధ్వజస్తంభం వద్ద తల ఆనించి ఆమె మొక్కారు. గరుడపటాన్ని ఆవిష్కరించే ప్రదేశంలో ఆకాశంలోకి చూస్తూ శ్రీవారిని ప్రార్థించారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ముర్ముకు వేద పండితులు స్వామివారి దర్శనం కల్పిస్తూ, వేద మంత్రాలు పఠించారు. ఆ తరువాత తలపై శఠారి ఉంచి, ఆశీర్వచనాలు ఇచ్చారు. హారతి అందుకున్న తరువాత శ్రీవారి చెంత ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ, కొన్ని నిమిషాల పాటు గడిపిన రాష్ట్రపతి ముర్ము దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. అక్కడి నుంచి ఆలయంలోని రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆమెకు వేదపండితులు వేదాశీర్వచనం, శ్రీవారి లడ్డు ప్రసాదాలతో పాటు తీర్థం అందించారు. జ్ణాపికను బహూకరించారు. ఈ జ్ణాపకాలను మదిలో పదిలం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆలయం వెలుపలికి వచ్చారు.
యాత్రికుల ఆసక్తి..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీవారి ఆలయానికి సమీపంలో దూరంగా గమనిస్తున్న యాత్రికులు తమ సెల్ ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాలు తమ సెల్ ఫోన్లలో బంధించడం కనిపించింది. దూరం నుంచే రాష్ట్రపతి తమతో ఉన్నట్లు సెల్ఫీలు తీసుకునేందుకు కూడా వాహనమండపం, వరాహస్వామి ఆలయాలకు సమీప ప్రాంతాల్లో కనిపించింది. శ్రీవారి దర్శనం తరువాత ఆలయం వెలుపలకు రాగానే పుష్కరిణి, అఖిలాండం పరిసర ప్రాంతాల్లో ఉన్న యాత్రికులు కూడా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నడిచి వెళ్లే ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు అత్యంత ఆసక్తి ప్రదర్శించారు.
Next Story

