పోస్టుకో రేటు.. వైసీపీ వారికే ఛాన్స్ ..!
యోగి వేమన వర్సిటీ కాస్తా.. వైసీపీ విశ్వవిద్యాలయంగా మార్చారు. సిపారసులతో అయినోళ్లకు ఉద్యోగాలు ఇప్పించారు. నిబంధనలు పాటించలేదనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వేమన నీతి సూక్తులకు పాతర వేశారు. ఆ యోగి పేరిట ఉన్న కడప వర్సిటీలో పోస్టులు అంగట్లో సరుకుల్లా విక్రయించారు. వైసీపీ నేతల సిఫారసుతో పోస్టింగ్ ఇచ్చిన వ్యవహారం చర్చకు తెరతీసింది.
కడప జిల్లా వైఎస్ఆర్ అడ్డాగా ఉంది. దశాబ్దాల కాలంలో వారి కుటుంబమే పెత్తనం చెలాయిస్తోంది. ఇందుకు యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా అతీతంగా కాదనే విధంగా వ్యవహరించారు. ఈ వర్సిటీలో బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేశారు. అది కూడా ఒకో పోస్టుకు ఓ రేటు నిర్ణయించి 191 పోస్టులు భర్తీ చేసిన వ్యవహారం వెలుగు చూసింది. ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండానే ఇద్దరు వైసీపీ కీలక నేతల సిఫార్సుల ఆధారంగా నియామకాలు సాగించిన వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. వారిద్దరి సిఫారసు లేఖల ఆధారంగా ఎలాంటి కమిటీలకు ఆస్కారం లేకుండా, వైవీయూ (యోగి వేమన విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిబ్బంది నియామకానికి ఆమోదముద్ర వేసిన వ్యవహారంలో రూ. రూ. లక్షలు చేతులు మారిన వ్యవహారం వర్సిటీని వివాదాల్లో చిక్కుకునేలా చేసింది.
కడపలో 2006 మార్చి 9న యోగి వేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. కడప నుంచి పులివెందులకు వెళ్లే మార్గంలో మిట్టమీదపల్లె పంచాయతీ పరిధిలో 700 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వర్సిటీ తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధ కాలేజీగా ఉండేది. 2012-13 విద్యా సంవత్సరంలో యోగి వేమన వర్సిటీ మొదటి స్నాతకోత్సవంతో స్వతంత్రంగా మారింది. ఈ వర్సిటీలో వంద మంది శాశ్వత ఉద్యోగులు, 82 మంది బోధనా సిబ్బంది, 307 మంది శాశ్వత, 125 మంది తాత్కాలిక సిబ్బందితో ఏర్పాటైంది. వర్సటీ ప్రారంభం నుంచి పరిశోధనా పరంగా రూ. 29 కోట్ల విలువైన 88 అధికంగా ఎక్కువ ప్రాజెక్టులు కూదా సాధించిది. యోగి వేమన విశ్వవిద్యాలయం స్వల్ప కాలంలో విద్యాభివృద్ధి సాధించింది.
పోస్టుల భర్తీలో ఏమి జరిగింది?
యోగి వేమన విశ్వవిద్యాలయంలో 2019 - 2024 కాలంలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరిగిన వ్యవహారం వర్సిటీని వివాదాల్లోకి లాగింది. వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో 191 పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకో పోస్టుకు రూ. నాలుగు లక్షల నుంచి రూ. ఏడు లక్షల వరకు విక్రయించారనే చెబుతున్నారు. సహచార హక్కు చట్టం ద్వారా పోస్టుల భర్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పోస్టులన్నీ కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, సిఫారసు లేఖల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయడం, సిఫారసులు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారనే విషయం వెల్లడైంది.
దీనిపై కడప జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య( ఏఐవైఎఫ్ ) జిల్లా కార్యదర్శి వి గంగా సురేష్ మాట్లాడుతూ,
" ఈ అక్రమ నియామకాలపై విచారణ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి" అని డిమాండ్ చేశారు. ఈ నియామకాలకు సంబంధించి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం" అని గంగా సురేష్ "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధికి చెప్పారు. "వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల్లో అనుకూలమైన వారిని నియమించుకున్నారు. యదేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్. జగన్ బావమరిది వైవీయూ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథరెడ్డి వర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు" అని ఆయన ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల లేఖలే ప్రామాణికం
యోగి వేమన విశ్వవిద్యాలయంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ , డైలీ వేజెస్, బోధనేతర ఉద్యోగాల నియామకంలో నిబంధనలు ,రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ పోస్టులు ఇష్టారాజ్యంగా వైసీపీ పార్టీ కార్యకర్తలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి పోస్టులు ఇవ్వడానికి కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లేఖలు ఇచ్చారని తెలిసింది. చివరాఖరికి మాజీ సీఎం వైఎస్. భారతిరెడ్డి సిఫారసు లేఖతో కూడా పోస్టింగ్లు ఇచ్చారని చర్చ జరుగుతోంది. అంతేకుండా వైఎస్. జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పీ. రవీంద్రనాథరెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం అంజద్బాషా లేఖలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకాలకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అయితే,
"కౌన్సిల్ తమకు చేతికి మట్టి అంటకుండా ముందుజాగ్రత్తగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఈ అభ్యర్థిని ఆ పోస్టులో నియామకాలు ఆ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసు మేరకు అని ప్రస్తావించారు"
ఆయన జీతం రూ. 70 వేలు.. ఇవీ పోస్టులు
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యోగి వేమన వర్సిటీలో నోటిఫికేషన్ లేకుండా నెలకు రూ. 70 వేల వేతనంతో సీపీడీబీ (కమ్యూనిటీ ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్) పోస్టు భర్తీ చేశారు. ఈయనకు కనీస పనికూడా లేదని చెబుతున్నారు. ఈ పోస్టు తోపాటు నియామకాలన్నీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పనిచేసిన ముగ్గురు వైస్ చాన్సలర్ల పదవీకాలంలో జరిగాయి. అందులో ఎం. రామకృష్ణారె్డ్డి (ఎంఆర్కే. రెడ్డి), సూర్యకళ, చింతా సుధాకర్ కాలంలో 2019 నుంచి 2024 మార్చి వరకు జరిగిన నియామకాల్లో అవుట్ సోర్సింగ్ పధ్దతిలో 73, దినసరి ప్రాతిపదికన 53, కాంట్రాక్ట్ పద్ధతిలో 57 , పీస్ మీల్ పద్ధతిలో ఐదు, ఆరోగ్య విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడు పోస్టులతో కలిసి మొత్తం 191 బోధనేతర సిబ్బంది నియామకాలు జరిగాయి. నోటిఫికేషన్ లేకుండా సిపిడిబి కో ఆర్డినేటర్ గా సంపత్ నియమించి అతనికి 70వేలు జీతం ఇస్తున్నారు
కార్పొరేన్ నిబంధనలు వర్తించవా?
వైఎస్ఆర్ సీపీ 2019 లో అధికారంలోకి రాగానే అవుట్ సోర్సింగ్ నియామకాలు పారదర్శకంగా జరపాలని భావించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ ఔట్సోర్సింగ్ సర్వీస్ ( APCOS ) ఏర్పాటుతో, నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు విరుద్ధంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వీసీ ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య జీ. గులాం తారిఖ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఔట్ సోర్సింగ్ ద్వారా 76 పోస్టులు భర్తీ చేయడంపై సందేహాలకు ఆస్కారం కల్పించారు. ఈ నియామకాలలో రిజర్వేషన్ నిబంధనలు కూడా పాటించలేదని అంటున్నారు .
రూ. 2.50 కోట్ల భారం
కడప వైవీయూలో పీస్ మీల్ ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, రిజర్వేషన్ నిబంధనలు పాటించకుండా ధర నిర్ణయించి, పోస్టింగ్ లు ఇచ్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పోస్టుల్లో నియమితులైన వారు శాంక్షన్డ్ పోస్టులు కాకపోవడంతో విశ్వవిద్యాలయ సొంత నిధులతో ఏటా రూ. 2.50 కోట్లు వేతనాలు చెల్లించడం ద్వారా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
"డైలీ వేజ్ వర్కర్స్ పేరుతో 2019 నుంచి 2024 మార్చి వరకు 53 మందిని, 2023 లో కాంట్రాక్ట్ పేరుతో 57 మంది వద్ద రూ. లక్షలు వసూలు చేశారు" అని ఏఐవైఎఫ్ కడప జిల్లా కార్యదర్శి వీ. గంగా సురేష్ ఆరోపించారు. "వైవీయు వీసీ ఆచార్య ఎం. సూర్యకళావతి, ఆచార్య విజయ రాఘవప్రసాద్, వారి తర్వాత పదవులలో ఉన్న ఉపకలపతి ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వైపీ. వెంకటసుబ్బయ్య ఇష్టారాజ్యంగా నియామకాలు చేశారు" అని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధికి స్పష్టం చేశారు.
కడప యోగి వేమన వర్శిటీలో జరిగిన వ్యవహారాలు రాజకీయ మలుపు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అనేక ప్రభుత్వ శాఖల్లో జరిగిన నియామకాల వ్యవహారాలు ఒక్కక్కటితో వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా అన్ని వ్యవహారాలను మడతపెడుతోంది. అక్రమ నియామకాలు సాగాయనే ఆరోపణలు ఉన్న యోగి వేమన వర్సిటీలో వైసీపీ పెద్దల హవా నడవడం, రాజకీయంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రత్యర్థి కావడం కూడా టీడీపీ కూటమి లోతుగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిని వామపక్ష యువజన సంఘం ఏఐవైఎఫ్ మరింత సీరియస్ గా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు అడుగులు వేస్తోంది. ఈ పరిణామాలపై వైవీయూ వీసీ కృష్ణారెడ్డిని "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధి పలకరించారు.
"ఈ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పట్లో నేను ప్రిన్సిపల్ గా మాత్రమే ఉన్నాను" అని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నియామకాలు అక్రమంగా జరిగాయనే ఆరోపణలపై.. "ఇవిన్నీ వర్సిటీ అత్యున్నత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంది అందులో నేను ఏ కమిటీలో కూడా సభ్యుడిని కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు. "నా ధ్యాస అంతా పరిశోధనలపై ఉండేది. ఈ ఆరోపణలపై ఫిర్యాదు అందిన తరువాత విచారణ కమిటీ నియమిస్తా" అని వీసీ రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి? రాజకీయ రంగు పులుముకుంటుందా? లేకుండా ఈ వ్యవహారాలపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేవి వేచి చూడాలి.
Next Story