భక్తితో పూజ.. ఆపై ఏమి చేశాడు..?!
x

భక్తితో పూజ.. ఆపై ఏమి చేశాడు..?!

ఓ భక్తుడు ఆలయంలోకి వెళ్లాడు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత అతనిలో వక్రబుద్ధి బయటపడింది. ఇంతకీ ఆయన ఏమిచేశాడు?


ఆలయంలో కొలువైన అమ్మవారి విగ్రహానికి ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఉగ్రరూపంతో ఉన్న అమ్మవారి దర్శనసేవలో ఓ భక్తుడు చాలా సేపు తరించాడు. దండం పెడుతూ, తన మనసులోని కోర్కెలు అమ్మవారికి నివేదించుకున్నాడు. అదే చేతులతో అమ్మవారి మెడలో అలంకరించిన ఓ ఆభరణం చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది.



మదనపల్లె పట్టణం బుగ్గకాలువ సమీపంలో బాటగంగమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని టీడీపీ మాజీ కౌన్సిలర్ అలివేలమ్మ నిర్మించారు. ప్రతిరోజు అమ్మవారిని ముస్తాబు చేయడం, ఆలయ నిర్వహణ బాధ్యత ఆమె నిర్వహిస్తున్నారు. గ్రామదేవతలకు శాంతిపూజలు చేయడం ఆనవాయితీ. ప్రతి శక్రవారం, మంగళవారం ప్రత్యేక అలంకరణలు చేసి, అమ్మవార్లను పూజించడం సర్వసాధారణంగా జరిగేదే.
అందులో భాగంగానే ఆలయంలోని బాటగంగమ్మ అమ్మవారి విగ్రహాన్ని బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఓ వ్యక్తి అమ్మవారి ఆర్శనానికి వచ్చాడు. చిన్నపాటి గర్భగుడిలో కొలువైన అమ్మవారి విగ్రహం సమీపంలో నిలబడి, రెండు చేతులు జోడించి, కొన్ని నిమిషాలు ప్రార్ధించాడు. ఆ తరువాత అమ్మవారి సన్నిధిలో ఉన్న కుంకుమ తీసుకుని నుదుటిన పెట్టుకున్నాడు. ఆ తరువాతే అతనిలోని వంకరబుద్ధి మొగ్గ తొడిగింది. మరోమనిషి నిద్ర లేచాడేమో. మళ్లీ అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లాడు.


అమ్మవారి విగ్రహం మెడలోని పూల దండను పక్కకు జరిపాడు. ఓ ఆభరణాన్ని తెంచి జేబులో వేసుకున్నాడు. ఇదంతా నిమిషాల వ్యవధిలో ఆ భక్తుడు కానిచ్చేశాడు. బహుశ అతనికి గుడిలోపలికి వెళ్లే వరకు చోరీ చేయాలనే ఆలోచన లేదేమో. మనసారా ప్రార్ధించిన తరువాతే విగ్రహం మెడలో ఉన్న బంగారు ఆభరణం చూసి, కన్ను కుట్టిందేమో. చేతివాటం ప్రదర్శించాడు.


విచక్షణ కోల్పోయాడా?
ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అతని మొదడులో మెదిలిన చోరీ చేయాలనే బుద్ధి కెమెరాలు ఉంటాయనే విచక్షణ కోల్పోయేలా చేసినట్టు ఉంది. తన మెదడులో మెదిలిన వక్రబుద్ధితో ఆలయంలో చోరీ చేసిన విధానం మొత్తం సీసీకెమెరాలో రికార్డయింది. కొంతసమయానికి ఆభరణం చోరీ జరిగిన విషయం గమనించిన ఆలయ ధర్మకర్త, సీసీ టీవీ పుటేజీ పరిశీలించడంతో అసలు బండారం బయటపడింది. ఈ చోరీపై మదనపల్లె ఒకటో పట్టణ పోలీసుల దృష్టకి తీసుకుని వెళ్లారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు పట్టణానికి చెందిన రెడ్డిశేఖర్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడని గుర్తించారు. స్టేషన్కు తీసుకుని వచ్చి, విచారణ చేశారు.

చోరీలో ట్విస్ట్:
ఆలయంలో చోరీకి గురైన నగ అసలైన బంగారం కాదనే విషయం బయటపడింది. ధర్మకర్త కూడా అదే విషయం చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ద్వారా పట్టుబడడం, నగ బంగారుది కాదనే విషయం తేలడంతో ఆ వ్యక్తి భంగపడ్డాడు. ఆ తరువాత ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి కుటుంబీకుల నుంచి వెండి ఆభరణం ఆలయానికి ఇప్పించడం ద్వారా హెచ్చరిక చేసి, పంపినట్లు సీఐ చాన్ బాషా తెలిపారు.


Read More
Next Story