సమన్వయం, బాధ్యతల వికేంద్రీకరణ.. ఇదే నా విజయ రహస్యం..!
x

సమన్వయం, బాధ్యతల వికేంద్రీకరణ.. ఇదే నా విజయ రహస్యం..!

బాధ్యతల వికేంద్రీకరణ. అదనపు పనులు చెప్పకపోవడం. స్వయం నిర్ణయాధికారం. ఈ సూత్రాలే కర్నూలు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాయి.


రాయలసీమ అంటే బాంబులు పేలుతాయి. వేట కొడవళ్ళు స్వైర విహారం చేస్తాయి. రక్తం చిందుతుంది. సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యాలు ఇవి. ఇది వాస్తవం కాదు అని కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం నిరూపించింది. 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. "ఈ విజయ రహస్యం వెనుక జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యలే" అని ఆ శాఖ అధికారులే కాదు. పౌరులు కూడా చెబుతున్నారు.

"కింది స్థాయి సిబ్బందిపై భారం మోపకపోవడం. అదనపు బాధ్యతలు లేకుండా, తమ ప్రాంతంలోని సమస్యలపై వెంటనే స్పందించే అధికారం ఇవ్వడం. రాజకీయ ఒత్తిళ్లు పట్టించుకోవద్దని సూచించడం. ఫిర్యాదులపై నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వడం వంటి చర్యలతో ఎస్సై నుంచి అదనపు ఎస్పీ వరకు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించడం వల్లనే జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఆస్కారం ఏర్పడింది’’ అని సీనియర్లే కాదు.. యువ పోలీసు అధికారులు కూడా చెబుతున్నారు. ఐదు నెలలుగా జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఆస్కారం ఏర్పడిందని పలువురు సిఐలు చెబుతున్నారు.

"విజిబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సామాజిక వ్యతిరేక అంశాలపై మెరుగైన నిఘా, నేరారోపణలపై దృష్టి కేంద్రీకరించడం వంటి స్పష్టమైన చర్యలు 2023 సంవత్సరంలో నేరాల రేటును తగ్గించడంలో సహాయపడ్డాయి” అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కర్నూల్) జి. కృష్ణకాంత్ అన్నారు.

గతంలో ఫ్యాక్షన్ హత్యలు

రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న కర్నూలు జిల్లాలో పాతికేళ్ల క్రితం వరకు వర్గపోరాటం, దాడులు, హత్యలు ఎక్కువగా జరిగేవి. ఆ కోవలో జిల్లాలోని డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ, పత్తికొండ ప్రాంతాలు నిత్యం వార్తల్లో నిలిచేవి. కర్నూలు జిల్లాలో గతంలో ఎస్పీగా పనిచేసిన సీతారామాంజనేయులు.. తాను అనుసరించిన పద్ధతులతో ఫ్యాక్షన్ భూతాన్ని ఉక్కు పాదంతో అణచివేశారు. ఆయన దాటికి కొందరు ఊర్లు వదిలి కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత.. " కర్నూలు జిల్లాలో పేరు మోసిన వర్గ నాయకులు మృతి చెందినా వారి వారసులు హింస ద్వారా ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు.

ఆ కోవలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి అకాల మరణం చెందారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఒకప్పటి భూమా నాగిరెడ్డి మిత్రుడు ఏవి సుబ్బారెడ్డి వర్గం తయారయింది. భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి మధ్య వర్గ పోరు ముదిరింది. భూమా అఖిలప్రియ-ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య పోరు పోలీస్ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. అందుకు నిదర్శనం..

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా కర్నూలు జిల్లా మొత్తం చదురుమొదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆళ్లగడ్డలో మాత్రం హింస ప్రజ్వరిల్లింది. పోలీసులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నప్పటికీ వ్యూహాత్మక దాడులతో భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ను హతమార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ సంఘటనలో మరుసటిరోజే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం పక్కకు ఉంచితే..

కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి

సాధారణంగా ఎన్నికలకు ముందు అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం సర్వసాధారణం. అయితే, కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జి. కృష్ణకాంత్ ఐదు నెలల కిందటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కర్నూలు జిల్లాకు ఆనుకునే ఉన్న గుత్తి గ్రామానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కృష్ణకాంత్‌కు ఈ ప్రాంతం పట్ల సంపూర్ణ అవగాహన ఉంది. చిన్ననాటి నుంచి చూసిన అనేక సంఘటనల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవడంలో మెదడుకు పని చెప్పారని పోలీస్ అధికారులు అంటున్నారు.

అందులో ప్రధానంగా... గ్రామాలలో.. ముఖ్యంగా సమస్యాత్మక పల్లెలు, పట్టణాల్లో సభలు నిర్వహించడం. పల్లె నిద్ర చేయడం. ఫ్యాక్షన్ గొడవలు, ఇతరత్రా సంఘటనల్లో నిందితులుగా ఉన్న వారిని, వారి కుటుంబీకులతో వ్యక్తిగతంగా మాట్లాడి కౌన్సిలింగ్ చేశారు. వారందరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిఘాలో ఉన్న పోలీస్ అధికారులు సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించలేదు. ఈ చర్యల ద్వారా నిరంతర పర్యవేక్షణకు, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా నివారించడంలో సూక్ష్మ దృష్టితో వ్యవహరించారని చెబుతారు. పోలీసు అధికారులపై ఏకపక్షంగా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాలు జారీ చేయకుండా, మా బాధ్యతలు మేము నిర్వర్తించే విధంగా వీకేంద్రీకరణ చేయడం వల్లనే ఇది సాధ్యమైందని ఓ సీఐ అంటున్నారు.

" విధుల్లో మాకు లిబర్టీ ఇచ్చారు. అదనపు బాధ్యతలు అప్పగించలేదు. పోలీసు అధికారిగా కాకుండా, మేమంతా ప్రజలతో మమేకం అయ్యే వాతావరణం కల్పించారు. ఇదే పోలీసు శాఖ సాధించిన విజయం వెనక ఫార్ములా’’ అని కర్నూల్ ఫోర్త్ టౌన్ సిఐ జయ శంకరయ్య.. ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. ‘‘ఎన్నికల సమయంలో రెండు పార్టీల నుంచి ఫిర్యాదులు ఉంటాయి. ఆరోపణలు ఉంటాయి. ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ సమయంలోనే విచక్షణతో నిర్ణయాలు తీసుకుని వ్యవహరించండని మా ఎస్పీ చేసిన సూచన అమలు చేయడం వల్లనే మా శాఖ ప్రతిష్టను కాపాడే అవకాశం దక్కిందని" సీఐ శంకరయ్య అభిప్రాయపడ్డారు.

జిల్లాకు అధికారుల మధ్య సమన్వయం ఉంటే క్షేత్రస్థాయి సిబ్బంది కూడా సక్రమంగా విధులు నిర్వహించేందుకు ఆస్కారం కలుగుతుంది. పరిపాలన వ్యవహారాల్లో ఒకరు. శాంతిభద్రతను పరిరక్షించడంలో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటు కలెక్టర్ డాక్టర్ జి. సృజన నిరూపించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే ప్రతిబింబించింది.

అధికారుల మధ్య సమన్వయాన్ని ప్రస్తావిస్తూ..

" సున్నిత ప్రాంతాల పైన దృష్టి కేంద్రీకరించాం. అప్పటికే జిల్లా ఎస్పీ ఆ ఎఫెర్ట్స్ పెట్టారు. ఆ కోవలోనే మేము కూడా పని చేశాం" అని కర్నూలు వన్ టౌన్ ఎస్ఐ వై. పవన్ కుమార్.. ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు. "సాధారణ రోజుల్లో వేరుగా ఉంటుంది. ఎన్నికల సమయంలో హింస ప్రజ్వలిల్లకుండా నివారించగలిగితే.. సమాజంలో దశాబ్దాల పాటు ప్రశాంతత రాజ్యమేలుతుంది. పోలీస్ శాఖ నుంచి మేము అదే పద్ధతులు అనుసరించాం’’ అని సీఐ పవన్ కుమార్ అంటున్నారు. ‘‘పొగడ్త కాదు. కానీ, ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మా ఎస్పీనే హీరో’’ అని ఆయన అభివర్ణించారు.

‘ఎన్నికల సరళీ ప్రశాంతంగా జరగడంపై స్పందిస్తూ గతాన్ని నెమరువేసుకున్న విభజిత నంద్యాల జిల్లా పరిధిలోని శ్రీశైలం, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ కేశవులు మాట్లాడుతూ.. " ఫ్యాక్షన్ మూలాలకు కాలం చెల్లింది. జిల్లాకు వచ్చిన యువ కలెక్టర్, ఎస్పీ వల్లే ఇది సాధ్యమైంది" అని వ్యాఖ్యానించారు. దాదాపు 20 సంవత్సరాల క్రితమే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ అనే వర్గ పోరాటానికి తెర తీస్తున్న ముఠా నాయకులను ఎస్పీ సీతారామాంజనేయులు అణిచివేశారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం వచ్చిన యువ కలెక్టర్, ఎస్పీలు కూడా పరిస్థితిని సున్నితంగా అదుపు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

మొత్తం మీద రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా కర్నూలు జిల్లాలో పోలింగ్, ఆ తర్వాత హింస చెలరేగక పోవడానికి అధికారులు తీసుకున్న నిర్ణయాలు ఊతమందించాయి. అధికారులు ఒత్తిడులకు తల వంచకుండా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సిబ్బందిలో కూడా ధైర్యం, తెగువ ఉంటుందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా అధికారులు కూడా కర్నూలు జిల్లా యంత్రాంగం ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

Read More
Next Story