'దుర్గం"లో పరుగులు తీసిన జనం
రోడ్డు పక్కన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణభయంతో రోడ్లపై పరుగులు దీశారు. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఇంతకీ కల్యాణదుర్గంలో ఏమి జరిగింది?
మధ్యాహ్నం 11 గంటల సమయం. రోడ్డులో జన సంచారం ఓ మాస్తరుగా ఉం ది. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వద్ద ఎవరి పనుల్లో వారు ఉన్నారు. కష్టమర్లు వస్తున్నారు. వెళుతున్నారు. ఓ దుకాణం వద్ద నిలబడిన వ్యక్తి బీడి ముట్టించాడు. అగ్గిపుల్ల ముట్టించి, కింద వేశాడు. అంతే ఒక్కసారిగా మంటలు భగ్గుమన్నాయి. దుకాణదారులే కాదు. రోడ్డుపై వెళుతున్న వారు కూడా పరుగులు దీశారు.
ఉలిక్కిపడిన కల్యాణదుర్గం
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటనతో ఉలిక్కిపడింది. స్థానికులు అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం కూడా తప్పిందని చెబుతున్నారు. మంటల్లో కొన్ని బైక్ లు కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తం కాకుండా ఉంటే మాత్రం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు మంటలు విస్తరించి ఉండేవి. ఇదే జరిగి ఉంటే ప్రమాదతీవ్రత ఊహించడానికి సాధ్యం అయ్యేది కాదు. ఇంతకీ ఈ ప్రమాదం జరగడానికి దారి తీసిన పరిస్థితిని గమనిస్తే..
కల్యాణదుర్గంలో మధ్యాహ్నం టీ -సర్కిల్ సమీపంలో ఓ దుకాణం వద్ద ఇద్దరు ముగ్గరు కష్టమర్లు ఉన్నారు. దుకాణం వద్ద రోడ్డు పక్కనే పెట్రోల్ ప్రవహిస్తోంది. అక్కడ ఉన్న వారు కూడా గమనించారు. అయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
పెట్రోల్ వాసన ఎక్కువగా ఉండడంతో మూతికి రుమాలు కూడా కట్టుకుని, ధారగా కారుతున్న పెట్రోల్ పై నుంచి దాటుకున్నాడు. తన బైక్ ను పక్కకు తీసి, కాస్త పైభాగాన పార్కింగ్ చేశాడు.
బీడి తెచ్చిన ప్రమాదం
ఇదంతా పంకచట్టుతో ఉన్న వ్యక్తి గమనిస్తున్నాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో తాగుతున్న బీడి ఆరిపోయింది. రోడ్డు పక్కన పారుతోంది పెట్రోల్ అని తెలిసినా, ఏమాత్రం పట్టించుకోనట్లు అగ్గిపుల్ల గీసి, బీడి ముట్టించుకున్నాడు.
నిప్పుతో ఉన్న అగ్గిపుల్లను పెట్రోల్ ప్రవహిస్తున్న చోట వేశాడు. అంతే ఒక్కసారిగా భగ్గుమని మంటలు వ్యాపించి, క్షణాల వ్యవధిలో చుట్టుముట్టాయి. సమీపంలోని ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. బీడి ముట్టించుకున్న వ్యక్తి ప్రాణభయంతో ఎగిరి దూకేశాడు. రోడ్డున వెళుతున్న వారే కాకుండా, సమీప దుకాణదారులు కూడా రోడ్డుపై పరుగులు దీశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కొందరు మంటలు ఆర్పడానికి నీరు, మట్టి చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
ఇంతకీ ఏమి జరిగింది?
ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే పెట్రోల్ బంకు ఉంది. అక్కడ క్యాన్ లో పెట్రోలు నింపుకున్న వ్యక్తి బైక్లో బయలుదేరాడు. ఆ క్యాన్ నుంచి కారిపోయిన పెట్రోల్ రోడ్డు పక్కన కాలువలా మారింది.
ఈ విషయాన్ని కల్యాణదుర్గం సీఐ హరినాథబాబు కూడా 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'కి ధ్రువీకరించారు. "ఓ వ్యక్తి క్యాన్లో నింపుకున్న పెట్రోల్ కారిపోవడం గమనించలేదు అని ఆయన తెలిపారు. "సమాచారం తెలియగానే సంఘటన ప్రదేశాన్ని పరిశీలించామని" ఆయన స్పష్టం చేశారు.
స్థానికులు అప్రమత్తం కాకుంటే మాత్రం మంటలు సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు విస్తరించేవని తెలిసింది. ఇదే జరిగి ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత ఊహలకు అందదు. వాస్తవానికి క్యాన్లలో పెట్రోల్ నింపరాదనే ఆంక్షలు ఉన్నాయి. నింపుకున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరగడానికి ఆస్కారం కలిగింది. మొత్తానికి త్రుటిలో భారీనష్టం తప్పడంతో కల్యాణదుర్గం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story