రేపు పవన్ కల్యాణ్ రాక..  అందరి దారులు కల్లి తాండా వైపే..
x
మురళీనాయక్ చిత్రపటానికి నివాళి. ఆయన తండ్రి శ్రీరాంనాయక్ ను సముదాయిస్తున్న మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత

రేపు పవన్ కల్యాణ్ రాక.. అందరి దారులు కల్లి తాండా వైపే..

వీరజవాన్ నాయక్ కుటుంబానికి అందరూ అండగా నిలిచారు. కల్యాణదుర్గం ఎమ్మెల్యే నెల వేతనం అందించారు. మహారాష్ట్రలో నాయక్ విగ్రహం ఏర్పాటుకు ఆ రాష్ట్ర మంత్రి ప్రకటించారు.


కాశ్మీర్ లో వీరమరణం చెందిన మురళీనాయక్ సొంత ఊరు కల్లి నాయక్ తాండా వైపే అన్నివర్గాలు కదలుతున్నాయి.

మురళీనాయక్ ఆత్మశాంతి కోసం ప్రదర్శనలు నిర్వహించే వారు కొందరైతే, ఆయన కుటుంబానికి బాసటగా నిలవడానికి వస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాలు, పార్టీలు, సంఘాల నేతలతో కల్లి తండా రద్దీగా మారింది.

అనంతపురం జిల్లా నుంచే కాకుండా, రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజాప్రతినిధుల, మంత్రులు కల్లి తండా వైపు వస్తున్నారు. కాశ్మీర్ లో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పడానికి వస్తున్నారు.

"ఓ వీరుడిని దేశానికి అందించావు" తల్లీ అని మురళీ నాయక్ తల్లి జ్యోతిభాయి, తండ్రి శ్రీరాం నాయక్ ను సముదాయిస్తున్నారు. వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మురళీనాయక్ ఫోటో వద్దే జాతీయజెండాకు సెల్యూట్ చేస్తున్నారు. ఇదిలావుంటే, ఆపరేషన్ సింధూర్ లో శత్రువినాశనం కోసం పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
రేపు కల్లి తండాకు కల్యాణ్
కాశ్మీర్ యుద్ధభూమిలో ప్రాణాలు వదిలిన మురళీ నాయక్ సొంతవూరుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. గన్నవరం విమానాశ్రయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయం8.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కల్లి తాండాకు 9.25 గంటలకు చేరుకుని, వీరజవాన్ మురళీనాయక్ పార్థీవదేహానికి నివాళులర్పిస్తారు. నాయక్ తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత పవన్ కల్యాణ్ పది గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని, విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం అవుతారు.
మహారాష్ట్రలో విగ్రహం ఏర్పాటు

వీరజవాన్ మురళీనాయక్ విగ్రహాన్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత ప్రకటించారు. మురళీనాయక్ తండ్రి శ్రీరాం నాయక్ ముంబైలో పనిచేసే వారు. ఆ విషయం తెలియడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన నేత ఏకనాథ్ షిండే ప్రతినిధిగా కల్లి తాండాకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత శనివారం వచ్చారు. వీరజవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిభాయి, శ్రీరాం నాయక్ ను ఓదార్చారు.
"మహారాష్ట్ర ప్రభుత్వం నాయక్ కుబుంబానికి అండగా ఉంటుంది" అని మంత్రి ఉదయ్ సమంత హామీ ఇచ్చారు.
"నాయక్ కుటుంబం తమ రాష్ట్రానికి తీసుకుని వెళ్లి, సత్కరిస్తాం. వారు ఏమి కోరుకుంటే, ఆ సదుపాయాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని మంత్రి ఉదయ్ వసంత మీడియాకు చెప్పారు. అంతకుముందు డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేతో వీడియోకాల్ ద్వారా శ్రీరాం నాయక్ ను మాట్లాడించారు.
"ముంబైకి వస్తే, మీకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే మాట ఇచ్చారు.
"నాయక్ కుటుంబాన్ని ఆదుకోవడానికి సీఎం ఫడ్నవీస్ కూడా ఆమితాసక్తిగా ఉన్నారు" అని కూడా మంత్రి ఉదయ్ సమంత చెప్పారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన మురళీనాయక్ త్యాగాలు వృథా కానివ్వబోమని ఆయన వ్యాఖ్యానించారు.
నెల వేతనం విరాళం

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మురళీనాయక్ తల్లిదండ్రులకు తన నెల వేతనం రూ. 1.75 లక్షల చెక్కు ఆర్థికసాయం అందించారు. అంతకుముందు మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ సమయంలో అమరవీరుడికి నివాళులర్పిస్తూ, జైహింద్ అంటూ చేసిన నినాదాలు తండాలో ప్రతిధ్వనించాయి.
యుద్ధంలో గెలవాలని..

ఆపరేషన్ సింధూర్ తో శత్రు సంహారం జరగాలి. ఈ యుద్ధంలో భారత్ దే విజయం అంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధర్మవరం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించారు. బ్రహ్మారథోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య, దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు అని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రధానని నరేంద్రమోదీ కి సంఘీభావంగా, త్రివిధ దళాలకు విజయం చేకూరాలని పూజలు చేశామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆయన వెంట జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డితో ఉన్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఆర్డీవో మహేష్, డీఎస్పీ హేమంత్ కుమార్, కమిటీ చైర్మన్ సి.ఎన్.బి జగదీష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుశ్రీ, తోపాటు నేతలు కూడా పాల్గొన్నారు.
మాజీ మంత్రి నివాళి వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటం వద్ద మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్సీ బోయ మంగమ్మ నివాళులర్పించారు. నాయక్ తల్లిదండ్రులను కూడా పరామర్శించారు.
Read More
Next Story