JANASENA | పల్లకీ మోతేనా పార్టీ ఎదుగుదల పట్టదా పవన్ కల్యాణ్?
x

JANASENA | పల్లకీ మోతేనా పార్టీ ఎదుగుదల పట్టదా పవన్ కల్యాణ్?

జనసేనాని రంగులకలల ఊహల్లో ఉన్నారు. ప్లీనరీ తరువాత దారీతెన్నూ చూపలేదు. క్యాడర్ ను డైలమాలో పడేశారు. పవన్ బిజెపి వదిలిన బాణమా.. ఆయనకంత సీన్ ఉందా?


చెగువేరా పోరాట ప్రేరణ, కమ్యూనిస్టు ఆదర్శ భావాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రూటు మారింది. ఆయన రంగుల ఊహా ప్రపంచంలోకి వెళ్లారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన 11 ఏళ్ల ప్రస్థానంలో రైట్ (బీజేపీ) కి టర్న్ తీసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం సమీపంలో జయకేతనం పేరిట నిర్వహించిన పార్టీ 12వ ప్లీనరీలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాన్ని సమీక్షిస్తే, సనాతనం దిశగా గమనాన్ని మార్చుకున్న ఆయన క్యాడర్ కు భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశించలేకపోయారు. దక్షిణాదిన తనను స్టార్ క్యాంపెయిన్ కోసం వాడుకోమని బీజేపీకి సూచన చేసినట్లుగానే ఉంది. మినహా జనసేన అజెండా నుంచి తప్పుకున్న పవన్ కల్యాణ్ గాలివాటంగా విధానం మార్చుకున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ విధానాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పందించారు.
"పవన్ కల్యాణ్ ను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రోజుకో మాట మాట్లాడే పవన్ ముందు అంతకంటే మార్గం లేదు. ఒకసారి చేగువేరా అంటారు. మరోసారి సావర్కర్ ను ప్రస్తావిస్తారు. ఇప్పుడు సనాతనం" జెండా పట్టారని నారాయణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితిమంటల్లో ఆహుతి కావాలి కదా? దీనికి పవన్ సమర్థిస్తారా? అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.
పిఠాపురం ప్లీనరీలో జనసేన భవిష్యత కార్యాచరణ ఏమిటి? దూరదృష్టి, వైఖరి ఏమాత్రం కనిపించలేదు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తున్న వారి నుంచి వినిపించే మాట అది.
గత ఎన్నికల్లో 21 సీట్లు సాధించి, కూటిమిలో భాగస్వామిగా అధికారం పంచుకుంది. ఇదే తమ బలంగా భావిస్తున్న జనసేన చీఫ్.. మేము నిలబడ్డాం. టీడీపీని నిలబెట్టాం అని చెప్పడం ద్వారా పవన్ కల్యాణ్ 42 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఆహంపై దెబ్బ కొట్టారు. చంద్రబాబు దీనిని సులువుగా వదులుతారా?
భాషా పాండిత్యమే క్వాలిఫికేషనా?
పవన్ కల్యాణ్ బహుభాషా పాండిత్యాన్ని ఉపయోగించి తమిళం, కన్నడ, మరాఠా, హిందీ భాషల్లో మాట్లాడి ఏకంగా జాతీయ నాయకత్వంలోకి వెళ్లిపోయినట్టు ఆయన కలలుకంటున్నాడు, దక్షిణాదిలో తమకు ఠికాణా లేదు కనక బిజెపి నాయకత్వం ఆయనను ముందుకు నెట్టవచ్చని భ్రమపడుతున్నట్లు కనిపిస్తోంది. మినహా పుస్తకాలు చదివి ఒంట బట్టించుకున్న విషయాలను పరిజ్ఞానంగా వివరించడం. మినహా ప్లీనరీ అంటే, ఓ విధి, విధానం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకపోవడాన్ని రాజకీయ పరిశీలకులకు కూడా పెదవి విరుస్తున్నారు. బిజెపి చేతిలో ఊత కర్రగా మారిన ఆయన స్వరంలో జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబడింది. దక్షిణాదిలో క్యాంపెయినర్ గా ఉంటానని బిజెపికి సంకేతం ఇచ్చినట్లే కనిపిస్తోంది.
ఆ ఆశయం ఎటుపోయింది?
జనసేనను వలంటీర్ సంస్థగా 2009లో స్థాపించిన పవన్ కల్యాణ్ ఆనాటి భావజాలం మొత్తం 2014 ఎన్నికల నాటికి మారిపోయి, బీజేపీతో చేరడం ద్వారా వారికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల నాటికి మరో మలుపు తీసుకున్న ఆయన కమ్యూనిస్టులతో సయోధ్య కుదుర్చకున్నారు. ఆ ఫలితాలతో దిమ్మతిరిగి తన వైఖరి తప్పు అనుకున్నారేమో మనసు మార్చుకున్నారు. దీంతో మళ్లీ తన పాత ఫ్రెండ్ బీజేపీకి చేరువ అయ్యారు. వారి భావజాలంలో పూర్తిగా ఏకీభవించిన ఆయన పొత్తు పెట్టుకన్నారు.
2024 న్నికల తరువాత 21కి 21 అసెంబ్లీ సీట్లు సాధించిన జనసేన గమ్యం ఏ దిశగా అనేది తేల్చుకోలేని స్థితిలో దక్షిణాదిలో మీకోసం పనిచేయడానికి నేను ఉన్నట్లు స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన ఉద్భవించిందని ప్రకటించిన పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో జత కట్టిన పవన్ కల్యాణ్ "తిరుపతి సభలో కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావో" అని పిలుపుఇవ్వడం ద్వారా అదే వేదికపై ఉన్న ప్రధాని నరేంద్రమోదీ కళ్లలో ఆనందం చూడడమే కాదు. ఆయన అభిమానానికి పాత్రుడయ్యారు.
పవన్ రంగుల కల
పిఠాపురం ప్లనరీ వేదికపై నుంచి మాట్లాడిన తీరు "చిన్నతనం నుంచి తాను రామజపం చేసేవాడిని. చెగువేరా నుంచి భిన్నత్వంలో ఏకత్వ లక్షణాలు చూశానని చెబుతూ, తనది సనాతన మార్గమే" అని చెప్పడం ద్వారా బీజేపీకి మరింత చేరువయ్యే మాటలే చెప్పినట్లు భావిస్తున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ ఓ ఉచిత సలహా ఇచ్చారు.
"పవన్ కల్యాణ్ సనాతన ధర్మం జెండా పట్టుకున్నారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ కంటే, దేవాదాయ శాఖ సరిపోతుంది" అని రామకృష్ణ సూచించారు. పాలన గాలికి వదిలేసిన పవన్ కాషాయ దుస్తులతో గుడులు చుట్టే తిరగడం విడ్డూరంగా ఉందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
దక్షిణాదిన బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ కొరత ఏర్పడింది. ఆ లోటు భర్తీ చేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ చెప్పినట్లు కనిపిస్తోంది. ప్లీనరీలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ భాషల్లో మాట్లాడారు. చిన్ననాటి నుంచి చెన్నైలో పెరగడం వల్ల ఆయనకు తమిళ భాషపై పట్టు ఉందనే విషయంలో సందేహం లేదు. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా తెలుగువారు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం బీజేపీకి కలిసొచ్చింది. తన ప్రచారం వల్ల కొన్ని సీట్లు సాధించాం అనేది పవన్ కల్యణ్ మనసులోని మాటగా ఉంది. దీనికి తోడు
నేనే మాస్ స్టార్
దక్షిణాది రాష్ట్రాల్లో తనకు క్రేజ్ ఉందనే విషయం పవన్ కల్యాణ్ ప్లీనరీలో ప్రస్తావించారు. తెలంగాణలో ఎనిమిది ఎంపీలు ఉన్నారు. వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీ.బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్, జీ. కిషన్ రెడ్డి. డికే. అరుణ, ధర్మపురి శ్రీనివాస్, గూడెం నగేష్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందరావు సామర్థ్యంలో ఎవరి సత్తా వారిది. మాస్ క్యాంపెయినర్ లేరనేది పవన్ కల్యాణ్ అభిప్రాయం.
తమిళనాడులో మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే ఆయన పార్టీ క్యాడర్ ను ఏకం చేయడంలో రాణించలేకపోయారు. గత ఎన్నికల వేళ ఆ విషయం చాలా స్పష్టంగా తెలిపోయింది. కర్ణాటకలో బీజేపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎం యడుయూరప్ప స్థానంలో ఆయన కొడుకు, ఎమ్మెల్యే విజయేంద్ర ఆ పార్టీ సారధ్యం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దక్షిణ కర్ణాటకలో ప్రధానంగా బళ్లారి, హోసపేట, హుబ్లీ, ధార్వాడ్, రాయచూర్, తుముకూరు జిల్లాలతో పాటు, సమీప ప్రాంతాలు తెలుగువారే ఉన్నారు. ఈ ప్రాంతాల్లో మెగా బ్రదర్ సినిమాలకు క్రేజ్ కూడా ఎక్కువే. అంతుకాకుండా, తెలంగాణకు ఆనుకునే పొరుగున ఉన్నఆ జిల్లాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో కూడా తెలుగువారు ఉండడం, ఆ ప్రాంత భాషలన్నీ తనకు పట్టు ఉందని పవన్ కల్యాణ్ చాటుకున్నారు. ఏపీలో బీజేపీకి సమర్థ నాయకత్వ లోపం ఉందనే విషయం తెలిసిందే.
జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని ఎలా చాటారంటే..
" దక్షిణాది రాష్టాల్లో వారందరితో పోలిస్తే, తనకు భాషలు తెలుసు. మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆ ప్రాంతాలకు వెళ్లడం ద్వారా పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతా" అని లక్షలాది మంది జనశ్రేణుల సాక్షిగా బీజేపీ అగ్రనేతలకు సంకేతం ఇచ్చినట్లు ఉంది.
భాషా వివాదం... పవన్ యూ టర్న్..
తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ పట్టుబట్టడం వివదానికి దారితీసింది. బహు భాషా విధానం అమలు చేసేది లేదనే విషయంలో ఎన్నుడో శాసనసభలోనే చట్టం చేసిన విషయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ హిందీ భాషా అమలుపై రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదికి చెందిన ఏపీ ఐఏఎస్ క్యాడర్ అధికారిని టీటీడీలో మొదటిసారి కార్యనిర్వహణాధికారి (TTD EXCUTIVE OFFICER) గా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించారు. ఈ సమయంలో
"తెలుగు ఐఎస్ఎస్ లను అవమానించారు" అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు.
కాలం తెచ్చిన మార్పా? లేక రాజకీయ అవసరాలా? అనేది పక్కన ఉంచితే, "ఉత్తరాది ఆధిపత్యంపై పోరాటం చేసిన పవన్ ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలు ఎందుకు"? అని ప్రశ్నిస్తూ, తమిళనాడులో హిందీ అమలు ఈ వ్యవహారంలో ఎన్డీఏతో తన ప్రగాఢ మిత్రధర్మాన్ని ప్రదర్శించడంలో పవన్ కల్యాణ్ పోటీ మాటమార్చడం గమనార్హం.
దీనిపై సీనియర్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా సమాధానం ఇవ్వడం గమనార్హం. "మాతృభాషపై తమిళులకు అభిమానం ఉండడం తప్పా" అని నిలదీశారు.
అంతటితో ఆగని పవన్ కల్యాణ్...
ద్రావిడ పార్టీలే కాదు. తమిళులు అత్యంతంగా ఎక్కువగా ఆరాధించే పెరియార్ ను ఆంధ్ర మూలాలు ఉన్న బలిజ (కాపు) అని కులం కూడా ఆపాదించడానికి కూడా ఏమాత్రం సంకోచం లేకుండా మాట్లాడడంపై కూడా తమిళ పార్టీలే కాదు. అభ్యుదయవాదులు కూడా ఆక్షేపణ తెలిపారు. ఇక్కడ వివక్ష, బహుజనుల ఆత్మగౌరవ పోరాటం కోసం పెరియార్ తన పేరు పక్కన కులాన్ని త్యజించారనే విషయం పవన్ కల్యాణ్ గ్రహించినట్లు లేదనే మాటలు కూడా వినిపించాయి.
వీసీకే ఏపీ ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఏమన్నారంటే..
"పవన్ కల్యాణ్ పేరుకు తగినట్టు ఎటు గాలి వీస్తే, అటు ప్రయాణం సాగిస్తున్నారు. రాజకీయ స్థిరత్వం లేనట్టు స్పష్టంగా కనిపిస్తోంది" అని అభిప్రాయపడ్డారు. "ప్లీనరీ వేదికగా జనసేనాని భవిష్యత్ కార్యాచరణ లేకుండా ముగించారు. వారి పార్టీ క్యాడర్ కు ఆయన ఏమి సందేశం ఇచ్చారు" అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నేతలకు అర్థం కాని పరిస్థితి కల్పించారని శివప్రసాద్ విశ్లేషించారు.
టీడీపీలో పవన్ మాటల ప్రకంపనలు
గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. అందులో 144 సీట్లకు పోటీ చేసిన టీడీపీ సొంతంగా 135 స్థానాలు, జనసేన 21కి 21 సీట్లు గెలిచింది. బీజేపీ పది చోట్ల పోటీ చేసి, ఎనిమిది స్థానాల్లో గెలవడం ద్వారా మిత్రధర్మాన్ని పాటిస్తూ, మూడు పార్టీలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
అధికారంలో ఉంటూ, ఎన్నికలకు వెళ్లిన వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. దీనికి ప్రధానంగా ఈ పార్టీపై ఏర్పడిన అసంతృప్తి ఒకటి. ఎన్నికలకు ఏడాది ముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అప్పటి విపక్ష నేత, ప్ర్తస్తుత సీఎం ఎన్. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించడం రెండో అంశం. ఇవి రెండు కారణాలు టీడీపీ కూటమికి ఓట్ల వర్షం, సీట్ల పంట పండించి, అధికారంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడింది. కాగా,
పిఠాపురం ప్లీనరీ వేదికగా జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.
"21 సీట్లతో జనసేన నిలబడింది. టీడీపీని కూడా అధికారంలో నిలిపింది" అని పవన్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి తామే కారణం అని బాహాటంగా ప్రకటించడం ద్వారా 41 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ అహంపై పవన్ కల్యాణ్ దెబ్బకొట్టినట్లు మాట్లాడడం అధికార పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. ఎన్నో ఉపద్రవాలు, ఎత్తుపల్లాలు చూడడమే కాదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షడు మాజీ సీఎం ఎన్టీరామారావు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ప్రధానులు, రాష్ట్రపతులను నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో సీనియర్లకు సుత్తిమెత్తగా చెక్ పెట్టడంలో చాతుర్యం ప్రదర్శించే సీఎం చంద్రబాబు మదిలో ఆలోచనలకు సరైన సమయంలో అమలు చేసి, ధీటుగానే సమాచానం చెబుతారని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. టీడీపీ ఆవిర్భావం నుంచి సాధించిన ఓట్లు, సీట్ల లెక్కల కథలు చెబుతున్నారు.
అజెండా మరిచారే
సాధారణంగా ఏ పార్టీ అయినా ప్లీనరీ నిర్వహిస్తే, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుంది. పార్టీ శ్రేణులకు దిశ చూపుతుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన చీప్ పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేసే మేలు వివరించడం ద్వారా పార్టీ పటిష్టతకు పునాదులు వేసుకుంటుంది. కానీ, పవన్ కల్యాణ్ ప్రసంగం దేశ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగు భాషాలు మాట్లాడడం. బీజేపీకి అత్యంత సన్నిహితంగా మారిన పవన్ కల్యాణ్ తిరుపతి వేదికగా వారాహి డిక్లరేషన్ ప్రకటనతో సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఆర్ఎస్ఎస్ తదితర సంస్థల నుంచి వినిపించే మాటలు పవన్ గొంతులో ప్రతిధ్వనించాయి. దానికి కొనసాగింపుగా ప్లీనరీలో కూడా పరభాషా, మత సహనాన్ని పాటించాలని చెబుతూనే, హిందూత్వ అజెండా విస్పష్టంగా ప్రకటించారు. తద్వారా ఆయన పార్టీ అజెంగాను మరిచిపోయారు. అంటే..
సొంతంగా నిలబడే వ్యూహం లేదు
ఏ పార్టీ అయినా సొంతంగా అధికారంలోకి రావాలని తపిస్తుంది. అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఒంటిరిగా నిలబడడానికి కార్యాచరణ ప్రకటిస్తుంది. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ టీడీపీ మరో 15 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉండాలి. సీఎంగా చంద్రబాబే రావాలి అని మాట్లాడడం ద్వారా జనసేన శ్రేణులకు మింగుడు పడని వాతావరణం కల్పించారు. తద్వారా తమ జనసేనానిని భవిష్యత్తు సీఎం కావాలని ఆకాంక్షిస్తున్న పార్టీ శ్రేణులు ప్రధానంగా కాపులు కలత చెందుతున్నట్లే ఉంది. పవన్ కల్యాణ్ లో ఆ భావన కనిపించకపోగా, బలమైన మనస్తత్వం, దేశభక్తి ఉన్న వారు తన వెంట నడవాలని కోరడం గమనార్హం. పార్టీ నేతలను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకటించడం దేనికి సందేహం అనేదే కాదు. ప్లీనరీ జనసేన క్యాడర్ ముందు అనేక ప్రశ్నలు వదిలింది.
Read More
Next Story