ఈ కొండ ఊపిరి నిలుపుతారా?
x

ఈ కొండ ఊపిరి నిలుపుతారా?

విశాఖ రిషికొండకు గుండు కొట్టారు. హార్సిలీహిల్స్ కు కూడా ఎసరు పెట్టారు. అటవీశాఖ మంత్రి తీసుకునే నిర్ణయంపై దీని మనుగడ ఆధారపడి ఉంటుంది. పర్యావరణానికి ముప్పు రానివ్వమని కలెక్టర్ అంటున్నారు.


చిత్తూరు జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) పరిధిలో మదనపల్లెకు సమీపంలో హార్సిలీహిల్స్ ఉంది. తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోట మండలంలోని హార్సీలీహిల్స్ పై స్టార్ హోటల్ నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వ్యవహారం ఇది. స్టార్ హోటల్ నిర్మాణానికి స్థల పరిశీలనతో ఈ విషయం తాజాగా తెరమీదకు వచ్చింది.

పేదవాడి ఊటీగా గుర్తింపు పొందిన ఈకొండ సగం వంతు తోపాటు సమీప ప్రాంతాలు బోడిగుండుగా మారి, కరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు తప్పేలా లేదు. ఆ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే శ్రీగంధం వనాలకు మనుగడకు కూడా ప్రమాదం తప్పేలా లేదు. పర్యావరణ ప్రేమికుడు అయిన రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ స్పందించే తీరుపై హార్సిలీహిల్స్ మనుగడ ఆధారపడి ఉంటుంది.

శ్రీగంధం... వన్యప్రాణులకు నిలయం


హార్సిలీహిల్స్, సమీప ప్రాంతం 2,200 హెక్టర్లలో అంటే 5,500 ఎకరాలు అటవీశాఖ పరిధిలో ఉంది. ఇందులో వన్యమృగాలంలో చిరుతలు, జింకలు, దుప్పి తోపాటు అనేక జీవరాసులకు ఆవాసంగా ఉంది. దీనికంటే ప్రధానంగా ఎర్రచందనం కంటే అత్యంత విలువైన శ్రీగంధం వనాలకు నిలయం. దీంతో ఈ శేషాచలం అటవీప్రాంతం తరువాత మదనపల్లె సమీప అటవీ భూభాగంలో వన్యప్రాణులకు కొదవ లేదు. కాగా, హార్సిలీహిల్స్పై 99 ఎకరాలు రెవెన్యూ శాఖకు అప్పగించారు.

"ఇది పూర్తిగా అటవీశాక పరిధిలోని ప్రదేశం. కొంత భూమి రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఇందులోక్రయ, విక్రయాలకు ఆస్కారం లేదు" అనే విషయాన్ని గతంలో ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్ఓ)గా పనిచేసిన ఒకరు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి గుర్తు చేశారు. అందులో సగంవంతు భూమి రాష్ట్ర పర్యాటక శాఖకు అప్పగించారు. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే పరిపాలనా వ్యవహారాలు సాగుతున్నాయి.
లోకల్ ఆధారిటీ ఉందా?

హార్సిలీహిల్స్ పై ఏ పనిచేయాలన్నా మదనపల్లె సబ్ కలెక్టర్ అధ్యక్షతన ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు, అటవీ, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల కమిటీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడి కమిటీలో తీసుకునే నిర్ణయమే కీలకం. అయితే, హార్సిలీహిల్స్ పై ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి అధికారుల వివరణ ఒక్కొక్కరిది ఓకో రకంగా ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు "హార్సిలీహిల్స్ డెవలప్ మెంట్ కమిటీ మనుగడలో లేదు" అని తెలుస్తోంది. సబ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఫోన్ అందుబాటులో లేదు. ఆయన అధికారిక ఫోన్ పోలీసుల ఆధీనంలో ఉంది. రెవెన్యూ రికార్డు దగ్ధం కేసులో పాత ఆర్డీఓ హరిప్రసాద్ వినియోగించిన ఆ నంబర్కు సంబంధించి విచారణ జరుగుతోంది.


విల్లాలా.. హోటలా..?
వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్ పై పర్యాటకరంగం అభివృద్ధికి హార్సిలీహిల్స్ పై ప్రముఖ ఒబరాయ్ గ్రూప్ హోటల్ నిర్మాణానికి 20 ఎకరాలు గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కేటాయించింది.
2023 మే 3వ తేదీ
"ఒబెరాయ్ సంస్థ హార్సిలీహిల్స్ పై అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులకు వసతి, సదుపయాలు కల్పిస్తుంది. విల్లాలు నిర్మిస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి" అని పర్యాటక శాఖ తిరుపతి రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణప్రసాద్ వ్యాఖ్యానించారు. అప్పట్లోనే ఆయన అన్నమయ్య జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. నాగభూషణంతో కలిసి హార్సిలీహిల్స్ లో పర్యటించారు. పర్యాటక శాఖ పరిధిలోని భూముల వివరాలు కూడా ఆయన పరిశీలించారు.
"ఒబెరాయ్ హోటల్ యాజమాన్యానికి భూమి అప్పగించి, ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది" అని రమణప్రసాద్ అప్పట్లో ప్రకటించారు. ఇదిలావుంటే..
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి ఏర్పడింది. అధికారంలోకి రాగానే విశాఖపట్టణం సమీపంలోని రుషికొండపై జరిగిన నిర్మాణాల వ్యవహారాన్ని బయటపెట్టింది. అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు నడిచాయి. చివరాఖరికి తేలింది. వైఎస్ఆర్ సీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భవనంలో సీఎం బస చేయడం కోసమే అనే విషయం బట్టబయలైంది. పర్యాటక శాఖ కోసం అని మాజీ మంత్రి ఆర్.కే. రోజా, మిగతా మాజీ మంత్రులు బుకాయించారు. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగానే.. హార్సిలీహిల్స్ లో ప్రైవేటు హోటల్ నిర్మాణానికి అప్పట్లోనే నిర్ణయం జరిగినా, స్థలం అప్పగింత విషయంలో జాప్యం జరిగిందనే విషయం స్పష్టమైంది.
ఆలస్యమైనా వెలుగులోకి
2024 ఆగష్టు 27


హార్సిలీహిల్స్ పై వ్యూ పాయింట్ తో పాటు గవర్నర్ బంగ్లా, టూరిజం రిసార్టులు, ప్రైవేటు అతిథి గృహాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత ఒబెరాయ్ గ్రూప్ హోటల్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. వారి వెంట వచ్చిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి హార్సిలీహిల్స్ ను సందర్శించారు. హోటల్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపారు. వారి వెంట పర్యాటక శాఖ యంత్రాంగం కూడా ఉంది. ఈ ప్రదేశం చల్లటి వాతావరణంలోని పర్యావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
హోటల్ భవనం నిర్మించాలంటే గాలిబండకు కింది భాగంలో ఉన్న లోయలో కేటాయించిన 20 ఎకరాల్లో భారీ భవనాల నిర్మాణానికి బ్లాస్టింగ్ చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి. దాదాపు వందల అడుగులలో నిర్మించే భవనం కోసం కొండను కూడా ఛిద్రం చేసే పరిస్థితి వల్ల వన్యప్రాణుల ఉనికికి ముప్పుతో పాటు పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం లేకపోలుదు.
దీనిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి స్పందించారు.


"రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ మేరకు హార్సిలీహిల్స్లో ఒబెరాయ్ హెటల్ నిర్మాణానికి స్థలం పరిశీలన చేశాం. అని కలెక్టర్ శ్రీధర్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. "హార్సిలీహిల్స్ లో పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం" అని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు.
"ఆ హోటల్ కు స్థలం లీజుకు మాత్రమే ఇస్తున్నాం" అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రభుత్వంతో కుదిరిన ఒప్పదం మేరకు భూమి చూపనున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణానికి నిలయంగా ఉన్న అటవీ సమీపప్రాంతం కావడాన్ని గుర్తు చేస్తే, నిబంధనల మేరకు మాత్రమే వ్యవహరిస్తామన్నారు.
"హార్సిలీహిల్స్ డెవలప్ మెంట్ కమిటీ" మనుగడలో ఉందని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆయన, అందుకు సంబంధించి, ఎప్పుడు నిర్ణయం జరిగిందనే విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు.
అటవీప్రాంతంలో పర్యాటక శాఖ పెత్తనం. రెవెన్యూ విభాగం పర్యవేక్షణ వంటి విచిత్రమైన పరిస్థితి హార్సిలీహిల్స్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ హోటల్ నిర్మాణం వ్యవహారం నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

దీనిపై బీ.కొత్తకోట తహసీల్దార్ శ్రీధరరావ్ స్పందించారు. "నేను కూడా ఈ ప్రాంతానికి కొత్తగానే వచ్చాను. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్ణయాలు అమలు చేస్తున్నాం" అని మాత్రమే చెప్పారు. హార్సిలీహిల్స్ డెవలప్మెంట్ కమిటీపై పూర్తిగా అవగాహన లేదు" అన్నారు.

అడవికి ప్రమాదం లేదా?
హోటల్ నిర్మాణం వల్ల అటవీప్రాంతానికి ప్రమాదం లేదని మదనపల్లె సబ్ డీఎఫ్ఓ మధుసూదన్ చెప్పారు. "ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్కు కేటాయించిన ప్రదేశం బఫర్ జోన్" అని ఆయన అంటున్నారు.
మొత్తం మీద హార్సిలీహిల్స్ లో రాజ్యం ఎవరిది? అటవీశాఖా? రెవెన్యూనా? పర్యాటక శాఖా? అనేది చర్చకు వచ్చింది. స్టార్ హోటల్ నిర్మాణం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు. అనేది మాత్రం చెప్పడం లేదు. లోకల్ అధారిటీ మనుగడపై స్పష్టత లేదు. ఇదిలావుంటే...
అభివృద్ధి జరగాలి..


హార్సిలీహిల్స్ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చేయాలంటే కష్టం. ప్రైవేటు సంస్థల ద్వారా స్వాగతించాలలని అంటున్నారు. మాజీ ఎంఎల్సీ బీ. నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, " పరిశీలించింది స్థలమే కదా? తప్పులేదు. అభివృద్ధి అనేది ఏదో ఒక రూపంలో జరగాలి" అని నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. మారుమూల కొండపై పేరెన్నిగన్న హోటల్ సంస్థ నిర్మాణం చేపట్టడం అనేది వారి రిస్క్ అది. అలాంటి ప్రదేశాలకు సంపన్నులే వెళతారు. ప్రమోట్ చేసుకోవడం అనేది వారి వ్యాపార ఆలోచనపై ఆధారపడి ఉంటుంది" అంటూ ఫిజుబులీటీ ఎంతమేరకు సాధ్యమనేది వేచిచూడాలన్నారు.
"ఇక్కడ 7 స్టార్ హోటల్ నిర్మాణం వల్ల పర్యాటక శాఖకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండబోదు" అని బీ.కొత్తకోటకు చెందిన సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.
మల్లయ్యకొండకూ ఎసరు


తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోనే ఉన్న మల్లయ్యకొండ ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ కొండ కూడా ఛిద్రమయ్యే పరిస్థితి లేకపోలేదని తెలుస్తోంది.
"ఈ కొండపై రిసార్ట్, వ్యూపాయింట్, అడ్వంచర్ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుకు కన్సల్టేటింగ్ సంస్థ అధ్యయనం చేస్తోంది" అని కూడా పర్యాటక శాఖ తిరుపతి రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణప్రసాద్ వెల్లడించారు.
ఈ విషయం అలా ఉంచితే, ప్రస్తుతం హార్సిలీహిల్స్ పై 20 ఎకరాల్లో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి గతంలో నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ఏడాది కిందట పర్యాటక శాఖ అధికారి వెల్లడించారు. స్థల పరిశీలన చేశారు. ఈ శాఖకు కూడా రెవెన్యూ ద్వారా మాత్రమే స్థలం కేటాయింపు జరగాలి. అది కూడా అటవీ భూభాగం నుంచి కావడం గమనార్హం. ఏ శాఖ కూడా వారి పరిధిలో ఆధిపత్యం లేని విధంగా సాగుతున్నారనే విషయం స్పష్టం అవుతోంది.
(ఈ రెండు అంశాలతో పాటు అసలు హార్సిలీ హిల్స్ ప్రత్యేకత ఏమిటి? టౌన్ షిప్ వ్యవహారం అనేది ఇంకో కథనంలో తెలుసుకుందాం)
Read More
Next Story