జగన్ కు.. పార్టీ నేతలు  మొహం చాటేశారా?
x

జగన్ కు.. పార్టీ నేతలు మొహం చాటేశారా?

మాజీ సీఎం వైఎస్. జగన్ సమీక్షలకు నేతలు మొహం చాటేశారా? ఇంతకీ సమీక్షల్లో భవిష్యత్ కార్యాచరణ ఏమి నిర్ణయించారు? ఎవరు.. ఎవరికి భరోసా ఇచ్చారు?


రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధికారం కోల్పోయింది. ఆ తరువాత ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారాయి. రోజుల వ్యవధిలో జరిగిన రెండు సమీక్షలు ఈ అంశాన్ని తెరమీదకు తీసుకుని వచ్చాయి. "ఆత్మస్తుతి పరనింద" మినహా ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో అధికార టీడీపీ కూటమి నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఎదుర్కోవడం కూడా వైఎస్ఆర్ సీపీకి సవాల్ గా మారినట్లు కనిపిస్తున్నది. అందుకు రెండు సమీక్షలు ఊతం ఇచ్చాయి. అందులో ప్రధానంగా..

ఓటమి తరువాత మొదటిసారి పులివెందులకు వచ్చిన మాజీ సీఎం వైఎస్. జగన్ కు రాయలసీమ ప్రాంత కార్యకర్తలు మినహా, నాయకులు మొఖం చాటేశారు. ఈ నెల 19వ తేదీ తాడేపల్లిలో జరిగిన సమీక్షకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. మూడు రోజుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్. జగన్ కు కడప విమానాశ్రయం నుంచి లభించిన స్వాగతం ఊరిట ఇచ్చింది.



విభిన్నమైన అనుభవం


గతానికి భిన్నమైన పరిస్థితిని వైఎస్. జగన్ ఎదుర్కొన్నారు. అధికారంలో ఉండగా పరదాల మాటున పర్యటించినా, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన కళ్లలో పడేందుకు పోటెత్తేవారు. ఈసారి ఆయన కోసం కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఇతర నాయకులు మాత్రమే కనిపించారు. రాయలసీమలో చక్రం తిప్పిన నాయకులు ఎవరూ పులివెందుల క్యాంప్ కార్యాలయం దరిదాపుల్లోకి రాలేదు. అయితే..


మీకు.. మేమున్నాం...
ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీశ్రెణుల్లో ధైర్యం నింపడానికి మాజీ సీఎం వైఎస్. జగన్ యత్నించారు. ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో మండల స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు నాయకులే చక్రం తిప్పారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అయితే ఓటమి తరువాత నాయకులు మొహం చాటేసినా, కార్యకర్తలు మాత్రం అలా ఉండలేకపోయారు. రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలతో మూడు రోజుల పాటు పులివెందులలోని మాజీ సీఎం వైఎస్. జగన్ క్యాంప్ ఆఫీసు పొటెత్తింది. వారి నుంచి జగన్ వినతులు స్వకరించడంతో పాటు
"కళ్లు మూసుకుంటే ఐదేళ్లు గడిచిపోతాయి. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం" అని ఊరడింపు మాటలు చెప్పి పంపారు. కాగా,

2024 ఎన్నికల్లో మూడోసారి వైఎస్ఆర్ సీపీ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఆ పార్టీ 11 శాసనసభ మూడు ఎంపీ స్థానాలు మత్రమే గెలిచింది. అధికారంలో ఉంటూ, ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ సాధించిన సీట్లు వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చాయి.

దీనిపై ఫలితాల రోజే స్పందించిన వైఎస్. జగన్ "అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతల ప్రేమాభిమానాలు ఎమయ్యాయో" అని తీవ్ర స్థాయిలో కలత చెందారు. ఓటమి దారితీసిన పరిస్థితులపై మోధోమథనం చేయడానికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడి హోదాలో మాజీలు, విజేతలతో తాడేపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి కూడా చాలా మంది నాయకులు గైర్హాజరు కావడం ద్వారా షాక్ ఇచ్చారు. వ్యక్తిగత పనులు ఉన్నాయని కొందరు, విమానం మిస్ అయ్యిందని ఇంకొందరు రాయలసీమ ప్రాంత నేతలు నివాసాలకే పరిమితం అయ్యారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మొత్తం 200 మంది పోటీ చేశారు. వారిలో 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. అంటే 186 మంది ఓటమి చెందారు అనే విషయం సుస్పష్టం. అయితే.. ఈ ఫొటోను పరిశీలిస్తేనే ఎంతమంది మొహం చాటేశారనేది అర్థం అవుతుంది.


సమీక్షకు డుమ్మా...
చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆర్కే. రోజా, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదనరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మొదటిసారి పోటీ చేసి, ఓటమి చెందిన విజయానందరెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, మినహా మిగతా వారెవ్వరూ హాజరు కాలేదు. కడప జిల్లా నుంచి బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, నెల్లూరు నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డితో సహా నలుగురైదుగురు హాజరయ్యారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి కూడా ముందు వరుసలో ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి బుట్టా రేణుకతో సహా వేళ్లపై లెక్కించే స్ధాయిల కూడా హాజరు కాలేవు. అనంతపురం జిల్లా నుంచి కూడా అదే పరిస్థితి. సమీక్షకు హాజరైన వారి ఫొటోలే ఆ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇదిలావుంటే..
"ఎస్సీ రిజర్వుడు స్ధానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల పరిస్ధితి దారుణం" అనిపించారు. శింగనమల నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా వీరాంజేయులు, మడకశిర నుంచి ఈర లక్కప్ప మొదటిసారి గాడ్ ఫాదర్ల అండతో పోటీ చేసి, ఓటమి చెందారు. వారిలో శింగనమల నుంచి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ నిరాకరించారు. దీంతో ఆమె భర్త సాంబశివారెడ్డి వీరాంజనేయులును పోటీ చేయించారు. సమీక్షకు మాత్రం జొన్నలగడ్డ పద్మావతిని తీసుకుని వెళ్లారని తెలిసింది. ఇవి రిజర్వుడు సెగ్మెంట్ల నుంచి వెలుగులోకి వచ్చిన వాటిలో మచ్చుకు కొన్ని మాత్రమే. కానీ..
అత్మశోధన ఎక్కడ..?
సాధారణంగా ఎన్నికల్లో ఓటమి చెందిన ఏ పార్టీ అయినా, అందుకు దారితీసిన పరిస్థితులను సమీక్షించుకుంటుంది. కానీ, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడిగా సమీక్షలు నిర్వహించిన వైఎస్. జగన్ మాటల్లో ఎక్కడా ఆత్మశోధన అనేది కనిపించకపోగా, ఆత్మస్తుతి, పరనిందలా మారింది. పథకాల ద్వారా లక్షలాది మందికి రూ. కోట్లు పంపిణీ చేసినా "వారి ప్రేమ, ఆప్యాయత ఏమింది" అనే మాటలు మినహా, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన, సమీక్షించిన, సలహాలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనిపై ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ,
"జనానికి డబ్బు పంపిణీ చేశాం. ఓట్లు ఎందుకు వేయలేదు? అని మాత్రమే అధినేత జగన్ అంటున్నారు. ఇప్పటికీ ప్రధాన నాయకుల వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంత‌ృప్తితో ఉంది" అనే విషయం గుర్తు రావడం లేదన్నారు. ఇక్కడే పార్టీపరంగా తప్పిదం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించారు.
కార్యాచరణ ఏదీ
ఓటమిపై తాడేపల్లెలో ఏర్పాటు చేసిన, సమీక్షకు తాజా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరైన విషయం తెలిసిందే. ఇందులో భవిష్యత్ కార్యాచరణ ఉటుందని భావించారు. అలాంటిదేమీ జరగలేదు. టీడీపీ కూటమి ధికారంలోకి వచ్చాక తమ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి. వారికోసం ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై వైఎస్ఆర్ సీపీలో కీలకనేతగా ఉన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ఫెడరల్ ప్రతినిధి కలకరించారు. "భవిష్యత్ కార్యాచరణా.. అలాంటిదేమీ లేదు. నాకు ఐడియా లేదు" అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. మినహా పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు ఆయన సుముఖత చూపలేదు. 2024 ఎన్నికలలనే ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన స్థానంలో కుమారుడు భూమన అభినయరెడ్డిని మొదటిసారి కరుణాకరరెడ్డి పోటీ చేయించగా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 61,956 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో కరుణాకరరెడ్డి కేవలం 780 ఓట్లతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం కరుణాకరరెడ్డి 41, 539 ఓట్ల మెజారీటీ వచ్చింది.
ఇదిలావుండగా, ఇప్పటికీ చాలా మంది వైఎస్ఆర్ సీపీ మాజీ ప్రజాప్రతినిధులు బయటికి రావడం లేదు. తాజా పరిణామాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుందాం అని భావించినా, ఫోన్లకు కూడా అందుబాటులో లేరు. కొందరు ఏకంగా స్విచ్ ఆఫ్ చేశారు.
Read More
Next Story