
తిరుచానూరు గ్రామం మధ్యలో పద్మావతీ అమ్మవారి పుష్కరిణి.
తిరుచానూరులో 12.10 గంటలకు పంచమీ తీర్థం.. చారిత్రక నేపథ్యం ఇదీ..
పద్మసరోవరం వద్ద టీటీడీ అసాధారణ ఏర్పాట్లు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం (నవంబరు 25వ తేదీ) పంచమీ తీర్థం కుంభ లగ్నంలో మధ్యాహ్నం 12.10 గంటల నుంచి12.20 గంటల వరకు పంచమితీర్థ మహోత్సవం (చక్రస్నానం) నిర్వహణకు ముహూర్తం నిర్ణయించారు. చారిత్రక నేపథ్య కథనం ఉన్న ఆ సమయంలో పద్మపుష్కరిణి (కోనేరు)లో సామూహిక స్నానాలు చేయడానికి పోటెత్తనున్నారు.
తిరుచానూరులో యాత్రికుల రద్దీ నియంత్రణకు టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేసింది. 3,500 మంది పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఎన్సీసీ కాడెట్లు, స్కౌట్లు, శ్రీవారి సేవకులను రంగంలోకి దించారు.
తిరుచానూరులో చక్రస్నానం సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి వచ్చే యాత్రికులకు సదుపాయాలు కల్పించారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలాలు ఎంపిక చేశారు.హోల్లిండ్ పాయింట్లలో అల్పాహారం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
"భక్తుల సౌకర్యార్థం కోసం 150 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశాం. తోళప్పగార్డన్స్‌లో 50, ఎస్వీ హైస్కూల్ వద్ద 15, శ్రీ అయప్పస్వామి (నవజీవన్ ఆసుపత్రి) ఆలయం వద్ద 45, పూడి ఏరియాలో 25., పుష్కరిణి సమీపంలోని ప్రవేశించే ద్వారం- 4 వద్ద, ఎమర్జెన్సీ 15 అన్నప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. క్యూలోని భక్తులకు అవసరమైన తాగునీరు, అల్పాహరం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. పుష్కరిణిలో స్నానాలు చేసిన తరువాత మహిళల కోసం ప్రత్యేకంగా తాత్కాలిక గదులు కూడా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఇంతప్రాధాన్యత సంతరించుకోవడం వెనుక చక్రతీర్ధం నేపథ్య కథనం ఏమిటంటే...
అమ్మవారు ఆవిర్భవించిన తిథిలో..
ఃతిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పాద్మపురాణం ఒకటి. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు. వైకుంఠలో శ్రీవేంకటేశ్వరస్వామి వారు శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్తరుషులు వెతుకుతూ వచ్చారు. స్వామివారు యోగనిద్రలో ఉండి భృగుమహర్షిని చూడలేదు. కోపించిన భృగుమహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు. స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళ లోకానికి వెళ్లిపోయారట.
అమ్మవారి కోసం
శ్రీవారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళ లోకానికి వచ్చారు. అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని 56 దేశాలు తిరిగారు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి వినిపించింది.
''స్వర్ణముఖి నదీతీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు, తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు'' అని తెలిపింది.
స్వామివారు స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకుని 'కుంతలము' అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారు. వాయుదేవున్ని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు. స్వర్ణ కమలాలు వికసించేందుకు వైఖానసాగమోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు.
స్వామివారు క్షీరం(పాలు)ను మాత్రమే ఆహారంగా తీసుకుని 12 సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తప అర్చన చేశారు. 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షం, ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథినాడు వాతావరణం ప్రసన్నమైంది. సహస్రదళ బంగారుపద్మం నుంచి నాలుగు చేతులతో, పద్మాల వంటి కళ్లతో, సకల దివ్య ఆభరణాలు, వస్త్రాలు, పుష్పాలతో శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. సత్యలోకం నుంచి బ్రహ్మ హంస వాహనంపై, కైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు వృషభంపై, సచిదేవి ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, సనకాది యోగులు, సప్తఋషులు, ప్రహ్లాదుడు మొదలైన భక్తులు, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులు ఆకాశం నుంచి రాగా, దేవగంధర్వులు మంగళవాయిద్యాలు మోగిస్తుండగా తామరపూల మాలను శ్రీనివాసుని కంఠానికి శ్రీపద్మావతి అమ్మవారు అలంకరించారు. శ్రీనివాసుడు తామరపుష్పాన్ని అమ్మవారికి అలంకరించారు. 108 దివ్యదేశాల్లో అమ్మవారు స్వామివారికోసం తపస్సు చేసినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పాద్మపురాణంలో ఉండడం విశేషం.
పంచమితీర్థం ఉత్సవం..
పంచమి తీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె, చూర్ణపొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారు. అమ్మవారిని ఆవాహన చేసి శ్రీమంత్రం శ్రీ సూక్తం పఠిస్తారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమితీర్థ మండపానికి వేంచేపు చేస్తారు.
పంచమితీర్థ మండపంలో
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం వెనుక కోనేరు వద్ద ఉన్న పంచమితీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తి, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్ ను ఆశీనులను చేస్తారు. తొమ్మది కలశాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ఉపచారాలు సమర్పిస్తారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె, పసుపు కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు, దివ్యమాలలు, దివ్య ఆభరణాలు, లడ్డూ, వడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీకోదండరామాలయం, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది. అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళతారు.
శ్రీరామస్థూపం
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుష్కరిణి ఒడ్డున శ్రీరామస్థూపం ఉంది. 1970వ దశకంలో శ్రీమన్నారాయణ రామానుజ జీయర్(పెద్దజీయర్) స్వామి ఇక్కడ శ్రీరామస్థూపాన్ని నిర్మించారు. ఆ సమయంలో రామహోమాదులు చేస్తూ 27 రోజులు రామాయణ పారాయణం, హవనం నిర్వహించారు. అనంతరం శ్రీరామస్థూపంలో శ్రీరామకోటి పుస్తకాలను ఉంచి ప్రతిష్ఠ చేస్తారు. ఆ తరువాత చక్రస్నాన ఘట్టం ప్రారంభం అవుతుంది.
తొక్కిసలాట లేకుండా..
తిరుచానూరు వద్ద తొక్కిసలాటకు ఆస్కారం లేని విధంగా టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆలయం సమీపంలోని పుష్కరిణి వద్దకు వెళ్లడానికి టీటీడీ ఇంజినీరింగ్ విభాగం క్యూలు, బ్యారీకేడ్లు, పద్మ పుష్కరిణిలోకి వెళ్లే ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర ఏర్పాట్లు చేసింది.
వాహనాల పార్కింగ్ : పంచమి తీర్థానికి వచ్చేయాత్రికులు వాహనాలను శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్‌యార్డు, రామానాయుడు కల్యాణ మండపం, పుత్తూరు హైవేలో తమిళనాడు, సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే వారు వాహనాలను పూడి జంక్షన్, తిరుచానూరు దళితవాడ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రముఖులకు తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు.
హోల్డింగ్ పాయింట్లు నుంచి తిరుచానూరు పద్మా సరోవరానికి చేరుకోవాలి. యాత్రికుల రద్దీని నివారించడానికి
1.జడ్పీ హైస్కూల్
2. పూడి ఏరియా
3. నవజీవన్ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్లు నుంచి మాత్రమే యాత్రికులు పద్మసరోవరం వద్దకు వెళ్లడానికి వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
హోల్డింగ్ పాయింట్లలోనే కాకుండా, క్యూలో ఉన్న యాత్రికులకు అత్యవసర వైద్య సేవలు అవసమైతే, వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. మూడు ప్రాంతాల్లో పారా మెడికల్ సిబ్బంది తోపాటు ప్రథమచికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐదు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. తిరుపతి స్విమ్స్, రుయా ఆసుపత్రులు, ఆయుర్వేద వైద్యులు వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారని టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం తెలిపారు.
రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కే.వి. మురళీ కృష్ణ తెలిపారు.
"టిటిడి భద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్‌సిసి కాడెట్స్ 200, శ్రీవారి సేవకులు 900, పోలీస్ సిబ్బంది 1600 మంది భద్రతా విధుల్లో ఉంటారని సీవీఎస్ఓ మురళీకృష్ణ చెప్పారు. పుష్కరిణి వద్ద అగ్నిమాపక సిబ్బంది తోపాటు జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
యాత్రికుల రద్దీ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతలు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సోమవారం అధికారులతో సమీక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, జేఈఓ వి. వీరబ్రహ్మం, అధికారులతో కలిసి తుదిసారి ప్రత్యేకంగా పరిశీలించారు.
Next Story

