Palamaneru | కుంకీల విన్యాసాలు భళా..
x
పలమనేరు సమీపంలోని ముసలిమడుగు వద్ద ఉన్న కుంకీ ఏనుగుల క్యాంప్

Palamaneru | కుంకీల విన్యాసాలు భళా..

పర్యాటక ప్రదేశంగా మారనున్న ముసలిమడుగు ఏనుగుల క్యాంప్


శిక్షణలో ఉన్న ఏనుగుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. మావటీల మాటలకు అనుగుణంగా కదులుతున్నాయి. చెప్పిన పని చెప్పినట్టే చేస్తే భళా అనిపిస్తున్నాయి. సందర్శకులకు ముసలిమడుగు ఆకర్షణ అయింది. ఇది పర్యాటక ప్రదేశంగా మారనుంది.

కౌండిన్య అటవీ సమీప ప్రాంతాల్లో ఏనుగులు పంటలపై దాడులకు దిగుతున్నాయి. వాటిని కట్టడి చేయడానికి తీసుకుని వచ్చిన కుంకీ ఏనుగుల కోసం పలమనేరు సమీపంలోని ముసలిమడుగు విడిది కేంద్రం పర్యాటక ప్రాంతంగా మారనుంది.
"ముసలిమడుగు కుంకీ ఏనుగుల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి" అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పలమనేరు అంటే ఏనుగులకు కేరాఫ్ అడ్రస్. దీనికి మొదట గుర్తింపు ఇచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. బస్సులపై లోగో ఏనుగు బొమ్మ వాడడమే ఇందుకు నిదర్శనం.
కౌండిన్య అటవీప్రాంతానికి సమీపంలోనే ఉండే ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఏనుగుల దాడుల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నష్ట నివారణకు అడవుల నుంచి వచ్చే ఏనుగుల మందను దారి మళ్లించడానికి పలమనేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో కుంకీ ఏనుగులకు ముసలిమడుగు వార్ జోన్ గా నిర్ణయించారు. దీనికోసం కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వడానికి మావటీలకు మచ్చిక చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రదేశాన్ని పర్యాటకులకు ఆహ్లాదంగా మార్చాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.

45 ఏళ్ల వెనక్కు వెళితే..
పలమనేరు పట్టణ విస్తీర్ణం పెరగాలని ఆనాటి పెద్దమనుషులు ఆశించారు. ప్రయాణికుల అవసరాల కోసం దాతలు ఇచ్చిన స్థలంలో 1970లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేశారు. ఈ డిపో బస్సులపై ఏనుగు బొమ్మ అధికార చిహ్నంగా కనిపించేది. ప్రస్తుతం పీఎల్ఎన్ఆర్ ( పలమనేరు PLNR) అనే ఇంగ్లిషు అక్షరాలు మాత్రమే కనిపించే విధంగా లోగో మార్చారు. క్లుప్తంగా ఏనుగులకు పలమనేరుతో ఉన్న అనుబంధం ఇది.

ఈ ప్రాంత సీనియర్ జర్నలిస్టు కోటేశ్వర్ఏ ఏమంటారంటే..
"పొలంలో ఏనుగు పాదం మోపిందంటటే ఆ రైతు దశ తిరిగినట్టు భావిస్తారు. అంటే అదృష్టం వెన్నంటి ఉన్నట్లే అనేది మానసిక భావన" అని సుబ్రమణ్యం చెప్పారు. పంటలకు నష్టం జరిగినా భవిష్యత్తు మాత్రం మధురంగా ఉంటుందనేది నాకు స్వతహాగా కలిగిన అనుభవం అని ఆయన అంటారు. చిత్తూరు నుంచి బయలుదేరితే పలమనేరుకు గంట ప్రయాణం. ఈ పట్టణం నుంచి కౌండిన్య నది మీదుగా అంటే రోడ్డు మార్గంలో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల విడిది కేంద్రానికి చేరుకోవచ్చు.
వన్యప్రాణులకు కేంద్రం..
చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో తిరుపతికి సమీపంలో ప్రారంభమయ్యే శేషాచలం అటవీప్రాంతం నుంచి పీలేరు వరకు విస్తరించి ఉంటుంది. అక్కడి నుంచి మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు నుంచి వి.కోట మీదుగా కుప్పం వరకు కౌండిన్య అటవీప్రాంతం విస్తరించి ఉంటుంది. పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు భౌగోళికంగా అటు తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతం అనుసంధానంగా ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి దండెత్తే ఏనుగుల వల్ల కుప్పం, పలమనే నియోజకవర్గాల్లోని అటవీ సమీప గ్రామాలు సమతమం అవుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట, చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి అటవీశాఖ నష్ట పరిహారం చెల్లిస్తూనే ఉంది. ఏనుగుల దాడలు కూడా సాగుతూనే ఉన్నాయి.
కుప్పం ననియాలలో ..
కుప్పం సమీపంలోని రామకుప్పం మండలం అటవీ సమీప ప్రాంతంలోని నినయాల వద్ద 2006లో ఏనుగుల సంరక్షణ కేంద్రానికి రెండు కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు. జయంత్, వినాయక్ కుంకీ ఏనుగులు దాదాపు 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నాయి. పడమటి ప్రాంతంలో కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి గ్రామాలపైకి వస్తున్న మదపుటేనుగుల దాడులు పెరిగాయి. వాటిని మళ్లీ అడవుల్లోకి పంపిచే దిశాగా ననియాల కుంకీ ఏనుగులతో ఆపరేషన్ చేపట్టడం కష్టంగా మారింది.
పలమనేరు ప్రాంతంలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల దాడులు మరింత పెరిగాయి. వరి, అరటి, రాగి చేలతో పాటు మామిడి తోటలను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి.
అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారమే.. 2025 సెప్టెంబర్ నాటికి ఏనుగుల దాడుల్లో 30 మందికి పైగానే మరణించారు. అంతేకాకుండా, 2020-21, 2023-24 కాలంలోనే ఒకో సంవత్సరంలో ఆరుగురు మరణించినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సంఘటనల నేపథ్యంలో అటవీశాఖ యంత్రాంగం కూడా స్పందించింది. ఏనుగుల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు చెల్లిస్తున్నపరిహారం ( Ex-gratia ) ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పెంచి చెల్లిస్తున్నారు.
నష్ట నివారణకు కుంకీ ఏనుగులు

చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పడమటి ప్రాంతంలో జరుగుతున్న కష్టాలు, నష్టాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీరియస్ గా దృష్టి సారించారు.
"ఏనుగుల వల్ల అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లో పంటలు, రైతులకు నష్టం జరగనివ్వం. జనం వల్ల అటవీ ప్రాణులకు ముప్పు ఏర్పడినివ్వం" అని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాపై దృష్టి సారించిన ఆయన కర్ణాటక ప్రభుత్వంతో చర్చించారు.
2025 మే 21వ తేదీ నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలో ఏపీ అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మరుసటి రోజు పలమనేరు సమీపంలోని ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన క్యాంపులో ఉంచారు.
కుంకీ ఏనుగులు అంటే..
అడవుల నుంచి తీసుకుని వెళ్లిన ఏనుగులకు మావటీలు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. మొదట వాటి మానసిక స్థితిని అర్థం చేసుకుంటారు. ఆ తరువాత దానిని మచ్చిక చేసుకునే విధంగా స్నేహం ఏర్పరుచుకుంటారు. సంకేతాలు (Commands) ఇవ్వడం ద్వారా తన మాట వినేవిధంగా మావటీలు ఏనుగులను తమ నియంత్రణలోకి తీసుకుంటారు. ప్రతి రోజూ వాటిని విహారానికి తీసుకుని వెళ్లడం. స్నానం చేయించడానికి పైపుతో నీటిని చిమ్మడం, సమయానికి ఆహారం అందించండి వంటి సేవలతో ఏనుగులకు విశ్వాసమిత్రుడిగా మారతారు.
ఆ తరువాత..
అడవుల నుంచి పల్లెలకు సమీపంలోని పంటలపై ఏనుగులు దాడి చేసిన సమాచారం అందగాను అటవీశాఖాధికారులు, సిబ్బందితో కలిసి సుక్షిత కుంకీ ఏనుగులు తోలుకుని వెళతారు. శిక్షణ ద్వారా నేర్పన అంశాలతో కమాండ్స్ ఇవ్వడం ద్వారా కుంకీ ఏనుగులను మదపుటేనుగుల సమీపానికి తీసుకుని వెళతారు. వాటితో స్నేహం మెలిగే కుంకీ ఏనుగులు సామరస్యంగా మళ్లీ ఆ ఏనుగులను అడవి వైపు మళ్లించండంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
ఆకర్షణ కేంద్రంగా...

కౌండిన్య అటవీప్రాంతంలో తిష్ట వేసి, తరచూ పంటలపై దాడులకు దిగే 14 ఏనుగుల మందను తిరిగి వనంలోకి మరల్చడానికి ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన ఏనుగుల క్యాంపు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 50 ఎకరాల్లో ఇక్కడ క్యాంపు ఉంది. ప్రస్తుతం 20 ఎకరాలు ఏనుగులకు శిక్షణ, తిరగడం, విన్యాసాలు చేయడం కోసం వినియోగిస్తున్నారు. చుట్టూ ఫెన్సింగ్ తో పాటు మావటీల కోసం నివాస గృహాలు కూడా నిర్మిస్తున్నారు. ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం వెటర్నరీ ఆస్పత్రి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో
రాష్ట్రానికి ముసలిమడుగు ఏనుగుల హబ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక్కడ ఏనుగులకు శిక్షణను తిరుపతి, కాకినాడ, చిత్తూరు నుంచి వచ్చిన అటవీశాఖ సిబ్బందికి అధ్యయన కేంద్రంగా మారింది. ఆ సమయంలో కుంకీ ఏనుగులు విన్యాసాలు చేయడం, బరువైన కొయ్యలను అవలీలగా ఎత్తి వేయడం, దూరంగా తీసుకుని వెళ్లడం వంటి విన్యాసాలు ప్రదర్శించాయి. అక్కడ ఈ ఏనుగులకు శిక్షణ ఇస్తున్న తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన మావటీలు కమాండ్స్ (మాటలు ఆచరించడం) ద్వారా ఏనుగులు మనుషులకు ఎలా మచ్చిక అయ్యాయి? అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించాయి.
పలమనేరు సమీప ప్రాంతాల నుంచి కూడా సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు ఫారెస్టు రేంజ్ అధికారి (Forest Range Officsr FRO) నారాయణ చెప్పారు.
"ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఏనుగుల క్యాంపు సమీప ప్రాంతానికి సందర్శకులను అనుమతిస్తున్నాంష అని ఎఫ్ఆర్ఓ నారాయణ తెలిపారు.
వనమహోత్సవ కేంద్రం కావాలి...

ముసలిమడుగు ఏనుగుల క్యాంపును చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సందర్శించారు. ఏనుగులకు శిక్షణ ఇస్తున్న తీరుతో పాటు అవి చేస్తున్న విన్యాసాలను ఆయన పరిశీలించారు.
"ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి" అని కలెక్టర్ సుమిత్ కుమార్ అటవీశాఖాధికారులను ఆదేశించారు. ఈ ఏనుగుల ప్రత్యేకతను డీఎఫ్ఓ సుబ్బరాజు, అడిషనల్ డీఎఫ్ఓ పలమనేర్ డివిజన్ నారాయణ వివరించారు.
"కుంకీ ఏనుగులు ఉన్న పరిసర ప్రాంతాల్లోకి మదపటేనుగులు రాలేవు. అవి రెండు కిలోమీటర్లు దూరంలో ఉండగానే కుంకీ ఏనుగులు పసిగడతాయి. ప్రమాదాన్ని గ్రహించే కుంకీ ఏనుగులు ఒక్క ఘీంకారంతో మావటీలను అప్రమత్తం చేస్తాయి" అని అటవీశాఖాధికారులు కలెక్టర్ సుమిత్ కుమార్ కు వివరించారు. ఏనుగుల సైకాలజీ ఎప్పుడు ఎలా ఉంటుందనే విషయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆసక్తికరంగా ఆలకించారు.
ముసలిమడుగు ఏనుగుల క్యాంపు వద్ద మరింత భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అటవీశాఖాధికారులకు సూచించారు. "ఇప్పుడు కార్తీకమాసం ప్రారంభమైంది. ఇక్కడే వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయండి. సందర్శకులను ఆకర్షించడంతో పాటు వారి వల్ల ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారడానికి అవసరమైన చర్యలు తీసుకోండి" అని కలెక్టర్ అటవీశాఖాధికారులకు సూచించారు. ఏనుగుల క్యాంప్ వద్ద సందర్శకులకు కూడా ప్రమాదం లేని విధంగా భద్రతా చర్యలతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
Read More
Next Story