
పెద్దశేషవాహనంపై పరమపద నాథుడి అలంకారంలో సిరులతల్లిగా..
తిరుచానూరులో వైభవంగా సాగుతున్న పద్మావతీ అమ్మవారి ఉత్సవాలు
అల్పపీడన ప్రభావంతో వర్షం కురుస్తున్నా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు. ఏడు తలల పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వర్షం కురుస్తుండడంతో ఘటాటోపం (గొడుగు) కింద అమ్మవారి పల్లకీసేవ నిర్వహించారు. మాడవీధుల్లో బారులుదీరిన యాత్రికులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందించారు.
వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరింద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, పలువురు అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వాహనసేవలో..
కోయల కళాప్రదర్శన ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాథాకృష్ణల పదవిన్యాసం యాత్రికులను మంత్రముగ్ధులను చేసింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల తరహాలోనే తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఉత్సవాల్లో కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. దేశంలోని విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు పరస్పర అవగాహన చేసుకునే విధంగా నాణ్యమైన కళారూపాలకు ప్రాధాన్యత ఇచ్చామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

