ఓటమి భయంతోనే  రోజా ఆ మాట అన్నారా?
x

ఓటమి భయంతోనే రోజా ఆ మాట అన్నారా?

పార్టీ నాయకుల సహాయ నిరాకరణ. పోలింగ్ తీరులో వ్యత్యాసం. ఎమ్మెల్యే ఆర్కే రోజా మాటల్లో తేడా రావడానికి ఇవన్నీ ఆస్కారం కల్పించాయా?. ఆమె మాటల వెనుక ఆంతర్యం ఏమిటి?


తిరుపతి: పోలింగ్, అంతకుముందు వ్యతిరేక స్వరం వినిపించిన కీలక నాయకులందరూ పక్కకు తప్పుకున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సినీ కథానాయిక ఆర్కే రోజా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. పోలింగ్ సరళిని పరిశీలించే సమయంలో పుత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. " నన్ను ఓడించడానికి మా పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారు‌‌‌’’ అన్న వ్యాఖ్యలతో నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలిందని ఆమె చెప్పకనే చెప్పారని ప్రజలంతా భావిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న వేళ రోజా ఇలా వ్యాఖ్యానించడం సబబు కాదనే అభిప్రాయాలు కూడా విశ్లేషకుల నుంచి వ్యక్తం అయ్యాయి.

ఐదేళ్లలో తలకిందులు

వాస్తవానికి నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల కీలక నాయకులు వైఎస్సార్సీపీ బాధ్యతలను ఒంటి భుజంపై మోశారు. 2014 ఎన్నికలకు ముందు ఆర్కే రోజా ఆ నాయకులందరి ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు, అన్ని వ్యవహారాల్లో ఆర్కే రోజా భర్త ఆర్కే. సెల్వమణి, సోదరులు రాంప్రసాదరెడ్డి, కుమారస్వామి రెడ్డి జోక్యం ఎక్కువ అయింది. అవినీతికి అంతులేకుండా పోయింది. భూ ఆక్రమణలు పెరిగాయంటూ అప్పటి అసంతృప్తి నాయకులు ఏకధాటిగా ఆరోపణలు సందించి వైఎస్ఆర్సిపి అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేదని ప్రధాన నాయకులందరూ ఒక్కొక్కరుగా బాధ్యతలు నుంచి తప్పుకున్నారు. 2,02,574 మంది ఓటర్లు ఉన్న నగరి నియోజకవర్గంలోని 231 పోలింగ్ కేంద్రాల ద్వారా 2019 ఎన్నికల్లో 87.09 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గి 81.09 శాతంగా నమోదయింది.

వైయస్సార్సీపికి రాజీనామా..

వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నగరి నియోజకవర్గంలోని కీలక నాయకులు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. వారిలో రాష్ట్ర ఈడిగ సంఘం కార్పొరేషన్ చైర్ పర్సన్ కేజీ శాంతి ఆమె భర్త కేజే. కుమార్ ఈ ఎన్నికల తటస్థంగా మిగిలిపోయారు. వారి అనుచరులతో పాటు, వడమాలపేట జెడ్పిటిసి సభ్యుడు మురళీధరరెడ్డి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, నిండ్ర మండల నాయకుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఏలుమలై ( అములు), లక్ష్మిపతిరాజు సహా ఇద్దరు ఎంపీటీసీ, ఆరుగురు సర్పంచ్‌లు, 24 మంది కీలక నేతలు పోలింగ్ జరగడానికి వారం ముందే టిడిపిలో చేరిపోయారు. పార్టీని వీడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రముఖిగా మారారు. ఈమె నుంచి నియోజకవర్గాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది" అన్నారు. వీరందరి నిష్క్రమణ నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తీవ్ర ప్రభావం చూపుతుదని అంచనా వేశారు.

పోలింగ్‌పై తీవ్ర ప్రభావం

ప్రత్యర్థులపై మాటలతో విడుచుకుపడే ఎమ్మెల్యే ఆర్కే రోజా.. నగరి నియోజకవర్గంలో కూడా చేతల రూపంలో వ్యవహరించిన తీరు దెబ్బతీసిందని ప్రచారం జరుగుతోంది.నగరి వైఎస్సార్సీపీలో ఐదేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సోమవారం జరిగిన పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు ప్రధానంగా ఉదయం నుంచి అనేక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆర్కే రోజా.. "మా పార్టీ వాళ్లే నన్ను ఓడించాలని చూస్తున్నారు. రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారు, ఆ పదవిలో ఉన్నవారు.. సీఎం వైఎస్. జగన్ నుంచి పదవులు పొందిన వారు నన్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఏజెంట్ల కొరత

అసంతృప్తితో తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సిపి వీడిన నాయకులు ప్రాతినిధ్యం వహించే మండలాల్లో కొన్ని చోట్ల వైఎస్ఆర్సిపికి ఏజెంట్లు దొరకడం కూడా కష్టతరమయిందని సమాచారం. అందులో ప్రధానంగా నిండ్ర మండలం, పుత్తూరు పట్టణంలోని ఎన్జీవో కాలనీతి పాటు మరో రెండు కేంద్రాల్లో, విజయపురం మండలంలో రెండు కేంద్రాల్లో, వడమాల పేట మండలంలోని రెండు చోట్ల, నగరి రూరల్ పరిధిలో కూడా ఏజెంట్లు లేకుండా పోయారని తెలిసింది. ఈ పరిణామాలు అధికార వైయస్సార్సీపీని బాగా దెబ్బతీసే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

అందరూ కలిస్తేనే అంతంత... మెజారిటీ

నగరి అసెంబ్లీ స్థానంలో మంత్రి ఆర్కే రోజా వెనుక వైఎస్ఆర్సిపిని వీడిన నాయకుల పాత్ర కీలకమైనది బహిరంగ రహస్యం. వారంతా కలిసి పనిచేస్తేనే, మంత్రి ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంలో 2014లో 858 ఓట్లు, 2019లో 2,007 ఓట్లతో గట్టెక్కారు. ప్రస్తుత 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా నిస్తేజంగా మాట్లాడిన తీరు వెనక ఆంతర్యం ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ సరళి, ఓటింగ్ తీరు, పార్టీలోనే మిగిలి ఉన్న ఇంకొందరు సహాయ నిరాకరణ తనకు దెబ్బతీసిందని ఆమె ఆందోళన చెందుతున్నదనే విషయం బహిర్గతమైంది.

Read More
Next Story