బాలాజీ రైల్వే డివిజన్ ప్రకటించే వరకు ఉద్యమం...
x

బాలాజీ రైల్వే డివిజన్ ప్రకటించే వరకు ఉద్యమం...

రూ. 300 కోట్ల ఆదాయం ఇస్తున్న తిరుపతికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సంఘాలు.


రైల్వే డివిజన్ తో రాయలసీమకు న్యాయం. ప్రజలు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి.

వెనుకబడిన రాయలసీమ రైతులకు, విద్యార్థులకు, వ్యాపారులకు,శ్రీవారి భక్తులకు ఎంతో మేలు చేసే తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ ప్రకటించాలని తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి డిమాండ్ చేసింది. అంతవరకు ఉద్యమం ఆగదని రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ స్పష్టం చేశారు.

తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ప్రకటించాలనే డిమాండ్ తో తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్,ఆటో ర్యాలీ నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సమీపంలోని తారకరామా స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బాలాజీ కాలనీ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం మీదుగా వెస్ట్ చర్చి, ఎంఆర్ పల్లి కూడలి,అన్నమయ్య సర్కిల్,లక్ష్మీపురం సర్కిల్, పూర్ణకుంభం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ సాగింది.


బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ ఏమన్నారంటే..

"తిరుపతి స్టేషన్ ప్రయాణికులకు విస్తృత సేవలు అందిస్తోంది. ఏటా సుమారు 300 కోట్ల రూపాయలు ఆదాయం ఇక్కడి నుంచే రైల్వే శాఖకు వస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ కు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ సుదీర్ఘకాలంగా రైల్వే డివిజన్ అందని ద్రాక్షగా మారింది" అని గిరిధర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతికి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడానికి అన్ని వనరులు, సదుపాయాలు ఉన్నాయి. గతంలో మంజూరు చేసిన రైల్వే డివిజన్ గుంటూరుకు తరలించారు. విజయవాడ దీనికి సమీపంలోనే ఉన్న గుంటూరు కూడా రైల్వే డివిజన్ చేశారు.

గిరిధర్ వాదన ఇదీ...


తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ చేసినప్పటికీ, ఆ అవకాశం గుంటూరుకు తన్నుకొని పోయారని ఆయన గుర్తు చేశారు. గుంటూరు విజయవాడ పక్కపక్కనే ఉన్నప్పటికీ రెండు డివిజన్లుగా ఉన్నాయన్నారు. తిరుపతికి పక్కనే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని ఓబులవారిపల్లె విజయవాడ డివిజన్లో ఉండడం ఎంతవరకు సబబు అని గిరిధర్ ప్రశ్నించారు.

గుంతకల్లు డివిజన్ కార్యాలయం తిరుపతికి 350 కిలోమీటర్లు దూరంలో ఉందని, తిరుమలకు వీఐపీలు ఇతర ప్రముఖులు వచ్చిన సందర్భంలో రైల్వే అధికారులకు కూడా ఇబ్బందిగా మారిందని గిరిధర్ వివరించారు.

రైతులకు మేలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు

తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ రైతులకు మేలు చేస్తుందని రైల్వే డివిజన్ సాధన సమితి అభిప్రాయపడింది.

రాయలసీమ జిల్లాలోని బొప్పాయి, అరటి టమోటా, వేరుశనగ, మామిడి ఇతర కూరగాయల పంటలను ఢిల్లీ,ముంబై, కలకత్తా వంటి దూర ప్రాంతాలకు రవాణా చేసే గూడ్స్ సౌకర్యం మెరుగవుతుందని గిరిధర్ గుర్తు చేశారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్వ దినాల్లో అదనపు రైళ్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని,భారతదేశంలో రైల్వే నిబంధాల మేరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైల్వే డివిజన్ గా తిరుపతిని ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి ని బాలాజి డివిజన్ గా ప్రకటించాలని గత 30 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉందన్నారు.

తిరుపతిని మరిచారు..

మాట్లాడుతున్న కుప్పాల గిరిధర్ కుమార్

విశాఖపట్నంను రైల్వే జోన్ గా ప్రకటించిన సమయంలో కూడా తిరుపతిని మరిచిపోవడం బాధాకరమని సాధన సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేల పరంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంద్ర ప్రాంతానికి జోన్, డివిజన్ ఉంది. కోస్తా ప్రాంతానికి విజయవాడ,గుంటూరు డివిజన్లు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలకు కు మాత్రం గుంతకల్ డివిజన్ ఒక్కటే ఉంది.

రాయలసీమ జిల్లాల్లోని అన్ని వర్గాలకు మేలు చేయడానికి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం ఇటీవల కేంద్ర మంత్రులను కలిశామని గిరిధర్ కుమార్ చెప్పారు.

"సంక్రాంతికి స్వగ్రామం నారావారిపల్లికి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కూడా కలుస్తాం. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం కేంద్రంలోని పెద్దలతో మాట్లాడమని కోరుతాం" అని గిరిధర్ చెప్పారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితిలో కీలకపాత్ర పోషిస్తున్న వారిలో తిరుపతి ఫిలిం ఛాంబర్ చైర్మన్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఛాంబర్ అఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి చౌదరి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ విశ్వనాథ్ రెడ్డి, నాయకులు సూరినేని బుజ్జి బాబు నాయుడు,కె.కళాదర్,స్విమ్స్ కార్మిక నాయకులు కృష్ణమూర్తి, సి.ఆర్.కె శేషగిరి రావు, యు.ప్రసాద్ రావు, సి.కృష్ణయ్య, మునీశ్వర్ రెడ్డి,టీ వి రావు, తిరుపతి రైల్వే శ్రీ సుదర్శన ఆదర్శ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ ఐ ఎస్ ఖాజా, టిడిపి నాయకులు కృష్ణ యాదవ్, జనసేన పార్టీ నాయకులు రాజేష్ యాదవ్, ఓబుల్ రెడ్డి, ఆట యూనియన్ నాయకులు కార్మిక నాయకులు విద్యార్థులు యువజన, విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More
Next Story