ప్రతిపక్ష హోదా దక్కలేదే.. సీట్ ఎక్కడ కేటాయిస్తారు..!?
అంచనాలు తారుమారయ్యాయి. లెక్కలు తలకిందులు అయ్యాయి. అధికారంలోకి వస్తామనుకున్నా వైఎస్ఆర్సిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ పార్టీకి ఆ హోదా దక్కుతుందా?
అధికారం రాజకీయ నేతలకు ఆరో ప్రాణం. అధికారానికి దూరమైతే ప్రాధాన్యత కూడా తగ్గుతుంది. ఆ కోవలో, ప్రతిపక్ష నాయకుడికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే నిబంధనల ప్రకారం కొన్ని వర్తించవు. ఈ ప్రకారం మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటారు. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది. భద్రత కూడా ఏ స్థాయిలో ఉంటుందనేది చర్చకు వచ్చింది.
"ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు సందేహాలకు కూడా ఆస్కారం కల్పించాయి. దీనివల్ల వైయస్ జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కకపోవచ్చు. అని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. " రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో హుందాతనం ఉండాలి. లీడర్ అఫ్ ది హౌస్, స్పీకర్ నిర్ణయించుకుంటే అదేమీ పెద్ద సమస్య కాదు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వచ్చు. అని డాక్టర్ తిప్పారెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా..
ఫలితాలు వెలువడిన తరువాత
తాజాగా మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. " ప్రభుత్వం ఏర్పాటు కాకముందే, టిడిపి ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. వత్తులతో పోలీసులు మెదలకుండా ఉన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి" అని వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతకుముందే అభద్రతాభావాన్ని వైఎస్. జగన్ వ్యక్తం చేశారు.
దానికంటే ముందు.. మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి " వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది" అని అమెరికాలో బోరున విలపించారు. ఇవన్నీ శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో, భద్రతాపరంగా ఏర్పడే అంశాలను కూడా వారు దృష్టిలో ఉంచుకున్నారా అనేది చర్చగా మారింది.
ప్రధాన ప్రతిపక్ష హోదా...
చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే, మొత్తం ఆ సభలోని స్థానాల్లో 10 శాతం సభ్యుల సంఖ్య బలం ఉండాలి. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 స్థానాల్లో 10 శాతం అంటే 18 సీట్లు సాధించుకున్న పార్టీ నేతకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. దీనివల్ల కొన్ని ప్రాధాన్యాలు ఉండే విధంగా నిబంధనలు రూపొందించారు. మొత్తం స్థానాల్లో ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు సాధించిన పార్టీ నేతకు నిబంధనల మేరకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అసెంబ్లీలో కూడా సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా పిఎస్, పిఏతో పాటు సిబ్బంది అలవెన్సులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మంత్రి స్థాయిలో క్యాబినెట్ హోదా సదుపాయాలు కూడా ఉంటాయి.
చర్చల సందర్భంలో..
సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాలలో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీగా పాటిస్తారు. సభలో వివిధ అంశాలపై ప్రశ్నలు వేయడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యత ఉంటుంది. సభలో బిల్లులు పై చర్చించే అంశంలో కూడా సంఖ్యాబలాన్ని బట్టి కూడా సమయం కేటాయిస్తారు ఇవి సాధారణంగా శాసనసభ వ్యవహారాలలో పాటించే నిబంధనలు.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి
2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టిడిపి 135, జనసేన 21, బిజెపికి 8 అసెంబ్లీ స్థానాలు దక్కితే, ఐదు సంవత్సరాలపాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఎన్నికలు ఎదుర్కొన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సిపి 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో వైఎస్ఆర్సిపి లెజిస్ట్రేచర్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు కూడా దక్కలేదు. దీంతో వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష హోదా కూడా అర్హత సాధించలేరు. దీనివల్ల రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీటు ఎక్కడ కేటాయించాలని అంశంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది.
శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుంటే క్యాబినెట్ ర్యాంకు స్థాయి సదుపాయాలు ఉండవు. నిబంధన ప్రకారం అసెంబ్లీలో మాట్లాడే సమయం కూడా నిమిషాల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు.
ఓ గది కేటాయింపు
ఎన్నికల్లో గెలిచిన సంఖ్యాబలాన్ని బట్టి ఆయా పార్టీలకు అసెంబ్లీలో శాసనసభ పక్ష కార్యాలయాలను స్పీకర్ కేటాయిస్తూ ఉంటారు. దీనిని లెజిస్ట్రేచర్ పార్టీ ఆఫీస్ అని సంబోధిస్తారు. ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి కి ఓ గది కేటాయిస్తారు. ప్రత్యేక కారణాల రీత్యా మినహా సెక్యూరిటీ కూడా తక్కువగానే ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి అయినందువల్ల ఆ క్యాడర్లోని రక్షణ వ్యవస్థ ఆయనకు వుంటుంది.
గతంలో..
వైఎస్ఆర్సిపి వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన మొదటి ఎన్నికల్లో 67 స్థానాలు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించారు. ఆ సందర్భంలో ఆయన తన పార్టీ నుంచి రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అర్హత ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి వైఎస్ఆర్ సీపీకి లేకుండా పోయింది.
ప్రతిపక్ష సమస్య ఎప్పటి నుంచి..
ఎన్నికల్లో గెలిచిన తరువాత మెజారిటీ సీట్లు సాధించే పార్టీ అధికారం చేపడితే, తక్కువ సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేది. 1977 వరకు ప్రతిపక్ష నేత హోదా లేదనే విషయం పార్లమెంటరీ రికార్డులు చెబుతున్నాయి. రెండో పెద్ద పార్టీగా మాత్రమే పరిగణించే వారు. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం వల్ల రెండో స్థాయిలో ప్రతిపక్ష నేత హోదాకు పార్లమెంటు, శాసనసభలో చట్టబద్దత కల్పించారు. అప్పట్లో
రూపొందించిన నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతలకు కొన్ని సదుపాయాలు కల్పించడం చట్టపరంగా ఆనవాయితీగా మారింది.
రాజకీయ వ్యవహారాల్లో హుందాతనం ఎంత అవసరమో.. ప్రజల కు ఇచ్చే ప్రాధాన్యత అంశాల్లో పట్టువిడుపు అనేది కూడా అలాగే ఉండాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు అవసరమైన 55 స్థానాల్లో రెండు సీట్లు పార్లమెంటులో తగ్గాయి. ఈ అంశాన్ని ప్రస్తావించిన మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి మాట్లాడుతూ,
" మేధావులు ఉండే పార్లమెంటులోని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియా గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆమె స్థానంలో పశ్చిమ బెంగాల్కు చెందిన అజయ్ నిరంజన్ చౌదురిని నియమించారు." అని డాక్టర్ తిప్పారెడ్డి గుర్తు చేశారు. దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్న నాయకులు ఇటువంటి అంశాల్లో గౌరవప్రదంగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని డాక్టర్ తిప్పారెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story