శేషాచలం అడవుల్లో  ఎర్ర పుష్పాలపై ఆపరేషన్ కగార్
x

శేషాచలం అడవుల్లో 'ఎర్ర పుష్పాలపై ఆపరేషన్ కగార్'

సంవత్సరంలో ఏరివేస్తామని హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.


శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వనాలు కాపాడుకునేందుకు స్మగ్లర్లను ఏరివేయడానికి ఆపరేషన్ కగార్ చేపడతామని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ తీవ్ర స్ధాయిలో హెచ్చరించారు. తిరుపతిలో శనివారం మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళం సమీపంలోని ఎర్రచందనం గోదాములో నిలువలు పరిశీలించారు.


ఆతరువాత రాయలసీమలోని ఐదు జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులతో శనివారం తిరుపతి కలెక్టరేట్లో అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.


"సిద్ధాంతపరంగా పోరాటాలు సాగించే వామపక్ష తీవ్రవాదం వల్ల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. ఆపరేషన్ కగార్ ద్వారాఎన్డీఏ ప్రభుత్వం దారికి తెచ్చింది" అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

"ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, స్మగ్లింగ్ సాగుతోంది. ఎర్రదొంగలను కట్టడి చేయడానికి శేషాచలం అటవీప్రాంతంలో ఆపరేన్ కగార్ తరహాలోనే సాయుధ దళాలను రంగంలోకి దించుతాం" అని అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఎర్రచందనం శ్రీవారి రక్తమే..
ఎర్రచందనం వనాల వెనుక పురాణాల నేపథ్యం ఉందనే విషయాన్ని అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
"ఎర్రచందనం అనేది శేషాచలం అడవుల్లో తప్ప ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అపురూపమైన అటవీ సంపద. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి గాయం అయినప్పుడు, ఆయన రక్తంతో ఉద్భవించిన వృక్షంగా ఎర్రచందనాన్ని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ అపురూప సంపద శేషాచలంలో తప్ప మరెక్కడా ఇంత నాణ్యతతో ఉండదు" అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇది హిందువుల మనోభావాలతో, వారి నమ్మకాలతో ముడిపడి ఉన్న గొప్ప వృక్ష సంపద. దీన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి పవన్ కళ్యాణ్ కోరారు.
స్మగ్లర్లను ఏరివేస్తాం...

ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేసే వారు పద్ధతి మార్చుకోవాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. లేకుంటే సంవత్సరంలోగా ప్రత్యేకమైన ఆపరేషన్ ద్వారా ఎర్రచందనం అక్రమ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరినీ ఏరివేస్తామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, ముందున్న అవకాశాలు, అవరోధాలు అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అధికారుల సమీక్షలో ఏమన్నారంటే..
అధికారులతో అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షలో ఘాటుగానే స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ,
"సిద్ధాంతపరమైన భావజాలం ఉన్న వామపక్ష వాద తీవ్రవాదాన్ని దేశ శ్రేయస్సు దృష్ట్యా "ఆపరేషన్ కగార్" పేరుతో కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టేయాలని భావిస్తోంది. మేం కూడా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. వారు స్వచ్ఛందంగా ఈ అక్రమ రవాణాను మానుకుంటే మంచిది. అలా కాకుంటే మేం కూడా కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా వచ్చే ఏడాది కాలంలోనే ఎర్రచందనం స్మగ్లర్లు లేకుండా చేస్తాం. ఇది మా హెచ్చరిక. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ఎంతగా దృష్టిపెడుతుందో, ప్రకృతి సంపదను రక్షించడంలో కూడా అంతే ప్రాధాన్యాన్ని తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి మార్గదర్శకంలో మేం దానికి కట్టుబడి ఉన్నాం. కేంద్రం సహకారంతో మన సంపద మనకు వస్తోందని ఆయన వివరించారు
ఎర్రచందనం స్వాధీనంపై ఏమన్నారంటే..
"నేను కుంకి ఏనుగుల కోసం కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ అటవీ అధికారులు నాకు కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకు అని ఆరా తీస్తే.. ఆంధ్రప్రదేశ్ లో నరికి అక్రమంగా తరలించిన ఎర్రచందనం దుంగలను కర్ణాటక అటవీ అధికారులు పట్టుకొని అక్కడే వేలం వేసి, రూ. 140 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు చెప్పారు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది" అని పవన్ కల్యాణ్ వివరించారు.
తాను అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేపాల్ లో ఉన్న వేలకోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను దేశ ఒప్పంద సహకారంతో వెనక్కు తీసుకురాగలిగాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అలాంటిది రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంపదను ఇతర రాష్ట్రాల అధికారులు పట్టుకొని అక్కడే వేలం వేసుకుంటున్నారు. దీనిపై కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ తో మాట్లాడి, శేషాచలం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దేశంలో ఏ రాష్ట్రంలో దొరికిన తిరిగి ఆంధ్రప్రదేశ్ కే దక్కేలా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ అయ్యేలా చేశాను అని వివరించారు. దీంతో ఇటీవల గుజరాత్, ఢిల్లీ హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దొరికిన సుమారు రూ. 20 నుంచి రూ. 25 కోట్ల విలువ చేసే ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి తీసుకుని వచ్చాం. కేంద్రం సహకారంతో మన రాష్ట్ర సంపద మళ్ళీ మనకు వచ్చినట్లయింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడా ప్రత్యేకంగా మాట్లాడాననీ, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం అని కోరినట్లు ఆయన చెప్పారు.
నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించాం
ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన నలుగురు కింగ్ పిన్స్ ను ప్రత్యేకంగా గుర్తించాం అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. వారిని ప్రత్యేక వ్యూహంతో పట్టుకుంటాం అని హెచ్చరించారు. కడపలో కొన్ని ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ప్రత్యేకంగా ఎర్రచందనం నరకడానికి వస్తున్నారు. వారికి ఉపాధి లేకపోతే స్థానికంగా ఉండే అధికారులను కలవాలి. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఉపాధి కోసం శేషాచలంలోని విలువైన ఎర్రచందనం చెట్లను నరికితే సహించేది లేదనీ, ఆపరేషన్ కగార్ తరహాలోనే... ఎర్రచందనం చెట్లు నరికే అక్రమ రవాణా దారులపై కూడా ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెడతాం అని స్పష్టం చేశారు. ఎవరైనా చెట్టు నరకాలి అంటే భయపడే పరిస్థితులు తీసుకువస్తాం. ప్రత్యేక చట్టంతో ఎర్రచందనం స్మగ్లర్లు ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. కచ్చితంగా ఉక్కుపాదం మోపుతాం. ఇది అక్రమంగా చొరబాటయ్యే రెడ్ స్మగ్లర్లందరికీ హెచ్చరిక జారీ చేశారు.
ఓ పెద్ద అడవినే కొట్టేశారు
ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో 2014 నుంచి 2019 వరకు ఓ విధానం ఉంటే, 2019-24 మధ్య దారుణమైన విధానంతో ఎర్రచందనాన్ని ఖాళీ చేశారని తెలిపారు. అటవీ శాఖ ప్రత్యేక గోదాములో 2 లక్షల 60 వేల దుంగలు ఉన్నట్లు అధికారులు ఆయన చెప్పారు. రెండు దుంగలు కలిపి ఒక చెట్టుగా అనుకున్నా, లక్ష 30వేల చెట్లను నరికి వేసినట్లు అర్థమవుతుందని ఆయన అంచనా వేశారు.
"శేషాచలం నుంచి అక్రమ రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన సంపద ఉంది. ఇది కేవలం పట్టుబడిన సరుకు మాత్రమే. 2019-24 మధ్యలో పట్టుబడకుండా తరలిపోయిన సంపద రూ. 10 వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీని కట్టడికి ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తాం. ఒక్క దుంగ కూడా రాష్ట్రం దాటి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం" అని పవన్ కల్యాణ్ శపథం చేశారు.
సీరియస్ గా తీసుకోండి..
తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో రాయలసీమ, నెల్లరు జిల్లాల ఎస్పీలు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ఫస్టమైన ఆదేశాలు జారీ చేశారు.
" నేను చెప్పింది ఒక్కటే.. ఇకనుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం మీద దృష్టి పెట్టాలి. ఇది హిందువుల మనోభావాలకు, సెంటిమెంట్ కు సంబంధించిన విషయం. చెట్టు నరకక ముందే వన సంపదను కాపాడుకుని నేరాలను నిరోధించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా వల్ల తలెత్తే శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించాలి" అని ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, తిరుమల అటవీ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం, డి.ఎఫ్.ఒ. రవిశంకర్ శర్మ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story