రెవెన్యూ రికార్డుల దగ్ధంపై..  రంగంలోకి దిగనున్న నిపుణులు
x

రెవెన్యూ రికార్డుల దగ్ధంపై.. రంగంలోకి దిగనున్న నిపుణులు

రెవెన్యూ రికార్డుల దగ్ధంలో సీఐడీ విచారణ ఎలా సాగిస్తోంది. తహసీల్దార్ ఆఫీసుల్లో వివరాల సేకరణకు కలెక్టర్ ఏమి చేశారు. మదనపల్లెకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రత్యేక నిపుణులు రానున్నారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లా (అన్నమయ్య జిల్లా) మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధం వెనుక తెరచాటు వ్యవహారాలను బహిర్గతం చేయడానికి దర్యాప్తు ముమ్మరమైంది. సీఐడీ నుంచి పది, మరోపక్క రెవెన్యూ ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. తప్పిదమా? కేట్రా? ప్రమాదమా? అనేవి తేల్చడానికి సాయంత్రం ఇంకొందరు జాతీయ సంస్థల నిపుణులు కూడా రానున్నారు.

ఈ వ్యవహారం నిగ్గు తేల్చడానికి సీఎం ఎన్. చంద్రబాబునాయుడు సీరియస్ గా స్పందించారు. మదనపల్లెకు వెళ్లాలని మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పీ. సిసోడియాను ఆదేశించారు. దీంతో మంగళవారం సాయంత్రం ఆయన మదనపల్లెకు రానున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనే విషయంలో ఈ పాటికే సూత్రప్రాయంగా ఓ నిర్ధారణకు వచ్చారు. మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ఈ వ్యవహారం నిగ్గుతేల్చడానికి ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, .జెన్కో ఎండీతో పాటు, నాగపూర్ నుంచి ప్రత్యేక బృందం మదనపల్లెకు రానుంది. ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజ్ కుమార్ సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు.


చురుగ్గా విచారణ
రికార్డుల దగ్ధం ఘటనపై విచారణాధికారి, అన్నమయ్య జిల్లా ఏఎస్పీ రాజ్ కమల్ మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, ఈయనకు ముందు పనిచేసిన మురళీ, కార్యాలయ సూపరింటెండెంట్ గౌతం తేజను విచారణ చేస్తున్నారు. వారి నుంచి వాగ్మూలం కూడా నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా, సబ్ కలెక్టరేట్ లోని 38 మంది సిబ్బందిని కూడా విచారణకు పిలిపించారని తెలుస్తోంది. సోమవారం కొందరి అనుమానిత అధికారుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నికి నిషేధిత భూములకు సంబంధించిన రికార్డులు, ల్యాండ్ కన్వర్షన్ రికార్డుల దరఖాస్తులతో ఉన్న పత్రాలు కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సీఎం ఎన్. చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం మదనపల్లెకు చేరుకుని విచారణ సాగించిన విషయం తెలిసిందే. వారి రాకకు ముందే తిరుపతి సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విచారణ ప్రాధమిక నివేదికను డీజీపీ ద్వారకా తిరుమలరావుకు అందించారని సమాచారం. ఘటన సమాచారం అందించడంలో మదనపల్లె ఆర్డీఓ, రెవెన్యూ, పోలీస్ అధికారుల అలసత్వం ఉందనే విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు.

జరిగిన సంఘటన తీవ్రమైనది కావడం, సీఎం ఎన్. చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు కూడా తన బృందంతో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. "ఇది షార్ట్ స్క్యూట్ కాదు" అని నిర్ధారించిన నేపథ్యంలో "ఘటన జరగడానికి కుట్ర ఉంది" అనే కోణంలో పోలీస్, సీఐడీ బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇదిలావుండగా,
నేడు మదనపల్లెకు సిసోడియా
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గంపై సీఎం ఎన్. చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై విచారణ కోసం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, ఇంకొందరు ఉన్నతస్థాయి అధికారులు మదనపల్లె బయలు దేరారు. ఘటనపై విచారించేందుకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా రానున్నారు. ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీ జెన్‌కో సీఎండీలు కూడా ఘటనా స్థలానికి వెళ్లి తమ శాఖలకు సంబంధించిన అంశాలపై విచారణ జరపనున్నారు. అమరావతి నుంచి బయలు దేరిన సిసోడియా సాయంత్రం 4 గంటలకు మదనపల్లె చేరుకుంటారని సమాచారం. అంతేకాకుండా, నాగపూర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేప్టీ ఇంజినీరింగ్ సంస్థ నుంచి నిపుణులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిపించనుంది. పైళ్ల దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. చిన్న ఆధారం కూడా వదలకుండా ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోవాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
రంగంలోకి పది బృందాలు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ సారధ్యంలో డీపీజీ ద్వారకా తిరుమలరావు పది బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందాలు కొన్ని కంప్యూటర్ల హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకుంది. కాగా, సోమవారం ఉదయమే సబ్ కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ గౌతం తేజతో పాటు ఆర్డీఓ హరిప్రసాద్, ఆయనకు ముందు ఆర్డీఓగా, (ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న మురళీని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వారితో పాటు ఇంకొందరు సిబ్బంది, అధికారుల సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసిన పోలీసులు కాల్ డేటా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పది రోజులుగా కార్యాలయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
రెవెన్యూ సిబ్బందిలో దడ
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం ఘటన ప్రకంపనలు కార్యాలయాలకు కూడా వ్యాపించాయి. రికార్డులు కాలిపోయిన నేపథ్యంలో వాటి మూలాలను తహసీల్దార్ కార్యాలయాల్లో పట్టుకునేందుకు డివిజన్ లోని 11 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22/ ఏ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో గుబులు బయలుదేరింది. ఇందుకోసం అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కొన్ని బృందాలు ఏర్పాటు చేశారు. వారి డివిజన్లోని తహసీల్దార్ కార్యాలయాల నుంచి సబ్ కలెక్టరేట్కు అందిన రికార్డులు, వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం ఐదు బృందాలు ఏర్పాటు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్వో సత్యనారాయణరావు సారధ్యంలో వారు పని చేస్తారు. మదనపల్లె, తంబళ్లపల్లు, పీలేరు నియోజకవర్గాల పరిధిలో రెవెన్యూ రికార్డుల పరిశీలన, ఫైల్ ప్రాసెస్ జరిగిన వ్యవహారంలో మూలాలు శోధించడానికి...

1. రాయచోటి ఆర్డీఓ రంగస్వామి: తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో 22ఏ, లిటిగేషన్ భూముల రికార్డులు, కన్వర్జేషన్ ఫైల్ ప్రాసెస్ వివరాలు సేకరిస్తారు.
2. రాజంపేట ఆర్డీఓ టి. మోహనరావు: మదనపల్లె,నిమ్మనపల్లె మండలాలు
3. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్. రాఘవేంద్ర : వాల్మీకిపురం,కలికిరి మండలాలు
4.స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్. రాము: రామసముద్రం, పెద్దమండ్యం
5.స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలారాణి: పీటీఎం. బీ.కొత్తకోట మండలాల్లో రెవెన్యూ అధికారులు విచారణ జరపడంతో పాటు, వివరాలు సేకరించనున్నారు.
అమరావతి సమీపంలో గనుల శాఖ రికార్డులు దగ్ధం వ్యవహారం జరిగిన రోజుల వ్యవధిలోనే మదనపల్లె సంఘటనపై రాష్ట ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకుంది. శాస్త్రీయంగా ప్రతి ఆధారం సేకరించడం ద్వారా నిందితులు, తెరవెనుక మంత్రాంగం నెరిపిన పెద్ద మనుషుల కుట్రను ఛేదించడానికి ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపింది. దర్యాప్తులో ఇంకా ఎన్ని సంచలనాలు బయటపడతాయనేది వేచి చూడాలి.
Read More
Next Story