సీమ రాజకీయంపై  ఆ ఎమ్మెల్యేల ఆదర్శ సంతకం
x

"సీమ" రాజకీయంపై ఆ ఎమ్మెల్యేల ఆదర్శ సంతకం

రాయలసీమ రాజకీయ అధ్యాయంపై దళిత ఎమ్మెల్యేలు తొలి ఆదర్శ సంతకం చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి. ఆ తరువాత అంతా ఒకటే. అంటున్న వారిద్దరూ ఇంతకీ ఏమి చేశారు? ఓడిని అభ్యర్థి ఇంటికి టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారు?


సిమెంట్ ఇటుకలతో కట్టిన ఇందిరమ్మ ఇల్లు. రేకుల షెడ్డులో మూడు ప్లాస్టిక్ కుర్చీలు. ప్లాస్టిక్ నవారుతో అల్లిన మంచం. ఆ ఇంటి వద్దకు ఎమ్మెల్యే వాహనం వచ్చి ఆగింది. వచ్చిన వ్యక్తి తనను ఈ ఎన్నికల్లో ఓడించిన ప్రత్యర్థి అనే విషయం మరిచిపోయారు. సాదరంగా ఆహ్వానించి, కుశల ప్రశ్నల తర్వాత, కాఫీ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

రాయలసీమ అంటే కక్షలు, ప్రతీకారదాడులు గుర్తుకొస్తాయి. మనుషుల మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగాలు మాత్రం కనిపించవు. ఇవన్నీ ఈ ప్రాంతంలో మెండుగానే ఉంటాయని దళిత ఎమ్మెల్యేలు సమాజానికి సందేశం ఇచ్చారు. నాయకుడనే వ్యక్తి భావాలు ఉన్నతంగా ఉంటే కిందిస్థాయిలోని అనుచరులు కూడా అదే బాటలో సాగుతారని మాటలు వినిపించేలా చేస్తున్నారు.



2024 ఎన్నికల్లో అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ఎమ్మెస్. రాజు విజయం సాధించారు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఈర లక్కప్ప ఓటమి చెందారు. ఇది జరిగి నెల దాటింది. వారిద్దరు సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా అభినందనలు అందుకుంటున్నారు. రాజకీయాలంటే వ్యక్తిగత కక్షలు ఉండకూదదని చాటిచెప్పారు. ఇది అన్ని పార్టీల నేతలకు ఆదర్శం అనడంలో కూడా సందేహం లేదు.

తాజా ఎన్నికల్లో సామాన్యమైన వ్యక్తి, ఉపాధి కూలీగా పని చేస్తూ తర్వాత సర్పంచ్ అయినా వీర లక్కప్ప మడకశిర అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెస్ రాజును ఆ పార్టీ బరిలోకి దించింది. ఇద్దరూ మొదటిసారి ఎన్నికల్లో తలపడిన నేతలే. వారిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఈర లక్కప్పపై 350 ఓట్ల స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఎమ్మెస్ రాజు విజయం సాధించారు.

ఆదర్శం.. వారి పలకరింత


మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు బయలుదేరారు. అదే మార్గంలో ఉన్న మడకశిర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన ఈర లక్కప్ప నివాసం కూడా ఉంది. తన నివాసం వద్ద వాహనం నుంచి దిగి వస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును గమనించిన ఈర లక్కప్ప సాదరంగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించారు. పరస్పరం ఇద్దరు అభినందించుకున్నారు. తరువాత రేకుల షెడ్డు కింద ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో తన వెంట వచ్చిన పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దూరంగా వెళ్లాలని సూచించారు. ఈర లకప్ప.. ఎమ్మెల్యే రాజు కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. పార్టీ విషయాలు కాకుండా కుటుంబాల గురించి ఎమ్మెల్యే రాజు తెలుసుకున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ నవారుతో అల్లిన మంచం పై ఉన్న కాగితం చూపిస్తూ ఇద్దరు చర్చించుకోవడం కనిపించింది. వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో అనే చర్చ సర్వత్ర ఆసక్తి రేకెత్తించింది.

ప్రత్యర్థి ఇంటికి వెళ్లడం వెనక పరమార్ధం ఏమిటని వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. దీనిపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందించారు.

"ఎన్నికల్లో మాత్రమే ప్రత్యర్థులం. ఆ తర్వాత అంత సమానమే" అని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు. "ఎన్నికల ముగిశాక ఇంకా వైరం ఏముంటుంది. మేమంతా కలిసే ఉంటాం. అన్నదమ్ముల్లా సాగుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని ఆ దళిత ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మనసులో మాట చెప్పారు. రాజకీయ విమర్శకులు కూడా మాట రాని పరిస్థితి కల్పించారు.

"అక్షరాస్యత తక్కువ అయినా, ధన బలం లేకున్నా సరే. స్నేహభావంతో మెలిగే మనసు ఉంది" అని గత ఎన్నికల్లో ఓడిన ఈర లక్కప్ప తన గొప్ప మనసును చాటుకున్నారు.

"రాయలసీమ అంటే కక్షలు కార్పన్యాలే కాదు. రాజకీయాలంటే పరస్పరం దెబ్బ తీసుకోవడం కాదు. ఎన్నికల తర్వాత కలిసి పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది" అనే సందేశాన్ని ఆ దళిత నేతలు ఇద్దరు ఇచ్చినట్లు ఉందని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ చలపతి అభివర్ణించారు.

ఆమె కూడా అంతే..

అనంతపురం జిల్లాలోని మరో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సాగుతున్న తీరు కూడా అభినందనలు అందుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిన ఆమె 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8,788 ఓట్లతో విజయం సాధించారు.

ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ 10 రోజులు గడువు ఉండగా, శ్రావణిశ్రీ వడదెబ్బకు గురికావడంతో ఇంటివద్దనే చికిత్సకు పరిమితమయ్యారు. ఆమె లేని లోటు కనిపించకుండా, శ్రావణిశ్రీ అక్క బండారు కిన్నెర, సోదరుడు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.



నోటు పుస్తకాలు ఇచ్చి.. మొక్కలు నాటి

ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత బండారు శ్రావణి శ్రీ చిన్న సూచన చేశారు. "తనను కలవడానికి వచ్చే పార్టీ నాయకులు, అభిమానులు సాలువలు ఫ్లవర్ బొకేలు తీసుకురావద్దు" అన్నారు. " వాటి స్థానంలో పిల్లల ఉపయోగపడే నోటు పుస్తకాలు పెన్నులు, పెన్సిళ్లు ఇవ్వండి " అనివసూచించారు. ఆమె మాటలకు మంచి స్పందన లభించింది. బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా అభిమానులు పార్టీ నాయకులు వినూత్న రీతిలో సంబరాలు నిర్వహించారు. "నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో రోడ్డు పక్కన మొక్కలు నాటి" తమ ఆదర్శాన్ని చాటుకున్నారు.



ప్రమాణ స్వీకారం తర్వాత నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రజలతో మమేకమవుతున్నారు. అందులో ప్రధానంగా పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో పనితీరు మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పల్లెల్లో తనను ఆదరించిన ఓటర్లు ప్రజలను కలుసుకుంటున్న ఆమె, కనీస అవసరాలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అధికారులతో భేటీ అవుతున్నారు.

అనంతపురం జిల్లాలోని మడకశిర, సింగనమల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, బండారు శ్రావణి శ్రీ ప్రత్యర్థి పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులపై వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేయకుండా, ఎమ్మెల్యేలుగా తమ వంతు బాధ్యతలను నిర్వర్తించడం వరకే పరిమితమయ్యారని ఆ జిల్లాలో వినిపిస్తున్న మాట.

రాయలసీమలో సాధారణంగా ఆధిపత్య పోరు ఎక్కువ. అయినా వారిద్దరూ తమ ఆత్మగౌరవాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా, పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తూనే, ఈ నెల రోజుల్లో ప్రజలతో మమేకమవుతున్న తీరు ద్వారా అభినందనలు అందుకుంటున్నారు. వాతావరణం ఇలాగే కొనసాగితే మిగతా ప్రాంతాలకు కూడా వారిద్దరు ఆదర్శం కాగలరని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న కాలంలో రాయలసీమలో ఇలాంటి మార్పులు కల్పిస్తాయి అనేది వేచి చూడాల్సిందే.

Read More
Next Story