పట్టణంలోకి అనుమతి లేదు.. మాజీ ఎమ్మెల్యేపై ఆంక్షలు
ఓ మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ శాఖ బహిష్కరణ వేటు వేసింది? రాయలసీమలో ఈ తరహా సంఘటన ఇదే మొదటిది. ఆ అసెంబ్లీ స్థానంపై పోలీస్ శాఖ ఎందుకు ప్రత్యేక దృష్టి నిలిపింది.
రాయలసీమలో వర్గం, ఫ్యాక్షన్, ఆధిపత్య పోరుకు అనంతపురం జిల్లా తాడిపత్రి వేదికైంది. ఇక్కడ పార్టీలు కాకుండా, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ సోదరుల మధ్య జరుగుతున్న వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీస్ శాఖ బహిష్కరణ వేటు వేసింది. ఎన్నికల ముందు వరకు ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి పోలింగ్ సందర్భంగా రగిలిన కక్షల మంటలు ఆరడం లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికే కాకుండా, జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వవద్దని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇది వైఎస్ఆర్ సీపీకి భారీ షాక్ గానే భావిస్తున్నారు. అది కూడా ఈ తరహా ఆంక్షలు ఎదుర్కొంటున్న నేత కూడా పెద్దారెడ్డే కావడం గమనార్హం.
"పోలీస్ శాఖ అనుమతించే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టవద్దు" అని ఎస్పీ జగదీశ్ ఆదేశించారని సమాచారం. ఆ మేరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డి ఆంక్షల చట్రంలోనే ఉన్నారు.
ఎన్నికల ఫలితాల తరువాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై అనధికారికంగానే ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అక్కడి రాజకీయ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనను జిల్లాలోకి కూడా పోలీసులు అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు.
2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఫ్యాక్షన్ గడ్డగా పేరు పడిన రాయలసీమలో ప్రశాంతంగా జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి, పల్నాడులోని మాచర్ల నియోజవర్గం తరువాత ఆ స్థాయిలో ఎన్నికల వేళ అనంతరం జిల్లా తాడిపత్రిలో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతగా జరిగింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు జేసీ. అస్మిత్ రెడ్డి రెండోసారి పోటీపడ్డారు. పోలింగ్ సందర్భంలో పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గ
శత్రువు జేసీ ప్రభాకరరెడ్డి ఎదురెదురుగా మోహరించారు. టీడీపీ ఏజెంట్ ను బయటికి లాగేశారనే ఆరోపణపై టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతలు రాళ్లు రువ్వుకున్నారు. కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. చివరాఖరికి ఎస్పీ కూడా కష్టంగా తప్పించుకున్నారు.
వీరి వ్యవహారం వల్ల ఎన్నికల వేళ.. ఎన్నికల కమిషన్ ఆగ్రహించింది. పోలీసు అధికారుల్లో జిల్లా ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ, సీఐలపై కూడా వేటు వేసింది. ఆ తరువాత జరిగిన ఘర్షణల్లో నిందితులుగా వైఎస్ఆర్ సీపీ నుంచి 34 మంది, టీడీపీ మద్దతుదారులను 57 మందిని తాడిపత్రి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలావుండగా,
పెద్దారెడ్డి ఎంట్రీతో ఘర్షణ
ఇటీవల కొన్ని రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మద్దతుదారులు ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో ఘర్షణ చెలరేగింది. వైఎస్ఆర్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. "ఆత్మరక్షణ కోసమే తాను లైసెన్డ్ తుపాకీతో బయటికి వచ్చాను అని వ్యాఖ్యానించారు" కాగా, ఈ ఘటనలో కొందరు గాయపడగా, రెండు పక్షాలకు చెందిన కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి.
పత్రాల కోసం వచ్చా...
"ముఖ్యమైన పత్రాలు అవసరం అయ్యాయి. అందుకే నా ఇంటికి రావాల్సి వచ్చింది" అని ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఏదో ఒకకారణంతో ఆయన పట్టణంలోకి రావడానికి ప్రయత్నం చేయడం వల్ల ఘర్షణలకు ఆస్కారం ఏర్పడుతోందని వివరిస్తూ, ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ, అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం డీజీపీకి నివేదించారని సమాచారం. తాడిపత్రిలో రెండు పార్టీల ప్రధాన నేతలు ఉంటే నిత్యం ఘర్షషణలకు ఆస్కారం కలుగుతుందని స్పష్టం చేస్తూ రిపోర్ట్ చేశారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై బహిష్కరణ వేటు వేయడానికి దారితీసినట్లు భావిస్తున్నారు.
దీనిపై వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యేలు తీవ్రంగానే స్పందించారు. అనంతపురం మాజీ ఎమ్మల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి జిల్లా ఎస్పీ జగదీశ్ ను కూడా కలిశారు. "ఓ మాజీ ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేదా" అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే, "మేము పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకుని వెళ్లి, వదిలివస్తాం" అని వ్యాఖ్యానించారు.
అక్కడి నుంచే పోరాటం
"తాడిపత్రి నుంచే జేసీ ప్రభాకరరెడ్డి అరాచకాలపై పోరాటం సాగిస్తా" అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శపథం చేస్తున్నారు. " మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డిని చంపించింది వాళ్లే. నన్ను కూడా చంపాలని చూస్తున్నారు" అని ఆరోపించారు. "అందులో భాగంగానే నా ఇంటిపై దాడి చేశారు" అని అన్నారు.
ఈ విషయమై తాడిపత్రి పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ తో మాట్లాడాలని ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి ప్రయత్నించారు. 94407 96861 నంబర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. చివరికి ఆయనకు ఎస్ఎంఎస్ పంపించినా సమాధానం దొరకలేదు. దీంతో అనంతపురం జిల్లా ఎస్పీ జగదశ్ నుంచి సమాచారం తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించినా, ఆయన కూడా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు.
అంతకు ముందు ఇదే అంశంపై తాడిపత్రి రూరల్ సీఐకి కాల్ చేస్తే, " తాడిపత్రి పట్టణం నా పరిధి కాదన్నారు. "మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారా? లేదా? అనేది కూడా నాకు తెలియదు" అనే సమాధానం వచ్చింది.
ఈ విషయం పై మాట్లాడేందుకు పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారు? అనేది తెలియని పరిస్థితి. సీఐ నుంచి ఎస్పీ వరకు అధికారులందరినీ టీడీపీ కూటమి ప్రభుత్వం దశలవారీగా బదిలీలు చేసింది. అయితే కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. చిన్న కేసులో కూడా ప్రెస్ మీట్లు పెట్టే పోలీస్ అధికారులు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకున్న విషయంలో ఎక్కడా ఆ సమాచారం బహిర్గతం చేసినట్లు లేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నుంచి ఒత్తిడి ఏమైనా ఉందా? అనే సందేహాలకు ఆస్కారం కల్పించారు. ఇదిలావుండగా,
వారి వైరం ఇప్పటిది కాదు...
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ సోదరుల మధ్య వైరం చాలా పాతదే అని చెప్పాలి. తాడిపత్రిపై మొదటి నుంచి మాజీ మంత్రి జేసీ. ప్రభాకరరెడ్డి కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు... మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, ఆ తరువాత కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఈ సెగ్మెంట్లో జేసీ సోదరులకు వ్యతిరేకంగా రాజకీయాలు సాగించారు. సూర్యనారాయణరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి తండ్రి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి స్వయానా అన్న అవుతారు. కాగా, వారే రెండు అధికార కేంద్రాలుగా రాజకీయాలు నడిచాయి.
మొదటి నుంచి పెత్తనం
తాడిపత్రి నుంచి 1983లో జేసీ దివాకరరెడ్డి ఓటమి చెందారు. 1985 నుంచి 2009 వరకు ఆరుసార్లు వరుసగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన జేసీ సోదరులు టీడీపీలో చేరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరారు. కాగా,
2014లో జేసీ ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే, అనంతపురం పార్లమెంట్ సీటు నుంచి ఆయన అన్న జేసీ ప్రభాకరరెడ్డి విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో వారిద్దరు పక్కకు తప్పుకున్నారు. జేసీ దివాకరరెడ్డి కొడుకు అనంతపురం ఎంపీగా, ప్రభాకరరెడ్డి కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి, పెద్దారెడ్డి చేతిలో ఓటమి చెందారు.
ఇదంతా ఒక ఎత్తైతే...
2020 డిసెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెండు వాహనాల్లో మందీమార్బలంతో జేసీ ప్రభాకరరెడ్డి నివాసంపైకి దండెత్తారు. ఆ సమయంలో ప్రభాకరరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన భారీ కుర్చీలోనే పెద్దారెడ్డి బైఠాయించారు.
"మన మధ్య వర్గపోరు వద్దు. ప్రజలను రెచ్చగొట్టవద్దు" అని చెప్పడానికే వెళ్లాను అని కేతిరెడ్డి పెద్దారెడ్డి తరువాత మీడియా వద్ద వ్యాఖ్యానించారు.
ఆ రోజు ప్రభాకరరెడ్డి ఇంట్లో ఉండి ఉంటే మాత్రం పరిస్థితి ఎలా ఉండేదో.. అనే చర్చ జరిగింది.
ఈ సంఘటన తెలియడంతో మరుసటి రోజు తన ఇంటికి చేరుకున్న జేసీ ప్రభాకరరెడ్డి తన కుర్చీలో ప్రత్యర్థి కూర్చోవడం భరించలేక, రోడ్డుపై వేసి తగులబెట్టించారు. ఆ తరువాత ఆయన మద్దతుదారులు రంగంలోకి రావడంతో జేసీ, పెద్దారెడ్డి వర్గాల మధ్యం ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
"నా ఇంటిపైకి వచ్చిన ప్రత్యర్థిపై కాకుండా, తాను, తమ అనుచరులపై కేసులు నమోదు చేశారు" అని జేసీ ప్రభాకరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
ఓ ఇంటర్య్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలి..
"నా ఇంటిపై ప్రత్యర్థి దాడి చేశాడు. నా ముందు ఉన్న కర్తవ్యాలు రెండే ఆత్మహత్య చేసుకోవడం లేదా తాడిపత్రికి వెళ్లడం" అనేవే అని జేసీ ప్రభాకరరెడ్డి వ్యాఖ్యానించారు. దశాబ్దాల కాలంగా మాకు అండగా నిలబడిని కుటుంబాలు గుర్తు వచ్చాయి. అంతే.. మరో ఆలోచనకు ఆస్కారం ఇవ్వకుండా తాడిపత్రికి వెళ్లాలనే నిర్ణయించుకున్నా" అని వ్యాఖ్యానించడం గమనార్హం.
రెండు పార్టీలకు సవాల్
ఆ తరువాత కూడా తాడిపత్రిలో చోటుచేసుకున్న సంఘటనలు రెండు పార్టీల మద్దతుదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఘర్షణలు, కేసులతో సతమతం అవుతున్నారు.
2024 ఎన్నికల తరువాత కూడా హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి విజయం సాధించిన తరువాత వారి మద్దతుదారులు ప్రతీకార చర్యలకు దిగారు. శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు చేసి, అధ్యక్షుడి నివాసంలోకి చొరబడిన సంఘటనను మరిపించేలా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ భవంతిలోకి చొరబడి, టీడీపీ జెండా ఎగురవేయడంతో పాటు ఇల్లంతా టపాసుల మోతతో దద్దరిల్లేలా చేశారు.
దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం పట్టణానికి పరిమితం అయ్యారు. మళ్లీ ఆయన ఇటీవల తాడిపత్రిలోకి రావడంతో అల్లర్లు చేలరేగాయి. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా ఆంక్షలు విధించారని తెలుస్తోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు శాంతిభద్రతలు కాపాడడం కూడా సమస్యగానే మారుతోంది. సాధారణ ప్రజలకు ఇది సర్వసాధారణమే. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే చర్చ మాత్రం సాగుతోంది. పట్టణంలో పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు వాతావరణం చెప్పకనే చెబుతోంది.
Next Story