నందమూరి.. నారా ఇంట.. సరికొత్త రికార్డుల మోత..
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ట్రిపుల్ బొనాంజా విజయాలు సాధించారు. ఈ అంశం చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది.
S.S.V.Bhaskar Rao
రాష్ట్రంలో ఓటర్లు విపరీతమైన మార్పు కోరుకున్నారు. అనూహ్యమైన తీర్పు ఇచ్చారు. ఆ క్రమంలో నారా, నందమూరి కుటుంబాల్లో రాజకీయంగా కొత్త రికార్డులు నమోదయ్యాయి. చంద్రబాబు నాయుడు వరుసగా ఏదోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి హ్యాట్రిక్ సాధించారు. బావ చంద్రబాబు, ఇద్దరు అల్లుళ్లతో కలిసి బాలకృష్ణ అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్ర తిరగ రాసిన ఖ్యాతి మాజీ సీఎం ఎన్టీరామారావు చేతక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యానికి ఆయన గండి కొట్టారు. ఆయన వారసుడిగా చలనచిత్ర రంగం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు. అంతేకాకుండా బావ, వియ్యంకుడు అయిన టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు, తన ఇద్దరు అల్లుళ్ళతో కలిసి సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ శాసనసభలోకి మళ్లీ అడుగు పెట్టబోతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో " తెలుగువారి ఆత్మగౌరవం కోసం" తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి నాంది పలకడం ద్వారా మేటి కథానాయకుడు ఎన్టీ రామారావు నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి దేశంలోనే సంచలనం సృష్టించారు. ఆయన తిరుపతి, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి విజయం సాధించారు. ఎన్టీ రామారావు మరణం తర్వాత కూడా ఆయన పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ ను హిందూపురం నియోజకవర్గం ఓటర్లు అక్కున చేర్చుకున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. మూడోసారి 2024 ఎన్నికల్లో కూడా ఆయన 32,597 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు. 1985 ఎన్నికలనాటి నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు హిందూపురం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా నందమూరి వంశస్థులను ఆదరించడంలో ఏమాత్రం ఆలోచన చేయడం లేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
కుప్పంలో చంద్రబాబు సరికొత్త రికార్డు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ యవనికపై సరికొత్త రికార్డు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానంలో 1989 ఎన్నికల్లో మొదటిసారి గెలుపొందారు అప్పటి నుంచి వరుసగా... ఏడోసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు 48 వేల రికార్డు స్థాయి ఓట్ల మెజారిటీతో గెలుపొంది అధికారపక్ష వ్యక్తులను చిత్తు చేశారు.
అల్లుళ్ళకు రికార్డు మెజారిటీ
నందమూరి బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు కూడా విజయం సాధించారు. అది కూడా బంపర్ మెజారిటీతో గెలవడం విశేషం. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు స్వయానా బావ. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పెద్దఅల్లుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేసి రికార్డు స్థాయిలో 91,413 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే, విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి చిన్న అల్లుడు ఎం. భరత్ రాష్ట్రంలోని మిగతా పార్లమెంటు సభ్యులకు కంటే అధికంగా 4.60 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎన్నికల చరిత్రలో రికార్డు సాధించారు.
విలక్షణమైన తీర్పు
2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబంతోపాటు అటు నారా చంద్రబాబు నాయుడు కుటుంబాలకు సరికొత్త రాజకీయ రికార్డులు నమోదయ్యే అవకాశాన్ని ఓటర్లు కల్పించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నారా చంద్రబాబు నాయుడు పాలకపగ్గాలు. గత ఐదు ఎండలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆర్థిక అంశాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గాడిన పెట్టడం అంత సులువైన మార్గమేమీ కాదు. ఈ ఐదేండ్లు వారు సాగించే పాలనకు ఎన్నో ముళ్ళబాటలను అధిగమించాల్సిన సవాళ్లు ముందున్నాయి. ఈ వ్యవహారాలు చక్కదిద్దడంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి రాజనీతిని అనుసరిస్తారు, చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు అనే అంశాలపైనే రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.
Next Story