ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక , సత్సంబంధాలు ఉంటాయనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణి, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి తిరుమలకు చేరుకున్నారు. వారికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి, పద్మావతి అతిథి గృహాల సముదాయంలో బస ఏర్పాటు చేశారు.
బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకలు తీయించడం ద్వారా శ్రీవారికి మొక్కుబడి చెల్లించారు. ఆ తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కుబడులు చెల్లించడానికి ఆలయం వద్దకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం శ్రీవారి ఆలయంలోకి వెళ్ళింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబానికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసినందువల్ల, సాగునీటికి కూడా ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు.
తిరుమలలో తెలంగాణ సత్రం
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు సేవలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని భావిస్తోందని ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తిరుమల కొండపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సత్రం నిర్మాణం, వీలైతే కళ్యాణ మండప నిర్మాణానికి అనుమతించాలని ఆయన కోరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వ సీఎంను కలిసి మాట్లాడతామని స్పష్టం చేశారు.